బోర్డర్ మే సవాల్.. ఇద్దరికీ ముఖ్యమే?

సరిహద్దు వివాదాలు ఇరుగు పొరుగు దేశాల మధ్య చిచ్చు రేపుతాయి. చివరకు యుద్దాలకు దారితీస్తాయి. అంతిమంగా అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటాయి. ఇప్పుడు ఒకే దేశంలోని కొన్ని [more]

Update: 2021-02-09 16:30 GMT

సరిహద్దు వివాదాలు ఇరుగు పొరుగు దేశాల మధ్య చిచ్చు రేపుతాయి. చివరకు యుద్దాలకు దారితీస్తాయి. అంతిమంగా అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటాయి. ఇప్పుడు ఒకే దేశంలోని కొన్ని రాష్టాల వైఖరులు ఇదే తీరున ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సంయమనం పాటించాల్సిన రాష్రాధినేతలే స్వయంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తుండటం దిగజారుతున్న రాజకీయ విలువలకు దర్పణం పడుతుంది. ఉభయులూ కూర్చొని, సామరస్యంగా పరిష్కరించుకోవాలసిన విషయాన్ని వీథి గొడవల స్థాయికి తీసుకెళ్లడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. మహారాష్ర్ట, కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం ఇప్పుడు మంటలను రాజేస్తోంది. కర్టాటక పరిధిలో ఉన్న మరాఠా ప్రాంతాలను తిరిగి తమ రాష్ర్టంలో కలుపుకొని తీరుతామని, అదే మరాఠా అమర వీరులకు సమర్పించే అసలైన నివాళి అని మహారాష్ర్ట ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేసిన ప్రకటనతో రెండు రాష్రాల మధ్య గల దశాబ్దాల నాటి సరిహద్దు వివాదం తెరపైకి వచ్చింది. కర్టాటక నేతలు కూడా దాదాపు అదేరీతిలో స్పందించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.

వివాదం ఈ నాటిది కాదు…
సరిహద్దు వివాదం ఈనాటిది కాదు. స్వాతంత్య్రానికి ముందు నుంచే ఉంది. ఒకప్పటి బాంబే ప్రెసిడెన్సీలో భాగమైన బెల్గాం, కర్వార్, బీదర్, నిప్పని తదితర ప్రాంతాలు తరవాత కాలంలో మైసూరు రాష్ర్టంలో కలిసిపోయాయి. ఈ ప్రాంతాల్లో మరాఠీ మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్నందువల్ల వాటిని మహారాష్ర్టలో కలిపే లక్ష్యంతో 1948లో మహారాష్ర్ట ఏకీకరణ సమితి అనే పార్టీ ఆవిర్భవించింది. 1956లో భాషా ప్రయుక్త రాష్రాల ఏర్పాటు సందర్భంగా జనవరి 17న ఆ ప్రాంతాలను కర్ణాటకలో విలీనం చేశారు. దీనికి నిరసనగా మహారాష్ర్ట ఏకీకరణ సమితి చేపట్టిన ఆందోళనల్లో పది మంది మరణించారు. అప్పటినుంచి ఏటా అదే రోజున అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగానే ఇప్పుడు ఠాక్రే వివాదాస్పద ప్రకటన చేసి మంటలను మళ్లీ రాజేశారు.

ఏళ్లుగా కోర్టులోనే…..

ఈ వివాదం పరిష్కారానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మెహర్ చంద్ మహాజన్ నాయకత్వంలో 1966లో కేంద్రం కమిషన్ ను నియమించింది. కర్టాటక పరిధిలోని 264 గ్రామాలను మహారాష్ర్టలో విలీనం చేయాలని, బెల్గాంను కర్ణాటకలోనే ఉంచాలని కమిషన్ 1967 ఆగస్టులో సిఫార్సు చేసింది. దీనిని కర్ణాటక ఆమోదించగా మహారాష్ర్ట తిరస్కరించింది. తరవాత 2006లో మహారాష్ర్ట సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అప్పటినుంచి కేసు విచారణ కొలిక్కి రాలేదు. నేటికీ పెండింగ్ లోనే ఉంది. ఈ కేసు సత్వర విచారణకు తీసుకోవలసిన చర్యలపై ఉప ముఖ్యమంత్రి చగన్ భుజ్ బల్, మరో మంత్రి ఏకనాధ్ షిండేలను సమన్వయకర్తలుగా ముఖ్యమంత్రి ఠాక్రే నియమించారు.

బెల్గాంను బెళగావిగా మార్చి….

కర్టాటక కూడా మహారాష్ర్టను ఇరుకున పెట్టేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించిందని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. బెల్గాం పేరును 2014 నవంబరు ఒకటిన బెళగావిగా మార్చింది. అంతకుముందే నగరాన్ని రాష్ర్ట రెండో రాజధానిగా ప్రకటించింది. 2012లో బెళగావిలో అసెంబ్లీ భవనాన్ని నిర్మించి శీతాకాల సమావేశాలు నిర్వహించడం ప్రారంభించింది. తరవాత రోజుల్లో ఇక్కడ ప్రపంచ కన్నడ శిఖరాగ్ర సమావేశాన్నీ నిర్వహించింది. ఇవన్నీ ఈ ప్రాంతంపై తమ హక్కును పదిలం చేసుకునేందుకే తప్ప బెళగావిపై ప్రేమతో కాదన్నది మహారాష్ర్ట వాదన. కర్టాటక, మహారాష్ర్ట డిప్యూటీ సీఎంలు అశ్వత్థ నారాయణ, అజిత్ పవార్ వ్యాఖ్యలు సైతం హుందాతనంగా లేవు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వచ్చే వరకు రెండు రాష్టాలు సంయమనం పాటించాలి. లేదా చర్చలతో ఇద్దరు సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అంతేతప్ప గోటితోపోయే దానికి గొడ్డలిదాకా తెచ్చుకోవడం తగని పని.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News