సీనియర్ లీడర్ రాజకీయ సన్యాసం

నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో కీల‌క నాయ‌కులు టీడీపీకి ఝ‌ల‌క్ ఇచ్చేందుకురెడీ అయ్యారు. ఇప్పటికే బీసీ వ‌ర్గానికి చెందిన బీద మ‌స్తాన్ రావు.. పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు [more]

Update: 2019-12-02 11:00 GMT

నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో కీల‌క నాయ‌కులు టీడీపీకి ఝ‌ల‌క్ ఇచ్చేందుకురెడీ అయ్యారు. ఇప్పటికే బీసీ వ‌ర్గానికి చెందిన బీద మ‌స్తాన్ రావు.. పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు వార్తలు వ‌స్తున్న నేప‌థ్యంలో ఇప్పుడు ఏకంగా టీడీపీ స‌హా ఏ పార్టీలోనూ ఉండ‌బోన‌ని మ‌రో సీనియ‌ర్ నాయకుడు, ప్రజ‌ల‌కు త‌ల‌లో నాలుక‌గా పేరు తెచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య చేసిన వ్యాఖ్యలు సంచ‌ల‌నంగా మారాయి. గ‌తంలో కాంగ్రెస్‌లో ఉండ‌గా చురుకైన రాజ‌కీయాలు చేసిన బొల్లినేని కృష్ణయ్య ఈ ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు చంద్రబాబు ఆహ్వానంతో టీడీపీలోకి వ‌చ్చి.. పార్టీ కోసం ఎంతో కృషి చేశారు. పార్టీ దీన‌స్థితిలో ఉన్న ఆత్మకూరులో పార్టీ బ‌లోపేతానికి ఆయ‌న ఎంతో క‌ష్టప‌డ్డారు.

వివాద రహితుడిగా….

చంద్రబాబు సామాజిక వ‌ర్గానికి చెంద‌ని బొల్లినేని కృష్ణయ్యకు పార్టీలో వివాద‌ర‌హితుడు పేరు కూడా వ‌చ్చింది. ఆయ‌న వ‌యసు రీత్యా పెద్ద అయినా.. న‌వ ఉత్సాహంతో పార్టీ కోసం ప‌నిచేశారు. ఈ క్రమంలోనే త‌న‌కు ఎంతో అచ్చి వచ్చిన ఆత్మకూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఈ ఏడాది ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. ఇక్కడ నుంచి గెలిచి.. చంద్రబాబుకు గిఫ్ట్ ఇస్తాన‌ని కూడా ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న ప్రతిజ్ఞ చేశారు. అయితే, బ‌ల‌మైన మేక‌పాటి వ‌ర్గం ముందు ఆత్మకూరులో బొల్లినేని కృష్ణయ్య గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు. గ‌ట్టి పోటీ ఇచ్చినా.. మేక‌పాటి గౌతం రెడ్డి విజ‌యం సాధించారు.

సీనియర్ నేత కారణంగానే….

ఇక‌, ఎన్నిక‌లకు ముందు నియోజ‌క‌వ‌ర్గంలో తిరిగి, ప‌లు కార్యక్రమాల‌కు నిధులు ఖ‌ర్చు చేసిన బొల్లినేని కృష్ణయ్యకు ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత ఆయ‌న మాన‌సికంగా కుంగిపోయారు. అదే స‌మ‌యంలో పార్టీ నుంచి కూడా బొల్లినేని కృష్ణయ్యకు ఎక్కడా భ‌రోసా క‌నిపించ‌లేదు. నిజానికి పార్టీలోని రెడ్డి సామాజిక వ‌ర్గం త‌న‌కు స‌హ‌క‌రించ‌లేద‌నే అభిప్రాయం బొల్లినేని కృష్ణయ్యకి ఉంది. ఈ క్రమంలో ఈ విష‌యాన్ని చ‌ర్చించాల‌ని ఆయ‌న చంద్రబాబు నుంచి అప్పాయింట్ మెంట్ కోరారు. అయితే, ఇప్పటి వ‌ర‌కు ఆయ‌న‌కు అప్పాయింట్ మెంట్ ల‌భించ‌లేదు. నెల్లూరుకు చెందిన సీనియ‌ర్ నేత ఒక‌రు త‌నకు అడ్డుప‌డుతున్నార‌ని బొల్లినేని కృష్ణయ్య అస‌హ‌నం కూడా వ్య‌క్తం చేశారు.

గ్రూపు తగాదాలతో విసిగి….

నెల్లూరు జిల్లాలో గ్రూపు రాజ‌కీయాల‌తో పార్టీకి మైన‌స్‌గా మారిన ఓ మాజీ మంత్రి తీరుతో ఇప్పటికే చాలా మంది కీల‌క నేత‌లు ఆ జిల్లాలో ఇత‌ర పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పుడు బొల్లినేని కృష్ణయ్య సైతం త‌న నియోజ‌క‌వ‌ర్గంలో స‌ద‌రు మాజీ మంత్రి గ్రూపు రాజ‌కీయాల‌తో విసిగిపోయి ఉన్నారు. అపాయింట్‌మెంట్ కోరినా కూడా చంద్రబాబు నుంచి బొల్లినేని కృష్ణయ్యకి ఇప్పటి వ‌ర‌కు ఎలాంటి స‌మాచారం లేదు. పైగా ఎన్నిక‌ల్లో ఒక్క రూపాయి కూడా పార్టీ నుంచి ఆశించ‌కుండానే తాను అన్ని విధాలా ఖ‌ర్చు చేశాన‌ని, ఇప్పుడు ఓట‌మి త‌ర్వాత క‌నీసం ప‌రామ‌ర్శకు కూడా తాను నోచుకోలేదని బొల్లినేని కృష్ణయ్య వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న టీడీపీ స‌హా ఏ ఇత‌ర రాజ‌కీయ పార్టీలోనూ కొన‌సాగ‌రాద‌ని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వర‌లోనే ఆయ‌న త‌న అభిమానులు, కుటుంబ స‌భ్యుల‌తో స‌మావేశం ఏర్పాటు చేయ‌నున్నార‌ని స‌మాచారం. మ‌రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ? చూడాలి.

Tags:    

Similar News