అంచనాలు ఎందుకు తప్పాయంటే….?

ఉత్తరప్రదేశ్ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం. 80 లోక్ సభ స్థానాలు విస్తరించి ఉన్న ఈ రాష్ట్రం ఢిల్లీకి దగ్గరన్న పేరుంది. ఇక్కడ అత్యధిక స్థానాలను సాధించే పార్టీనే [more]

Update: 2019-05-31 16:30 GMT

ఉత్తరప్రదేశ్ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం. 80 లోక్ సభ స్థానాలు విస్తరించి ఉన్న ఈ రాష్ట్రం ఢిల్లీకి దగ్గరన్న పేరుంది. ఇక్కడ అత్యధిక స్థానాలను సాధించే పార్టీనే ఢిల్లీ పీఠాన్ని హస్తగతం చేసుకుంటుందన్న వాదన ఉంది. ఈ వాదనలు ఎలా ఉన్నప్పటికీ ఢిల్లీని ఆనుకుని ఉన్న ఈ రాష్ట్రం దేశ రాజకీయాలకు గుండెకాయ వంటిది. అనేకమంది ప్రధానులు ఈ రాష్ట్రం నుంచి ఎన్నికయిన వారే. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ వారయినప్పటికీ వారణాసి నుంచి ఎన్నికయ్యారు. 2014లోనూ ఇదే రాష్ట్రం నుంచి ఎన్నిక కావడం విశేషం. ఈసారి మరింత మెజారిటీతో ఎన్నికయ్యారు.

రికార్డు స్థాయిలో…..

మొత్తం 80 స్థానాలకు గాను 2014 లో 71 స్థానాలను సాధించి బీజేపీ రికార్డు సృష్టించింది. మరో రెండు స్థానాలు మిత్రపక్షమైన అప్నాదళ్ వశమయ్యాయి. ఐదు స్థానాలు సమాజ్ వాదీ పార్టీకి దక్కాయి. అమేధీ, రాయబరేలీలో కాంగ్రెస్ విజయం సాధించింది. అయిదేళ్ల అనంతరం పరిస్థిితిని పరిశీలిస్తే రాష్ట్రంలో బీజేపీ, మోదీ పీఠం కైవసం చేసుకోవడం కష్టమన్న వాదనలు విన్పించాయి. బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా మాత్రమే అవతరిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమయింది. సమాజ్ వాదీపార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ పొత్తు నేపథ్యంలో బీజేపీకి నూకలు చెల్లినట్లేనన్న విశ్లేషణలు కూడా వెలువడ్డాయి. వీటిని తిప్పి కొడుతూ బీజేపీ ఘన విజయం సాధించి మొత్తం 80 స్థానాల్లో 64 స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని శక్తిగా నిలిచింది.

గతంకన్నా తక్కువే అయినా….

గతంకన్నా 9 సీట్లు తక్కువైనప్పటికీ బీజేపీ గౌరవప్రదమైన సీట్లు సాధించిందన్న అభిప్రాయం వ్యక్తమయింది. సమాజ్ వాదీ పార్టీ ఐదు సీట్లకే పరిమితమయింది. 2014లోనూ దానికి వచ్చింది ఐదు సీట్లే కావడం గమనార్హం. 2014లో రెండుసీట్లు సాధించిన కాంగ్రెస్ ఈసారి ఒక్క స్థానానికే పరిమితమయింది. రాయబరేలీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ విజేతగా నిలిచారు. కానీ అమేధీలో రాహుల్ గాంధీ ఓడిపోవడం గమనార్హం. ఆయనను బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఓడించారు. ఈ ఐదేళ్లలో రాహుల్ గాంధీ 17 సార్లు పర్యటించినా ఫలితం లేకపోయింది. అయితే స్మృతి ఇరానీ 21 సార్లు పర్యటించడం విశేషం. వందకు పైగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేంద్రమంత్రిత్వ నిధులతో పలు అభివృద్థి కార్యక్రమాలు చేపట్టారు. గత ఎన్నికల్లో కనీసం ఖాతా తెరవని బీఎస్పీ 10 స్థానాలను సాధించడం విశేషం. ఒకదశలో ప్రధాని పదవికి పోటీ పడిన మాయావతి పదిసీట్లతో సంతృప్తి పడ్డారు. ఎస్పీ, బీఎస్పీ పొత్తు క్షేత్రస్థాయిలో ఫలితం ఇవ్వలేదు. ఆ పొత్తు సక్రమంగా పనిచేసినట్లయితే పరిస్థితి మరోరకంగా ఉండేది. ఒకరికొకరు విశ్వసించని పార్టీ కార్యకర్తలు చాలా చోట్ల బీజేపీకి ఓట్లు వేశారన్న ప్రచారం ఉంది.

పొత్తు పెట్టుకున్నా…..

ఎస్పీ,బీఎస్పీ పొత్తు నమ్మకాన్ని కల్గించలేకపోయింది. ఒంటరిగా బరిలోకి దిగిన కాంగ్రెస్ చావుదెబ్బతినింది. వందేళ్ల చరిత్ర గల పార్టీ ఒక్క స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఏతావాతా పరిస్థితులు కమలనాధులకు చాలా కలసి వచ్చాయి. గత ఏడాది జరిగిన గొరఖ్ పూర్, పుల్పూరు, కైరానా ఉప ఎన్నికల్లో బీజేపీకి చావుదెబ్బ తగిలినప్పటికీ లోక్ సభ ఎన్నికల్లో బలోపేతం కావడం విశేషం. గొరఖ్ పూర్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ సొంత నియోజకవర్గం. గతంలో ఐదుసార్లు ఇక్కడి నుంచి ఎన్నికైన ఆయన ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించలేకపోయారు. పూల్ పూర్ కూడా అంతే. ఇది డిప్యూటీ ముఖ్యమంత్రి కేశవ్ మౌర్య సొంత నియోజకవర్గం. అయినా ఓటమి తప్పలేదు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి కైరానాలో గెలుపొందారు. అయినప్పటికీ సాధారణ ఎన్నికల్లో బీజేపీ అన్ని అడ్డంకులను అవలీలగా అధిగమించి మంచి ఫలితాలను సాధించింది. ఏటా రైతులకు ఆరువేలు ఆర్థికసాయం ఆకట్టుకుంది. ఈబీసీలకు పదిశాతం రిజర్వేషన్లు ఓటర్లపై ప్రభావం చూపింది. ట్రిపుల్ తలాక్ ను నిషేధించేలా చర్యలు తీసుకున్న ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయం కూడా సానుకూల ఫలితాన్నే ఇచ్చింది. హిందుత్వ నినాదం బీజేపీకి మంచి మేలు చేసింది. మొదటి నుంచి ఈ నినాదాన్ని అనుసరిస్తున్న బీజేపీ ఈసారి మరింత బలంగా దానిని ప్రజల్లోకి తీసుకెళ్లింది. బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేదు. బాలాకోట్ దాడులు సహా జాతీయ భద్రతకు సంబంధించిన అనేక అంశాలు బీజేపీకి మేలు చేశాయి. రాష‌్ట్రంలో సైనికుల కుటుంబాలు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నాయి. అంతిమంగా మోదీ, అమిత్ షా జోడీ వ్యూహరచన మంచి ఫలితాన్ని అందించింది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News