మళ్ళీ బొత్స దూకుడు ?

వైసీపీ సర్కార్ లో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నది తెలిసిందే. ఆయన ఉత్తరాంధ్ర జిల్లాలలో బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు. బొత్స సత్యనారాయణ గత [more]

Update: 2021-08-29 14:30 GMT

వైసీపీ సర్కార్ లో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నది తెలిసిందే. ఆయన ఉత్తరాంధ్ర జిల్లాలలో బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు. బొత్స సత్యనారాయణ గత రెండున్నరేళ్లలో వైసీపీ తరఫున గట్టిగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ అవి వేళ్ల మీద లెక్కపెట్టాల్సిందే. బొత్స వంటి దూకుడు కలిగిన మంత్రి నోరు కొన్నాళ్ళుగా సైలెంట్ అయింది. పాలసీ డెసిషన్ల మీదనే ఆయన మాట్లాడుతున్నారు. పైగా ఆయన చేస్తున్న కామెంట్స్ లో కొన్ని వివాదంగా కూడా మారుతున్నాయి. మరి బొత్స సత్యనారాయణ ఉన్నట్లుండి ఎందుకు ఇంతలా స్పీడ్ పెంచారు అన్నదే ఆసక్తిని కలిగించే పాయింట్.

తేనే తుట్టె అది….

మూడు రాజధానుల గురించి ఇపుడు మాట్లాడడం అంటే అది తేనే తుట్టెని కదిపి ప్రమాదాన్ని కోరి తెచ్చుకోవడమే. బొత్స సత్యనారాయణ మాత్రం అదేమీ కాదు అన్నట్లుగా మాట్లాడేస్తున్నారు. అంతే కాదు ఆయన చాలానే మీడియా ముందుకు వచ్చి చెప్పేస్తున్నారు. దాంతో వైసీపీలో కూడా విస్మయం కలుగుతోంది. మూడు రాజధానులు తధ్యమని బొత్స సత్యనారాయణ అన్నారు. అదే విధంగా కోర్టుకు తమ వాదనలు వినిపించి ఒప్పించి విశాఖకు రాజధాని తరలిస్తామని కూడా పేర్కొన్నారు. ఇంతవరకూ బాగానే ఉంది అనుకున్నా అమరావతి రైతులతో చర్చించే ముచ్చట అసలు లేనే లేదు అనేశారు. అక్కడే వివాదం అయి కూర్చుంది. మరో వైపు మూడు రాజధానుల విషయంలో జగన్ ఆలోచనలకు భిన్నంగా బొత్స సత్యనారాయణ రియాక్ట్ అవుతున్నారా అన్న ధర్మ సందేహాలు కూడా వైసీపీలో కలుగుతున్నాయట.

మౌనంగానే …?

జగన్ ఆదిలో మూడు రాజధానులు అంటూ బాగానే మాట్లాడేవారు. అయితే గత కొన్నాళ్ళుగా జరుగుతున్న పరిణామాలు చూసిన తరువాత ఆయన వ్యూహాత్మకంగా కొంత తగ్గారు. అందుకే ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేళ కూడా ఆ ప్రస్థావన లేకుండానే ప్రసంగం ముగించారు. దానికి కారణం ఊరకే మాట్లాడితే ప్రయోజనం ఏముంది అన్న ఆలోచనతోనే. చేయాల్సింది చేశాక చెబితే బాగుంటుంది అన్న దూరాలోచనతోనే. ఇక కోర్టులలో ఈ కేసు ఉంది. అయినా కూడా కర్నూలు లో న్యాయ రాజధాని వస్తుంది అన్న దానికి సూచికగా లోకాయుక్త ఆఫీసుని జగన్ సర్కార్ ఏర్పాటు చేయించగలిగింది. ఇపుడు కూడా జాగ్రత్తగానే డీల్ చేయాలి అన్నది జగన్ మార్క్ ప్లాన్. కానీ బొత్స సత్యనారాయణ వైఖరి మాత్రం రెచ్చగొట్టేదిగా ఉంది అంటున్నారు. మరి సడెన్ గా ఈ సీనియర్ మంత్రి ఇంతలా రెచ్చిపోవడానికి కారణమేంటి అన్నదే చర్చట.

ఉత్తరాంధ్ర ట్యాగ్ …

బొత్స సత్యనారాయణ మనిషి మాట యాస అంతా కూడా ఉత్తరాంధ్రకు నిలువుటద్ధంగా ఉంటుంది. రాజకీయాల్లో నేతలు ఎవరైనా ఎదగాలి అన్నా ఉనికి గట్టిగా నిలబెట్టుకోవాలి అన్నా కూడా ప్రాంతం, భాష, కులం, మతం వీటినే ఎక్కువగా ముందుకు తెస్తారు. ఇపుడు వైసీపీలో నోరున్న బొత్స సత్యనారాయణ కూడా చేస్తున్న పని అదే. ఆయన తమ ప్రభుత్వ విధానమే పదే పదే చెబుతున్నారు. ఆ చెప్పడం వెనక ఉత్తరాంధ్రా డిమాండ్ ని కూడా వినిపిస్తున్నారు. తనను జగన్ ఏ మాత్రం కాదనలేని విధంగానే ఆయన రాజకీయం ఉందని అంటున్నారు. విశాఖకు రాజధాని ఏ కారణంగా అయినా రాకపోయినా బొత్స సత్యనారాయణ దాన్నే పట్టుకుని అల్లుకుపోయేలాగానే ఈ సరికొత్త పాలిటిక్స్ కి తెర తీశారు అంటున్నారు. మరో వైపు జగన్ తలచుకుని రాజధాని విశాఖకు తెచ్చినా ఆ గొప్పతనంలో తన వాటా కూడా ఉందని నిరూపించుకునే ప్రయ‌త్నమే ఇదని అంటున్నారు. మొత్తానికి బొత్స సత్యనారాయణ కేరాఫ్ ఉత్తరాంధ్రా పేరిట చేస్తున్న దూకుడు జగన్ దృష్టి దాటి పోలేదు అంటున్నారు. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News