హంబగ్ ..అంతా ఉట్టిదే..!

Update: 2018-07-01 16:30 GMT

నల్లధనం మాట మరోసారి మనముందుకొచ్చింది. భారతదేశంలో రాజకీయనాయకులు తాము చేయాలనుకున్న అడ్డమైన పనులకు ప్రజలను ఒప్పించేందుకు ఒక అడ్డదారిని ఎంచుకుంటారు. కఠినమైన సంస్కరణ చేపట్టాలనుకున్నప్పుడు నల్లధనం ముసుగు వేసేస్తారు. దాంతో కసిగా ఉన్న నూటికి 80 శాతం ప్రజలు గొర్రెల్లా తల ఆడిస్తారు. నాయకులు తమ పని కానిచ్చేస్తారు. ఎటువంటి తిరుగుబాటు లేకుండా ప్రజల మద్దతు కూడగట్టడానికి, అధికారం చేజిక్కించుకోవడానికి నల్లధనం పేరు వాడుకోవడాన్ని మించిన ప్రత్యామ్నాయం లేదు. 67 కోట్ల రూపాయల బోఫోర్సు అవినీతి ఆరోపణ రాజీవ్ ను గద్దె దింపేసింది. ముప్ఫైఏళ్లలో ఇంతవరకూ కేసు తేలలేదు. 2014లో నల్లధనం తెచ్చేస్తాం. ప్రతి సగటు మనిషి అకౌంట్ లో 15 లక్షల రూపాయల మేరకు జమ చేసేంత నల్లధనం విదేశాల్లో పోగుపడిపోయిందని అప్పటి ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ప్రకటించారు. పైసా రాలేదు. 2016లో నోట్ల రద్దు చేస్తూ నల్లధనంపై యుద్దమంటూ కొత్త నినాదం ఎత్తుకున్నారు. ప్రతిపైసా బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యి తెల్లగా మారిపోయింది. మళ్లీ దానిపై మాట లేదు. స్విస్ అకౌంట్లలో భారతీయులు దాచుకున్న నల్లధనం పెరిగిపోయిందంటూ తాజాగా విడుదలైన ప్రకటన మరోసారి సగటు మనిషిని పరిహాసమాడుతోంది.

భూమి మింగేస్తోంది...

నిజంగా నల్లధనం పేరుకుపోయిందా? విదేశాల్లో తిష్ట వేసిందా? అంటే కచ్చితంగా అంత సీన్ లేదని చెప్పవచ్చు. అవినీతి రూపంలో పోగుపడుతున్న నిధులు 99 శాతం దేశంలోనే వినియోగమవుతున్నాయి. ఇక్కడే పోగుపడుతున్నాయి. ఎక్కువ భాగం భూమి రూపంలో పెట్టుబడులు పెడుతున్నారు. అందుకే భూ విలువలు విపరీతంగా పెరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ లో చూపించే మార్కెట్ విలువకు చేతులు మారుతున్న అసలు మొత్తానికి సంబంధం ఉండదు. సర్కారుకు చూపించే లెక్క కంటే రెండు నుంచి మూడు రెట్ల మొత్తానికి భూములు కొంటున్నారు. భూముల రేట్లు చుక్కలు తాకడానికి ఇదే ప్రధాన కారణం. మోజు ఉన్నవాళ్లు కొంత మొత్తాన్ని బంగారు నగలు, ఆభరణాల కొనుగోలుకు వెచ్చిస్తున్నారు. అయితే నల్లధనంలో ఈ ఆభరణాల వాటా రెండు శాతం మించి ఉండదు. తాము కడుతున్న పన్నుకు , ఆదాయానికి సంబంధం లేకుండా లగ్జరీ కార్లు, వస్తువులు కొనుగోళ్లు చేస్తున్నారు వివిధ వర్గాల ప్రజలు. పిల్లలను లక్షలు పోసి కార్పొరేట్ స్కూళ్లలో చదివిస్తున్నారు. కోట్ల రూపాయలతో విదేశాలకు పంపుతున్నారు. ఇదంతా వారి రుజు ఆదాయంతో సాధ్యం కాదు. అంటే నల్లధనం వివిధ రూపాల్లో పెట్టుబడిగా, లగ్జరీ సాధనంగా ఉపకరిస్తోంది. ఎక్కడో ఎక్కువ మొత్తంలో పేరుకుపోయిందనేది భ్రమ. ప్రజల్ని మభ్యపుచ్చే మాయానాటకం.

సకుటుంబ బంధుమిత్ర...

చాలామంది నల్లధనాన్ని దాచుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు వెదుకుతుంటారు. ప్రత్యేకించి రాజకీయవేత్తలు, ప్రభుత్వోద్యోగులు దానిని పెట్టుబడి రూపంలోకి మార్చేస్తుంటారు. తమ పేరిట ఆస్తులు ఉంటే ఇబ్బందికరం. అది గ్రహించి సమీప బంధువుల పేరిట వ్యవహారాలు నడుపుతుంటారు. ఇందులో భార్య తాలూకు బంధువులకు ఎక్కువగాపాత్ర కల్పిస్తూ ఉంటారు. అవసరమైతే స్త్రీధనం పేరిట ఈ అవినీతికి కొత్త ముసుగు వేయవచ్చనేది వారి యోచన. మరీ సన్నిహితంగా ఉండే ఇతర బంధువులు, మిత్రుల పేరిట కూడా కొన్ని ఆస్తిపాస్తుల బదలాయింపులు చేస్తుంటారు. అందుకే వలయంలో ఎక్కడ తీగ దొరికినా డొంక కదులుతుంది. తమ వద్ద పనిచేసే దిగువస్థాయి డ్రైవర్లు, పనివారి పేరిట గతంలో తంతు నడిపేవారు. ఇప్పుడు పనివారు తెలివిమీరిపోయారు. భవిష్యత్తులో సాంకేతికంగా, చట్టబద్ధంగా ఇబ్బందులు తలెత్తుతాయని గ్రహించి వాటికి దాదాపు మంగళం పాడేశారు. సన్నిహిత బందువులనే ఎక్కువగా నమ్ముకుంటున్నారు. తప్పనిస్థితిలో విదేశాలకు నిధులు పంపాల్సి వచ్చినా తిరిగి ఆ మొత్తాలను షెల్ కంపెనీల ద్వారా తిరిగి దేశానికి తెస్తున్నారు. ఎందుకంటే వారికి అవినీతి సొమ్ముపై కూడా లాభాలు కావాలి. అందువల్ల ఎక్కడో నల్లధనం ఉందన్న భ్రమలు విడిచిపెట్టడం మేలు. అది మన చుట్టుపక్కలే ఏదో రూపంలో ఉరుమురిమి చూస్తోంది.

పరనింద పాపం..

విదేశాల్లో వడ్డీ రేట్లు బాగా తక్కువ. పెద్ద ఎత్తున నిధులను తరలిస్తే కలిసి వచ్చేదేమీ ఉండదు. అక్కడ తమ డబ్బు గుడ్లు పెట్టదు. ఈవిషయం భారతీయ అక్రమార్కులకు, అవినీతి పరులకు బాగా తెలుసు. అందువల్ల అవినీతి ఆర్జనను ఇక్కడే రూపం మారుస్తున్నారు. తమ అవినీతికి పదిరెట్లు లాభం ఆర్జించాలని చూస్తున్నారు. ఇది భారతీయ మనస్తత్వం. విదేశీ బ్యాంకులు అక్రమ, అవినీతి సంపాదన పరుల వివరాలు ఇవ్వడం లేదంటూ సాగిస్తున్న ప్రచారం సైతం పూర్తిగా సత్యం కాదు. యూరోపియన్ నేషన్స్ అవగాహన మేరకు 1987 నుంచే స్విస్ బ్యాంకులలో దాచినమొత్తం తెలుసుకునే వెసులుబాటు ఏర్పడింది. నాలుగైదేళ్లుగా ఆటోమేటిక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తర్వాత భారత్ కూ ఈ వెసులుబాటు ఏర్పడింది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న భారతీయుల నగదు ఆరువేల 891 కోట్లుగా తేలింది. 160 లక్షల కోట్ల స్థూల జాతీయోత్పత్తితో అలరారుతున్న భారత్ ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే ఇది అతిచిన్నమొత్తమే. ఇంత మొత్తంలో వ్యక్తిగత ఆస్తులు ఉన్నవారి సంఖ్య దేశంలో వేలల్లో ఉంది. అయినా ఇంకా స్విస్, విదేశీ బ్యాంకుల పేరిట నల్ల బూచిని చూపించి పబ్బం గడుపుకునే రాజకీయనాయకులకు కొదవ లేదు. ఇకనైనా దేశీయంగా అవినీతిని అరికడితే నల్లధనాన్ని కట్టడి చేయవచ్చు. వ్యవస్థలో పారదర్శకత పెంచితే పగ్గాలు వేయవచ్చు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News