బొత్స వారసుడు వచ్చేస్తున్నాడోచ్ .?

రాజకీయాల్లో ఉన్న వారికి పదవులు గ్లామర్. ఆ పదవులు తమ ఇంటి గుమ్మానికి కట్టేసుకోవడానికి వారసులు రావడమే అసలైన పొలిటికల్ గ్రామర్. దీనికి ఎవరూ ఆద్యులూ కారు, [more]

Update: 2020-12-25 14:30 GMT

రాజకీయాల్లో ఉన్న వారికి పదవులు గ్లామర్. ఆ పదవులు తమ ఇంటి గుమ్మానికి కట్టేసుకోవడానికి వారసులు రావడమే అసలైన పొలిటికల్ గ్రామర్. దీనికి ఎవరూ ఆద్యులూ కారు, అతీతులు అంతకంటే కారు. కష్టపడి ఒక స్థానానికి చేరుకోవడానికి ఏళ్ళకు ఏళ్ళు పడుతుంది. అలా అందలం దక్కించుకున్న తరువాత దాన్ని వదులుకోవడం ఎంత బాధ అన్నది రాజకీయ జీవులకే బాగా తెలుసు. అందుకే తమ కష్టం మీద నిర్మించిన పీఠాల మీద వారసులను కూర్చోబెట్టాలనుకోవడం వారి దృష్టిలో ఎంతమాత్రం తప్పు కానే కాదు. ప్రజలకు సేవ చేయడానికి ఎటూ ఒక ప్రతినిధి ఉండాలి. వారు తమ వారసుడు అయితేనేం అన్నదే నయా పొలిటికల్ థియరీ.

జగమంత కుటుంబం…..

నిజానికి బొత్స సత్యనారాయణదే జగమంత కుటుంబం. ఆయన ఒంటరిగా రాజకీయాల్లోకి వచ్చినా కూడా కాస్తా ఎదిగాక వెనకాల తమ్ముడుని తోడు తెచ్చుకున్నాడు. ఇపుడు ఆయన తమ్ముడు అప్పలనరసయ్య గజపతినగరం ఎమ్మెల్యేగా ఉంటున్నాడు. బొత్స చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఉంటూ రాష్ట్ర మంత్రిగా రాణిస్తున్నారు. బొత్స మేనల్లుడు చిన్న శ్రీను లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే కచ్చితంగా జిల్లా పరిషత్ పీఠాన్ని చైర్మన్ హోదాలో అధిరోహిస్తాడు. భార్య బొత్స ఝాన్సీ ఇప్పటికి రెండు మార్లు ఎంపీగా గెలిచారు. మరోసారి 2024కి రెడీగా ఉన్నారు. దగ్గర బంధువులే ఇపుడు విజయనగరం ఎంపీగా బెల్లాల చంద్రశేఖర్ రూపంలో, అలాగే నెల్లిమర్ల, ఎస్ కోట ఎమ్మెల్యేల రూపంలో ఉన్నారు. అనుచరుడుగా ఉన్న శంబంగి చిన అప్పలనాయుడు బొబ్బిలి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలా విజయన‌గరం అంటే బొత్స సత్యనారాయణ తప్ప మరేదీ కనిపించదు అనేలా పొలిటికల్ సీన్ ఉంది.

రెడీ మేడ్ గా…

ఇక ఇపుడు వారసులు వస్తున్నారు. అంటే బొత్స సత్యనారాయణ తరువాత తరం యువతరం అన్నమాట. ఇప్పటికే బొత్స సోదరుడు లక్ష్మణరావు కుమారుడు బొత్స చైతన్య నెల్లిమర్ల సీటు మీద కన్నేసి అక్కడ కలియతిరుగుతున్నారు. ఆయన్ని తన వెంట తిప్పుకుంటూ బొత్స రాజకీయ పాఠాలు కూడా బాగానే చెబుతున్నారు. ఇపుడు వారూ వీరూ కాదు ఏకంగా సొంత కొడుకే రాజకీయాల్లోకి వస్తున్నాడు. అతను ఎవరో కాదు డాక్టర్ సందీప్. వైద్య విద్య పూర్తి చేసిన సందీప్ తొలిసారిగా విజయనగరం జిల్లాలోనీ వీధుల్లోని ఫ్లెక్సీల మీద వెలిశాడు. తాజాగా పుట్టిన రోజు జరుపుకున్న సందీప్ కి జిల్లాలోని వైసీపీ ప్రజా ప్రతినిధులు అంతా అభినందనలు తెలియచేస్తూ మొత్తం ఫ్లెక్సీలు, కటౌట్లతో జిల్లాను నింపేసారు. ఇక విజయవాడలో జరిగిన బీసీ కార్పొరేషన్ల ప్రమాణ స్వీకారానికి తండ్రితో పాటు సందీప్ హాజ‌రై చాలా సైలెంట్ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశాడు. ఇదిపుడు అతి పెద్ద చర్చగా జిల్లా రాజకీయాల్లో ఉంది.

జగన్ దీవెనల కోసం…

ఇక తొందరలోనే కుమారుడిని తన వెంట బెట్టుకుని బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి జగన్ వద్దకు వెళ్తారని అంటున్నారు. జగన్ కి తన కుమారుడిని పరిచయం చేయడం ద్వారా అధికారికంగా పొలిటికల్ ఎంట్రీకి రెడీ చేస్తున్నారు అని చెబుతున్నారు. ఇక మరో మూడున్నరేళ్లలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే కొడుకుని తయారు చేస్తే ఎంపీగానో, ఎమ్మెల్యేగానో ఏదో ఒక సీటు నుంచి పోటీ చేస్తాడని అంటున్నారు. మొత్తానికి సామాజిక బలం, ఆర్ధికబలం, రాజకీయ బలం అన్నీ ఉన్న బొత్స సత్యనారాయణ ఇక కుమారుడిని వారసుడిగా తీర్చిదిద్దేపనిలో ఇపుడు ఫుల్ బిజీగా ఉన్నారని అంటున్నారు.

Tags:    

Similar News