ఇద్దరి జుట్లూ మోడీ చేతిలోనే ?

ఏపీ రాజకీయం బహు చిత్రంగా ఉంది. బీజేపీకి ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే గెలిచిన వారు లేకపోయినా కూడా ఒక ఆట ఆడించేస్తోంది. అదే తెలంగాణాలో నాలుగు ఎంపీ [more]

Update: 2020-06-17 00:30 GMT

ఏపీ రాజకీయం బహు చిత్రంగా ఉంది. బీజేపీకి ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే గెలిచిన వారు లేకపోయినా కూడా ఒక ఆట ఆడించేస్తోంది. అదే తెలంగాణాలో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్నా కూడా కేసీఆర్ ని అంగుళం కూడా కదపలేకపోతున్న బీజేపీకి ఏపీలో మాత్రం రాజకీయం రెడ్ కార్పెట్ పరుస్తోంది. చంద్రబాబు, వైఎస్ జగన్ ఎవరు సీఎం అయితేనేమి, హవా బీజేపీదే. ఇద్దరూ ఇద్దరే. ఒకరంటే ఒకరికి పడదు. పిట్ట పోరు పిల్లి తీర్చిన చందంగా ఏపీలో పెద్దన్న పాత్ర అంటే బీజేపీదే.

హుషారుగా….

బీజేపీకి ఏపీలో జగన్ రాజకీయంగా తగ్గిపోవాలి. అదే సమయంలో చంద్రబాబు అసలు లేవకూడదు. ఇద్దరికి ఇద్దరూ జనాల్లో చులకన కావాలి. అపుడే ఏపీ ప్రజలు కమలం వైపు కన్నెత్తి చూసేది. ఈ స్ట్రాటజీతోనే ఇన్నాళ్ళూ బీజేపీ ఎదురుచూసింది. ఇపుడు అదే జరగబోతోంది. ఏపీలో జగన్ దూకుడుగా ఉన్నారు. చంద్రబాబు పార్టీ మీద ఉక్కుపాదం మోపుతున్నారు. గత అయిదేళ్లలో జరిగిన అవినీతి మీద విచారణ వేగం పెంచారు. దాంతో జగన్ నిర్ణయాలను ఎపుడూ వ్యతిరేకించే కన్నా లక్ష్మీనారాయణ లాంటి వారు సైతం స్వాగతం అంటున్నారు. జగన్ అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేస్తే శభాష్ అంటూ మరిన్ని కుంభకోణాల సంగతేంటి అని బీజేపీ పెద్దలు రెచ్చగొడుతున్నారు.

సీబీఐ వేస్తే ….?

ఇక చంద్రబాబు సర్కార్ అవినీతి మీద జగన్ సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నారు. అదే జరిగితే బాబుకు కూడా కష్టాలు తప్పేట్లు లేవు. బాబును జైలు ఊచలు లెక్కబెట్టించాలన్నది జగన్ టార్గెట్. బీజేపీకి కూడా కావాల్సింది అదే. చంద్రబాబు మీద కేసులు ఫైల్ అయితే ఆయన కోర్టుల చుట్టూ తిరిగితే అపుడు ఆయన కూడా తమ అదుపులో ఉంటాడన్నది బీజేపీ పక్కా వ్యూహం. ఇక ఏపీలో టీడీపీ కూడా తగ్గిపోతుందని, బాబునే ఇబ్బందులు పెడితే తమ్ముళ్లు కచ్చితంగా వైసీపీ వైపు వెళ్ళకుండా తమ వైపే వస్తారని దాంతో బలాన్ని పెంచుకుని ఏపీలో అధికారం దిశగా అడుగులు వేయవచ్చునని బీజేపీ ఆలోచన.

కంఫర్ట్ జోన్ లో…..

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కంఫర్ట్ జోన్లో బీజేపీ ఏపీలో ఉంది. అధికారం లేదు కాబట్టి బాధ్యత లేదు. విపక్షం అంటే విమర్శించేందుకే తప్ప గత పాలన తమది కాదు, దాంతో టార్గెట్ అయ్యే చాన్సే లేదు. ఇక రెండు బలమైన పార్టీలు కొట్టుకుంటే సందు చేసుకుని దూరేందుకు బ్రహ్మాండమైన వీలు దొరుకుతుంది. ఇక జగన్ మిత్రుడే, బాబు అంతకంటే మిత్రుడే. అందరూ కలసి రాజకీయ పల్లకీ మోస్తే ఎటువంటి ఆయాస ప్రయాసలు లేకుండా అన్నది అనుకున్నట్లుగా సింహాసనంలో కూర్చోవచ్చు. ఇదీ బీజేపీ తెలివైన రాజకీయ ఎత్తుగడ. ఏపీ రాజకీయాల్లో సుందోపసుందుల మాదిరిగా బాబు జగన్ ఇలాగే కొట్టుకుంటే అది అంతిమంగా కమలానికే భారీ రాజకీయ లాభమని కూడా విశ్లేషణలు ఉన్నాయి.

Tags:    

Similar News