సత్తిబాబులో కలవరం.. పొగ పెట్టినందుకేనా?

ఉత్తరాంధ్ర జిల్లాల్లో కీల‌క‌మైన విజ‌యన‌గ‌రం జిల్లాలో వైసీపీ ప‌ట్టు సాధించింది. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్ని కల్లో దాదాపు అన్ని స్థానాల‌ను కూడా వైసీపీ త‌న ఖాతాలో [more]

Update: 2020-05-12 06:30 GMT

ఉత్తరాంధ్ర జిల్లాల్లో కీల‌క‌మైన విజ‌యన‌గ‌రం జిల్లాలో వైసీపీ ప‌ట్టు సాధించింది. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్ని కల్లో దాదాపు అన్ని స్థానాల‌ను కూడా వైసీపీ త‌న ఖాతాలో వేసుకుంది. ఈ జిల్లాలో ఉన్న విజ‌య‌న‌గ‌రం ఎంపీ సీటుతో పాటు తొమ్మిదికి తొమ్మిది అసెంబ్లీ స్థానాలు వైసీపీ ఖాతాలోనే ప‌డ్డాయి. ఎస్ కోట‌, విజ‌య‌న‌గ‌రం, బొబ్బిలి లాంటి టీడీపీ కంచుకోట‌ల‌ను కూడా వైసీపీ బ‌ద్దలు కొట్టి దూసుకుపోయింది. తెలుగుదేశం పుట్టాక ఒక్క సారి మాత్రమే ఓడిన నెల్లిమ‌ర్లలోనూ వైసీపీ జెండానే ఎగిరింది. ఇక్కడ నుంచి కీల‌క నేత‌లు వైసీపీ త‌ర‌ఫున విజ‌యం కూడా సాధించారు. అయితే, ఇప్పుడు అదే జిల్లాలో రాజ‌కీయం రోజుకో ర‌కంగా మారుతోంది. నేత‌ల మ‌ధ్య స‌ఖ్యత లేక‌పోవ‌డం స‌హా.. ఒక‌రిపై ఒక‌రు ఆధిప‌త్యం సాధించేందుకు ప్రయ‌త్నిస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. దీంతో జిల్లా రాజ‌కీయాలు ఇటీవ‌ల కాలంలో చాలా ఆస‌క్తిగా మారాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

సత్తి బాబు హవానే…..

మ‌రీ ముఖ్యంగా విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, ప్రస్తుతం మంత్రిగా ఉన్న బొత్స స‌త్యనారాయ‌ణ హ‌వా ఎక్కువ‌గా ఉంద‌ని అంటున్నారు. ఆయ‌న ఉన్న పార్టీ అధికారంలో ఉంటే ఆయ‌న‌దే హ‌వా న‌వ‌డాలి.. ఈ విష‌యంలో ఆయ‌న‌కు ఎంత మంది శ‌త్రువులు ఉన్నా పొగ‌పొట్టేస్తారు. అందుకే ఆయ‌న తీరుతో వేగ‌లేక అటు బొబ్బిలి సోద‌రులు వైసీపీకి బైబై చెప్పి అప్పట్లో టీడీపీకి వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్రస్వామితోనూ ఆయ‌న ఏ మాత్రం ప‌డ‌డం లేదు. ఇక ఇప్పుడు మ‌రో సొంత పార్టీ నేత‌తోనే బొత్సకు వార్ మొద‌లైంద‌ని జిల్లాలో వినిపించే టాక్‌.

క్యాస్ట్ పాలిటిక్స్ తోనే…?

విజ‌య‌న‌గ‌రం నుంచి ఎంపీగా విజ‌యం సాధించిన బెల్లాన చంద్రశేఖ‌ర్‌.. కూడా త‌న‌దైన శైలిలో రాజ‌కీయాలు చేస్తున్నారు. నిజానికి బొత్స క‌న్నా బెల్లాన రాజ‌కీయంగా దూకుడు లేక‌పోయినా.. ఆధిప‌త్యం విష‌యంలో మాత్రం బొత్సతో పోటీ ప‌డుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. బెల్లాన బొత్స స్థాయి వ్యక్తి అవునా ? కాదా ? అన్నది ప‌క్క‌న పెడితే 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఇదే బొత్సను ఢీ కొట్టారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలో ఎక్కువ‌గా క్యాస్ట్ పాలిటిక్స్ బాగా ప‌నిచేశాయి. కాపు ఓటింగ్ గ‌త ఎన్నిక‌ల్లో భారీగా వైసీపీకి ప్లస్ అయ్యింది. వాస్తవానికి ఓట్ల చీలిక‌.. విజ‌య‌న‌గ‌రంలో ఎప్పుడూ ఉండేది.. బీసీల్లో బ‌లంగా ఉన్న ఓ వ‌ర్గం ఒక ఓటు ఎమ్మెల్యేకి త‌మ వ‌ర్గానికి చెందిన వ్యక్తికి వేస్తే… మ‌రో ఓటు ఎంపీకి వేస్తారు. అంటే ఎంపీగా పోటీ చేసే అశోక్ గ‌జ‌ప‌తిరాజు లేదా మ‌రో నేత‌ వైపు మొగ్గు చూప‌డం ఇక్కడ ఎక్కువుగా జ‌రుగుతోంది.

ఎవరితోనూ సఖ్యత లేదు….

ఇక‌, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఇద్దరూ బీసీ నాయ‌కులే అయిన బెల్లాన , బొత్స పోటీ చేయ‌డంతో కుల ప్రభావం గ‌ట్టిగా ప‌నిచేసి ఇద్దరూ విజ‌యం సాధించారు. అయితే, నేత‌ల మ‌ధ్య స‌ఖ్యత లేని కార‌ణంగా జిల్లా వ్యాప్తంగా పార్టీపై అభివృద్ధి / జిల్లా అభివృద్ధిపై ప్రభావం పెద్దగా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు. దీంతో రాజ‌కీయంగా జిల్లా లో గ్యాప్ క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. బొత్సకు ఇప్పటికే అటు కోల‌గ‌ట్ల, ఇటు డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి నుంచి ఏజెన్సీలోని కురుపాం, సాలూరు నియోజ‌క‌వ‌ర్గ నేత‌ల‌తో ప‌డ‌డం లేదు.

తన సామాజిక వర్గానికే……

త‌మ‌ను అణ‌గ‌దొక్కేందుకు గ్రూపు రాజ‌కీయాలు ఎంక‌రేజ్ చేయ‌డం వీరికి న‌చ్చడం లేదు. ఇక మ‌రో సీనియ‌ర్ నేత పీడిక‌ల రాజ‌న్న దొర‌తో బొత్సకు ఎప్పటి నుంచో వైరం ఉంది. అటు రాజ‌న్నదొర‌కు, ఇటు కోల‌గ‌ట్లకు మంత్రి ప‌ద‌వి రాకుండా బొత్సే అడ్డు ప‌డ్డార‌ని ఆ వ‌ర్గం నేత‌ల ఆరోప‌ణ‌. ఇక ఇప్పుడు బెల్లాన త‌న క‌న్నా జూనియ‌ర్ అయినా కూడా యంగ్‌స్టర్‌, ఓకే సామాజిక వ‌ర్గానికి చెందిన వ్యక్తి కావ‌డం.. పైగా త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన చీప‌రుప‌ల్లికి చెందిన వాడు కావ‌డంతో పాటు జిల్లాలో త‌న‌కు వ్యతిరేకంగా ఉన్న కొన్ని వ‌ర్గాలు బెల్లాన‌కు స‌పోర్ట్ చేస్తుండ‌డంతో బొత్సలో క‌ల‌వ‌రం మొద‌లైంద‌ట‌.

అంతర్గత విభేదాలతో….

అదే స‌మ‌యంలో రెండు వ‌ర్గాల మ‌ధ్య అంత‌ర్గత కుమ్ములాట‌లు కూడా పెరిగాయ‌ని అంటున్నారు. జిల్లాలో చీపురుప‌ల్లి, గ‌‌జ‌ప‌తిన‌గ‌రం, నెల్లిమ‌ర్లలో బొత్స కుటుంబ స‌భ్యులే ఎమ్మెల్యే ఉన్నారు. దీంతో ఈ మూడు చోట్లతో పాటు జిల్లా కేంద్రమైన విజ‌య‌న‌గ‌రంలో క‌లుపుకుని నాలుగు చోట్ల ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే గ్రూపుల మ‌ధ్య చాప‌కింద నీరులా యుద్ధం న‌డుస్తోందంటున్నారు. ప్రస్తుతానికి ఈ ర‌గ‌డ రోడ్డున ప‌డ‌క పోయినా.. స‌హ‌కారం మాత్రం ఇద్దరి నేత‌ల మ‌ధ్య పెద్దగాలేద‌ని అంటున్నారు. ఈ ప‌రిణామాలు జిల్లా వైసీపీ రాజ‌కీయాల‌ను ప్రభావితం చేయ‌డం ఖాయం.

Tags:    

Similar News