మళ్లీ గ్యాప్ ఇచ్చారే…?

తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న బోండా ఉమామహేశ్వరరావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా? చంద్రబాబుతో ఇటీవల భేటీ తర్వాత తాను టీడీపీలోనే కొనసాగుతానని [more]

Update: 2019-09-13 12:30 GMT

తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న బోండా ఉమామహేశ్వరరావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా? చంద్రబాబుతో ఇటీవల భేటీ తర్వాత తాను టీడీపీలోనే కొనసాగుతానని చెప్పిన బోండా ఉమామహేశ్వరరావు మళ్లీ పార్టీ కార్యక్రమాలకు గ్యాప్ ఇచ్చినట్లే కన్పిస్తుంది. బోండా ఉమామహేశ్వరరావు పార్టీ మారతారని గతంలో జోరుగా ప్రచారం జరిగింది. ఆయన వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఉమ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగినా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ఖండించలేదు కూడా.

బాబును కలిసిన తర్వాత….

ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చిన తర్వాత బోండా ఉమామహేశ్వరరావు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు. చంద్రబాబును కలిసిన తర్వాత ఆయన తాను టీడీపీలోనే ఉంటానని ప్రకటించారు. ఇసుక కొరత విషయంలో తెలుగుదేశంపార్టీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో కూడా బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. కానీ పల్నాడు ఇష్యూలో తెలుగుదేశం పార్టీ చలో ఆత్మకూరు కార్యక్రమంలో మాత్రం పాల్గొన లేదు. బోండా ఉమామహేశ్వరరావు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు తెలిసింది.

నియోజకవర్గంలో…..

నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు కూడా బోండా ఉమామహేశ్వరరావును ఆలోచనలో పడేశాయంటున్నారు. తెలుగుదేశం పార్టీలో ఎన్నికలకు ముందు చేరిన వంగవీటి రాధా ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిసిన సంగతి తెలిసిందే. వంగవీటి రాధా జనసేనలోకి వెళితే భవిష్యత్తులో తనకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని బోండా ఉమామహేశ్వరరావు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో రాధా జనసేన తరుపున బరిలోకి దిగితే తనకు విజయం దక్కడం సులువు కాదని బోండా ఉమామహేశ్వరావు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో వంగవీటి రాధా మద్దతు ఇవ్వడం వల్లనే స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు.

నచ్చచెప్పే ప్రయత్నం కూడా….

వంగవీటి రాధాను కనీసం నచ్చ చెప్పేందుకు కూడా టీడీపీ అధిష్టానం ప్రయత్నించ లేదని బోండా ఉమామహేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అలాగే పార్టీలోని కొందరు నేతలపై కూడా బోండా ఉమామహేశ్వరరావు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. కొందరు నేతలకే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. మరోవైపు తనపై ఉన్న పాత కేసులను కూడా వైసీపీ ప్రభుత్వం తిరగదోడే అవకాశముందని భావించి బోండా సైలెంట్ అయ్యారంటున్నారు. మొత్తం మీద మళ్లీ బోండా ఉమామహేశ్వరరావు పార్టీకి దూరంగా ఉంటున్నారు.

Tags:    

Similar News