వైసీపీలోకి బోళ్ల రాజీవ్‌… కోట‌గిరి అస‌హ‌నం

దివంగ‌త కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బుల్లి రామ‌య్య మ‌న‌వ‌డు, ప్రముఖ పారిశ్రామిక‌వేత్త బోళ్ల రాజీవ్ వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖ‌రారైంద‌ని అత్యంత విశ్వస‌నీయ వ‌ర్గాల ద్వారా [more]

Update: 2020-08-23 06:30 GMT

దివంగ‌త కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బుల్లి రామ‌య్య మ‌న‌వ‌డు, ప్రముఖ పారిశ్రామిక‌వేత్త బోళ్ల రాజీవ్ వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖ‌రారైంద‌ని అత్యంత విశ్వస‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది. టీడీపీతో ఉన్న ద‌శాబ్దాల అనుబంధాన్ని వ‌దులుకుని మ‌రీ బోళ్ల రాజీవ్ వైసీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నార‌ని తెలుస్తోంది. తాత‌, తండ్రుల నుంచి వ‌చ్చిన పారిశ్రామిక‌, రాజ‌కీయ వార‌స‌త్వాన్ని అందిపుచ్చుకున్న ఆయ‌న గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో యాక్టివ్ అవ్వ‌డంతో పాటు ఏలూరు ఎంపీ సీటు ఆశించారు. చంద్రబాబు చివ‌రి వ‌ర‌కు ఊరించి చివ‌ర‌కు ఆ సీటును అప్పటి సిట్టింగ్ ఎంపీ మాగంటి బాబుకే కేటాయించారు. ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోయిన‌ప్పటి నుంచి బోళ్ల రాజీవ్ పార్టీకి దూరంగా త‌న వ్యాపార వ్యవ‌హారాల్లో బిజీ అవుతున్నారు.

కోటగిరి అమెరికా నుంచి…..

ఇక రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉండ‌డం… వ్యాపార‌, ఇత‌ర‌త్రా అవ‌స‌రాల‌తో పాటు జిల్లా టీడీపీ నాయ‌కుల‌తో ఉన్న గ్యాప్ లాంటి కార‌ణాల‌తో రాజీవ్ వైసీపీలోకి చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్టు స‌మాచారం. గ‌త కొద్ది రోజులుగానే ఆయ‌న పార్టీ మార్పుపై జిల్లాలో ఊహాగానాలు వినిపిస్తుండ‌గా అవి నిజం కాబోతున్నాయ‌ని తెలిసింది. ఆయ‌న్ను పార్టీలో చేర్చుకునేందుకు ఓకే చెప్పిన జ‌గ‌న్ ఏలూరు ఎంపీ కోట‌గిరి శ్రీథ‌ర్‌కు స‌మాచారం ఇవ్వడంతోనే ఆయ‌న అమెరికా నుంచి వ‌చ్చార‌ని కూడా టాక్‌..? శ్రీథ‌ర్ గ‌త కొద్ది నెల‌లుగా అమెరికాలోనే ఉంటున్నారు. ఇప్పుడు ఆయ‌న ఆఘ‌మేఘాల మీద ఇండియాకు రావ‌డానికి ఇదే ప్రధాన కార‌ణ‌మ‌ని కూడా జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్రచారం జ‌రుగుతోంది.

ఏలూరు ఎంపీ సీటుకు….

వైసీపీలో చేరేందుకు రెడీ అవుతోన్న బోళ్ల రాజీవ్ క‌మ్మ వ‌ర్గానికి చెందిన నేత కావ‌డంతో పాటు…. భ‌విష్యత్తులో ఏలూరు ఎంపీ సీటు కోసం పోటీకి వ‌చ్చే ఛాన్స్ ఉందేమోన‌న్న సందేహంతో సిట్టింగ్ ఎంపీ కోట‌గిరి ఆయ‌న ఎంట్రీపై అస‌హ‌నంతోనే ఉన్నాడ‌ని అంటున్నారు. వాస్తవంగా చూస్తే ఏలూరు లోక్‌స‌భ సీటును ఐదు ద‌శాబ్దాల త‌ర్వాత నాన్ క‌మ్మ కోటాలో శ్రీథ‌ర్ గెలిచారు. ఆయ‌న తండ్రి దివంగ‌త మాజీ మంత్రి కోట‌గిరి విద్యాధ‌ర‌రావు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కాక‌లు తీరిన రాజ‌కీయ యోధుడుగా రాజ‌కీయాల‌ను త‌న క‌నుసైగ‌ల‌తో శాసించారు.

వివాదం లేకుండా…..

గ‌త ఎన్నిక‌ల్లో శ్రీథ‌ర్‌కు ఏకంగా 1.65 ల‌క్షల భారీ మెజార్టీ రావ‌డానికి కార‌ణం వైసీపీ వేవ్‌తో పాటు త‌న తండ్రికి పార్టీల‌తో సంబంధం లేకుండా జిల్లా అంత‌టా ఉన్న అభిమానులు కూడా కార‌ణం. పైగా ఏలూరు పార్లమెంటు సీటు క‌మ్మదే అన్న రికార్డుకు బ్రేక్ వేసి మ‌రీ శ్రీథ‌ర్ విజ‌యం సాధించారు. ఎంపీగా గెలిచిన శ్రీథ‌ర్‌పై ఎలాంటి ఆరోప‌ణ‌లు లేవు. త‌న పార్లమెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉన్న ఏడుగురు వైసీపీ ఎమ్మెల్యేల‌తో చిన్న వివాదం లేకుండా ముందుకు వెళుతున్నారు. పైగా దెందులూరు, చింత‌ల‌పూడి, పోల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌మ్మ వ‌ర్గంలో కీల‌క నేత‌ల‌ను త‌న‌దైన మంత్రాగంతో వైసీపీ గూటికి తీసుకు వ‌చ్చేశారు. ఇలాంటి టైంలో బోళ్ల రాజీవ్ వైసీపీలోకి ఎంట్రీ ఇస్తుండ‌డంతో పాటు ఆయ‌న భ‌విష్యత్తులో ఏలూరు పార్ల‌మెంట‌రీ సీటుకు పోటీ వ‌స్తాడా ? అన్న సందేహం ఇప్పుడు కోట‌గిరి & టీంలో ఉండ‌డంతోనే శ్రీథ‌ర్ అస‌హ‌నంతో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే బోళ్ల రాజీవ్ వైసీపీ ఎంట్రీతో వైసీపీలో ఎలాంటి కొత్త ప‌రిణామాలు సంభ‌విస్తాయో ? చూడాలి.

Tags:    

Similar News