బొత్స ఇంట్లో ఈగ‌ల మోత‌.. బ‌య‌ట ప‌ల్లకీ మోత..?

ఉత్తరాంధ్రకు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, మంత్రి ఒక‌రు రాష్ట్ర వ్యాప్తంగా చక్రం తిప్పుతున్నా.. త‌న సొంత జిల్లాలో మాత్రం ఆయ‌న వ్యూహాలు ప‌నిచేయ‌డం లేదట‌! రాష్ట్రం మొత్తానికి [more]

Update: 2020-05-22 02:00 GMT

ఉత్తరాంధ్రకు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, మంత్రి ఒక‌రు రాష్ట్ర వ్యాప్తంగా చక్రం తిప్పుతున్నా.. త‌న సొంత జిల్లాలో మాత్రం ఆయ‌న వ్యూహాలు ప‌నిచేయ‌డం లేదట‌! రాష్ట్రం మొత్తానికి నేను మంత్రిని అన్నా కూడా అయితే ఏంటి? అనే స‌మాధాన‌మే త‌న సొంత జిల్లా నేత‌ల నుంచి వినిపిస్తోంద‌ని ఆయ‌న వాపోతున్నారు. దీంతో ఆయ‌న వ్యవ‌హారం రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చకు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. విష‌యంలోకి వెళ్తే.. స‌ద‌రు మంత్రి వ‌ర్యులు ఎవ‌రోకాదు.. విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన కీల‌క నాయ‌కుడు, సీనియ‌ర్ మోస్ట్ నేత బొత్స స‌త్యనారాయ‌ణ‌. రాష్ట్ర వ్యాప్తంగా బొత్స అన్ని విష‌యాల‌పైనా మాట్లాడుతున్నారు. మ‌రీ ముఖ్యంగా కీల‌క‌మైన రాజ‌ధాని విష‌యంలోనూ ఆయ‌న విప‌క్షాల‌కు కౌంట‌ర్లు ఇచ్చారు.

ప్రభుత్వానికి అన్ని విషయాల్లో….

అదే స‌మ‌యంలో టీడీపీకి కౌంట‌ర్లు ఇవ్వడంలోనూ బొత్స స‌త్యనారాయ‌ణ‌ దూకుడుగానే ఉన్నారు. జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితంగా ఉంటూ.. ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల‌ను కూడా ఆయ‌న కీల‌కంగానే వ్యవ‌హ‌రిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప‌త్రిక‌ల్లో వ‌చ్చే క‌థ‌నాల‌కు కూడా బొత్స స‌త్యనారాయ‌ణ‌ కౌంట‌ర్లు ఇవ్వడం తెలిసిందే. బొత్స అటు విజ‌య‌న‌గ‌రం జిల్లాతో పాటు కీల‌క‌మైన విశాఖ జిల్లా వ్యవ‌హారాల్లో కూడా చ‌క్రం తిప్పేస్తుంటారు. ఇలా అన్ని విష‌యాల్లోనూ ప్రభుత్వానికి మ‌ద్దతుగా వ్యవ‌హ‌రిస్తున్న బొత్స స‌త్యనారాయ‌ణ‌కు త‌న సొంత జిల్లాలో మాత్రం ఇద్దరు ఎమ్మెల్యేల విష‌యంలో ప‌ప్పులు ఉడ‌క‌డం లేద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఇద్దరు నేతలు మాత్రం….

జిల్లాలో కీల‌క మైన ఇద్దరు నాయ‌కుల‌కు, మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ‌కు మ‌ధ్య తీవ్ర అగాధం చోటు చేసుకుంద‌ని, బొత్సను వారు ఖాత‌రు చేయ‌డం లేద‌ని అంటున్నారు. నువ్వు ఎక్కడైనా మంత్రివేమో కానీ, ఇక్కడ మాత్రం కాదు.. అనే రేంజ్‌లో వారు వ్యవ‌హ‌రిస్తుండ‌డంతో బొత్స స‌త్యనారాయ‌ణ‌ ప్రతి విష‌యంలోనూ ఫెయిల‌వుతున్నార‌ని అంటున్నారు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజ‌న్నదొర , విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్రస్వామి.. బొత్స స‌త్యనారాయ‌ణ‌తో తీవ్రంగా విభేదిస్తున్నారు. వాస్తవానికి వీరంతా కూడా ఒకే పార్టీ నుంచి వ‌చ్చి.. ఒకే పార్టీలో చ‌క్రం తిప్పుతున్నారు. అయితే, త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డంలేద‌ని, త‌మ‌ను బొత్స తొక్కేస్తున్నాడ‌ని ఈ ఇద్దరు నాయ‌కులు భావిస్తున్నారు.

స్థానికసంస్థల ఎన్నికల్లోనూ…

త‌మ‌కు రావాల్సిన మంత్రి ప‌దవుల విష‌యంలోనూ బొత్స స‌త్యనారాయ‌ణ‌ అడ్డుపుల్ల వేశార‌ని, నియోజ‌క‌వ‌ర్గంలోనూ తాము ప‌నులు చేసుకునేందుకు అవ‌కాశం లేకుండా అధికారుల‌ను తొక్కి పెడుతున్నార‌నే భావ‌న వీరిలో ఉంది. దీంతో ఈ ఇద్దరూ కూడా బొత్స స‌త్యనారాయ‌ణ‌కు ఫుల్లు యాంటీగా మారిపోయారు. ఇటీవ‌ల స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్లో మేయ‌ర్‌ టికెట్లు కేటాయించే వ్యవ‌హారం కోల‌గట్ల తీసుకున్నారు. ఈ క్రమంలో త‌న వ‌ర్గానికి చెందిన వారికి 10 మందికి టికెట్లు ఇవ్వాల‌ని బొత్స స‌త్యనారాయ‌ణ‌ లెట‌ర్ రాశారు. అయితే, ఆయ‌న క‌నీసం ప‌ట్టించుకోలేదు. దీంతో బొత్స వ‌ర్గం తీవ్రంగా హ‌ర్ట్ అయింది. ఆయ‌న ఎంత కారాలు మిరియాలు నూరుతున్నా విజ‌య‌న‌గ‌రంలో మాత్రం బొత్స మాట ఎంత మాత్రం చెల్లుబాటు కావ‌డం లేద‌ట‌.

రాజన్న దొర అయితే….

ఇక‌, రాజ‌న్న దొర కూడా బొత్స స‌త్యనారాయ‌ణ‌ను లెక్క చేయ‌డం లేదు. అధికారులు త‌మ మాట వినిపించుకోకుండా బొత్స స‌త్యనారాయ‌ణ‌ చేస్తున్నార‌నే ఆగ్రహంతో ఆయ‌న ఉన్నారు. ఇక వీరిద్దరి మ‌ధ్య కాంగ్రెస్‌లో ఉన్నప్పటి నుంచే విబేధాలు ఉన్నాయి. దీనికి తోడు త‌న‌కు మంత్రి ప‌ద‌వి రాకుండా బొత్స స‌త్యనారాయ‌ణ‌ అడ్డుప‌డ్డార‌న్న కోపం కూడా రాజ‌న్న దొర‌కు ఉంది. దీంతో ఆయ‌న కూడా బొత్సను లెక్క‌చేయ‌కుండా త‌న ప‌నితాను చేసుకుని పోతున్నారు. ఇలా మొత్తంగా బొత్స త‌న సొంత జిల్లాలో హ‌వా చ‌లాయించ‌లేక చ‌తికిల ప‌డుతున్నార‌నే వాద‌న ఈ ఇద్దరు ఎమ్మెల్యేల విష‌యంలో బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News