సత్తిబాబు సహించలేక పోతున్నాడట

ఆయన ఉత్తరాంధ్రాకే తాను పెద్ద దిక్కు అని ఫీల్ అయ్యే నేత. పైగా విజయనగరం జిల్లా రాజకీయాలను ఒడిసిపట్టిన నాయకుడు. ఒకనాడు పీసీసీ ప్రెసిడెంట్ గా పనిచేసి [more]

Update: 2020-07-29 03:30 GMT

ఆయన ఉత్తరాంధ్రాకే తాను పెద్ద దిక్కు అని ఫీల్ అయ్యే నేత. పైగా విజయనగరం జిల్లా రాజకీయాలను ఒడిసిపట్టిన నాయకుడు. ఒకనాడు పీసీసీ ప్రెసిడెంట్ గా పనిచేసి ముఖ్యమంత్రి రేసులో కూడా ఉన్న పెద్ద మనిషి. అటువంటి బొత్స సత్యనారాయణ వైసీపీలో చేరాక జగన్ సముచిత స్థానం ఇచ్చారు కానీ ఇపుడు జరుగుతున్న పరిణామాలు చూస్తూంటే ఆయన కూడా అందరిలో ఒకడు అన్నట్లుగా ఉంది. తనకంటే రాజకీయంగా జూనియర్లకు పదవులు లభిస్తూంటే మౌనంగా చూడడమే బొత్స సత్యనారాయణకు మిగిలింది అంటున్నారు. తన సొంత జిల్లాలో తన కూతురు వయసు ఉన్న పుష్ప శ్రీవాణిని ఉప ముఖ్యమంత్రిని చేశారు జగన్. ఆమె రాజకీయ జీవితం గట్టిగా ఆరేళ్ళు మాత్రమే. కానీ జిల్లాలో ప్రోటోకాల్ ప్రకారం చూస్తే ఆమెదే అగ్ర తాంబూలం. గత ఏడాది కాలంగా దీంతోనే రగులుతున్న బొత్సకు ఇపుడు మరో బాధ తోడు అయింది అంటున్నారు.

సబ్ జూనియర్ గా …..

ఇక పొరుగు జిల్లా శ్రీకాకుళంలో ధర్మాన క్రిష్ణ దాస్ 2009 వరకూ ప్రభుత్వ ఉద్యోగి మాత్రమే. ఆయన తమ్ముడు ప్రసాదరావు రాజకీయంగా చురుకుగా ఉండేవారు, మంత్రిగా పనిచేసేవారు. అటువంటి క్రిష్ణ దాస్ కి ఇపుడు ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. పైగా అత్యంత‌ కీలకమైన రెవిన్యూ శాఖ కూడా ఇచ్చి జగన్ ఒక్కసారిగా ఆయన్ని ఆకాశంలో నిలబెట్టారు. ఈ పరిణామంతో ఉత్తరాంధ్రా రాజకీయాల్లో నంబర్ వన్ ర్యాంక్ దాసన్నకే వెళ్ళిపోతోంది. బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ దీన్ని తలచుకునే మధనపడుతున్నారని టాక్ వినిపిస్తోంది.

ఆశించినా….?

నిజానికి బొత్స సత్యనారాయణ జగన్ తరువాత సీటు తనదేనని గట్టిగా నమ్మారు. తనకు కనీసం ఉప ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని కూడా ఆశించారు. కానీ తనకు దక్కకపోగా జూనియర్లకు జగన్ పట్టడం కట్టడంతో ఆయన రెండు విధాలుగా బాధపడుతున్నారట. తాను పార్టీ కోసం ఎంతో చేశానని, తన స్థాయిని, హోదాను పక్కన పెట్టి మరీ వైసీపీలో చేరానని, జగన్ కి అన్ని విధాలుగా అండగా నిలబడ్డానని కూడా అంటున్నారుట. ఇక విజయనగరం జిల్లా మొత్తానికి మొత్తం స్వీప్ చేయించిన ఘనత కూడా తనదేనని ఆయన చెప్పుకుంటున్నారుట. ఇంత చేసినా తనకు తగిన గుర్తింపు ఇటు పార్టీలోనూ, అటు ప్రభుత్వంలో దక్కలేదని అంటున్నారుట.

అందుకేనా…?

అయితే జగన్ కి ఎవరిని ఎలా పెంచాలో, ఎక్కడ ఉంచాలో బాగా తెలుసు అంటున్నారు తాజా పరిణామాలను జాగ్రత్తగా గమనించిన వారు. జగన్ విధేయతకు పెద్ద పీట వేస్తారని, అదే సమయంలో ఎవరు ఎదిగినా కూడా తన ముద్ర అక్కడ స్పష్టంగా ఉండాలనుకుంటారని చెబుతారు. క్రిష్ణ దాస్ అంకితభావం, నిబద్ధతే జగన్ కి నచ్చి కీలకమైన పదవులు కట్టబెట్టారని అంటున్నారు. అదే బొత్స సత్యనారాయణ విషయంలో జగన్ కి ఇప్పటికీ పూర్తి గురి కుదరలేదని కూడా విశ్లేషిస్తారు. బొత్స పీసీసీ చీఫ్ గా ఉన్నపుడు జగన్ కుటుంబాన్ని ఎన్ని మాటలు అన్నదీ ఆయనకు ఇప్పటికీ గుర్తుందని కూడా అంటారు. అయితే రాజకీయం కాబట్టి అవసరాల దృష్ట్యా బొత్స సత్యనారాయణను వైసీపీలో చేర్చుకుని సమాదరించినా పూర్తిగా ఆయననే కీలక నేతగా చేసే సాహసం జగన్ ఎపుడూ చేయరని అంటున్నారు. పైగా వైసీపీ ద్వారా ఎదిగిన నాయకులనే జగన్ భవిష్య‌త్తులో కూడా ముందుకు తెస్తారని, కాంగ్రెస్ వాసనలు ఉన్నవారు, సామంతరాజుల మాదిరిగా హవా చలాయించాలనుకుంటున్న వారిని జగన్ ఒక కంట కనిపెడుతూనే ఉంటారని వైసీపీలో వినిపిస్తున్న మరో మాట.

Tags:    

Similar News