అంతా బొత్స మయం..?

విజయనగరం జిల్లాలో మొత్తం తొమ్మిదికి తొమ్మిది అసెంబ్లీ సీట్లు, ఒక పార్లమెంట్ సీటు వైసీపీ పరం అయ్యాయి. ఇక్కడ టీడీపీకి జీరో స్కోర్ దక్కింది. జిల్లా పుట్టిన [more]

Update: 2020-12-03 03:30 GMT

విజయనగరం జిల్లాలో మొత్తం తొమ్మిదికి తొమ్మిది అసెంబ్లీ సీట్లు, ఒక పార్లమెంట్ సీటు వైసీపీ పరం అయ్యాయి. ఇక్కడ టీడీపీకి జీరో స్కోర్ దక్కింది. జిల్లా పుట్టిన తరువాత టీడీపీ పెట్టిన తరువాత ఆ పార్టీకి జరగని పరాభవం ఇది. అయితే ఇలా జరగడానికి జగన్ ప్రభంజనం అతి ముఖ్య కారణం అని విశ్లేషణలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో మొత్తం జగన్ అయిదు నెలల పాటు పాదయాత్ర చేశారు. ఇందులో రెండు నెలలు విజయనగరంలోనే ఆయన పాదయాత్ర సాగింది. అణువణువూ జగన్ కలియతిరిగి జనాల హృదయాలను దోచారు. దాని ఫలితమే ఈ సునామీ.

బొత్స దూకుడు…..

అయితే సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ వర్గం మాత్రం అంతా తమ వల్లనే సాధ్యపడిందని నాటి నుంచి నేటి వరకూ చెప్పుకునే సాగుతోంది. తాము జిల్లాలో గట్టిగా నిలబడబట్టే వైసీపీకి ఇంతటి భారీ మెజారిటీలు వచ్చాయని, జిల్లా మొత్తం వైసీపీ పరం అయిందని గట్టిగానే చెప్పుకుంటున్నారు. దానికి తోడు మొత్తం తొమ్మిది మంది ఎమ్మెల్యేలలో సగానికి పైగా బొత్స సత్యనారాయణ వర్గం కావడంతో మంత్రి గారి హవా మామూలుగా లేదు. జగన్ సైతం బొత్స కోరినట్లుగా టికెట్లు ఇచ్చేశారు. అదే ఇపుడు వైసీపీలో పెద్ద చిచ్చుని రేపుతోంది.

టోటల్ ఫ్యామిలీయేనా …?

మంత్రి బొత్స సత్యనారాయణ చీపురుప‌ల్లి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సోదరుడు అప్పలనరసయ్య గజపతినగరం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. మరో చుట్టం ఎస్ కోట నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇంకో బంధువు నెల్లిమర్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక బొత్సకు సన్నిహితుడు బెల్లాల చంద్రశేఖర్ విజయనగరం ఎంపీగా ఉన్నారు. బొబ్బిలిలో మరో సన్నిహితుడైన శంబంగి చిన అప్పలనాయుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్వతీపురంలో కూడా తన మనిషి జోగారావుకు బొత్స టికెట్ ఇప్పించుకుని ఎమ్మెల్యేగా చేశారు. ఇలా చూసుకుంటే ముగ్గురు తప్ప మిగిలిన వారంతా బొత్స వర్గమే.

నెల్లిమర్లలో కిరికిరి….

ఇపుడు బొత్స సత్యనారాయణ కూటమిలోనే కొత్త ముసలం మొదలైంది అంటున్నారు. నెల్లిమర్లలో ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుకే ఏకంగా ఎసరు పెట్టేలా ఆపరేషన్ మొదలెట్టారని టాక్. బొత్స సోదరుడు లక్ష్మణ రావు నెల్లిమర్లలో హవా చాటుతున్నారు. తనను కాదని ఏ పనీ ఎమ్మెల్యే చేయడానికి వీలులేదని కూడా ఆదేశాలు ఇస్తున్నారని టాక్. అక్కడ బడ్డుకొండ గెలుపులో లక్ష్మణ రావు పాత్ర ఉంది కానీ ఎమ్మెల్యేనే కాదంటే ఎలా అని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ ఇద్దరి మధ్యన విభేదాలు ముదిరి పాకన పడ్డాయని అంటున్నారు. దీంతో స్థానిక ఎన్నికల్లో లక్ష్మణ రావు తన కుమారుడు చైతన్యను రంగంలోకి దించారు. 2024లో తన కుమారుడికే నెల్లిమర్ల టికెట్ అంటూ అపుడే ప్రచారం మొదలెట్టేశారు. ఇక బొత్స సత్యనారాయణ సైతం సోదరుడి కుమారుడితోనే నెల్లిమర్లలో టూర్లు వేస్తున్నారు. మొత్తానికి బొత్స వర్సెస్ బడ్డుకొండగా నెల్లిమర్ల రాజకీయాలు తయారయ్యాయి. తాను జగన్ కే బద్ధుణ్ణి తప్ప ఎవరికీ కాదని తాజాగా బడ్డుకొండ ప్రకటించి బొత్స ఫ్యామిలీని ఢీ కొడుతున్నారు. ఈ గొడవలతో నెల్లిమర్లలో వైసీపీ ఏమవుతుందోనని క్యాడర్ తల్లడిల్లుతోంది

Tags:    

Similar News