ఎక్కడా సందు దొరికినా వదిలిపెట్టడం లేదుగా?

దక్షిణాది రాష్ట్రంలో పుట్టి… ఉత్తరాదిలో ఎదిగిన ఎంఐఎం ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా పోటీకి సై అంటుంది. బీహార్ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో గెలిచి ఊపు మీదున్న [more]

Update: 2020-12-23 17:30 GMT

దక్షిణాది రాష్ట్రంలో పుట్టి… ఉత్తరాదిలో ఎదిగిన ఎంఐఎం ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా పోటీకి సై అంటుంది. బీహార్ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో గెలిచి ఊపు మీదున్న ఎంఐఎం ఇప్పుడు త్వరలో జరగనున్న వివిధ రాష్ట్రాల ఎన్నికలపై దృష్టి సారించింది. పశ్చిమ బెంగాల్ లో పోటీ చేస్తామని ఇప్పటికే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్కడ మమత బెనర్జీతో కలసి పోటీ చేయాలని ఎంఐఎం ఆసక్తి చూపుతుంది. 92 నియోజకవర్గాల్లో మైనారిటీలు ప్రభావం చూపనుండటంతో మమత కూడా ఎంఐఎంను జత చేర్చుకునే అవకాశముంది.

తమిళనాడు ఎన్నికల్లో….

ఇక తాజాగా తమిళనాడు ఎన్నికలలోనూ పోటీ చేసేందుకు ఎంఐఎం సిద్ధమవుతుంది. తమిళనాడులోనూ వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ నుంచి పోటీ చేయాలని ఎంఐఎం ఇప్పటికే నిర్ణయించింది. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ముస్లింలు ప్రభావం చూపనున్నారు. ఆ స్థానాల్లో మాత్రమే పోటీ చేయాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ భావిస్తున్నారు. ఈ మేరకు తమిళనాడు ఎంఐఎం నేతలతోనూ అసదుద్దీన్ మాట్లాడారు.

కమల్ హాసన్ తో కలిసి……

అయితే తమిళనాడులో కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్ తో కలసి నడవాలని ఎంఐఎం నిర్ణయించింది. తమిళనాడులో ఇప్పటికే రెండు కూటములు బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ ఉన్న డీఎంకే కూటమి, బీజేపీ ఉన్న అన్నాడీఎంకే కూటమి అధికారం కోసం పాకులాడుతున్నాయి. కమల్ హాసన్ మాత్రం బీజేపీని ఎండగట్టడంలో ఎప్పటికప్పుడు ముందుంటున్నారు. దీంతో కమల్ హాసన్ అసదుద్దీన్ కు నచ్చాడు. కమల్ ఆధ్వర్యంలో తృతీయ కూటమిని ఏర్పాటు చేస్తే అందులో భాగస్వామిగా ఉండాలని ఎంఐఎం భావిస్తుంది.

ఎన్ని పార్టీలున్నా…..

తమిళనాడులో ఇప్పటికే కొన్ని పార్టీలున్నాయి. ఇండియన్ ముస్లింలీగ్, ఆలిండియా ముస్లింలీగ్, తమిళనాడు తోహిద్ జమాత్ వంటి పార్టీలున్నాయి. అయినా ఎంఐఎం కు ఇప్పుడు డిమాండ్ పెరిగింది. ఇతర రాష్ట్రాల్లో గెలుస్తుండటంతో స్పెషల్ క్రేజ్ ను ఎంఐఎం తెచ్చుకుంది. తమిళనాడులో మొత్తం 25 స్థానాల్లో పోటీ చేయాలని ఎంఐఎం భావిస్తుంది. మరి తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో ఎంఐఎం సాధారణ విజయాలను సాధించినా దేశవ్యాప్తంగా అసదుద్దీన్ ఒవైసీ ఇమేజ్ మరింత పెరుగుతుందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News