బ్లాక్ అండ్ వైట్...!!

Update: 2018-12-25 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శ్వేతపత్రరాజకీయాలు మొదలయ్యాయి. సాధారణ పరిస్థితుల్లో అయితే అరిచిగీపెట్టినా వైట్ పేపర్ అంటే సర్కారులు పట్టించుకోవు. కానీ సందర్భం వచ్చింది కాబట్టి తమకు పొలిటికల్ మైలేజీ వస్తుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో సాంకేతిక వివరాలతో పాటు రాజకీయ ఆరోపణలూ మిళితం చేస్తున్నారు. తిరిగి తెలుగుదేశాన్ని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకతను ప్రజలముందు పెట్టడమే ప్రధానోద్దేశంగా ఈ పత్రాలను ప్రజల్లోకి విడుదల చేస్తున్నారు. కార్యకర్తలందరూ వీటిపై దృష్టి పెట్టి విస్తృత ప్రచారం కల్పించాలని అధినేత పిలుపునిచ్చారు. జనవరి ఆరోతేదీన ప్రధాని నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారు . ఆయన పర్యటనకు ముందుగానే శ్వేతపత్రాలతో బీజేపీ నాయకత్వంపై చెలరేగిపోవాలనే దూరాలోచన కనిపిస్తోంది. తొలి పత్రంలోనే తొంభైవేల కోట్లరూపాయలు కేంద్రం నుంచి రావాల్సి ఉందని తేల్చేశారు. రాజధాని నిర్మాణం, రెవిన్యూ లోటు, ప్రత్యేక ప్యాకేజీ వంటి పద్దులో ఈ బకాయిలు చూపించారు. పోలవరం వంటి వాటిని కలిపితే మరింతగా పద్దు పెరిగే అవకాశం ఉంది. దానిని వేరేగా చూపించాలనే ఉద్దేశంతో పక్కనపెట్టారు. రోజువారీ విడుదల చేస్తున్న ఈ పత్రాల లక్ష్యం, గమ్యం ఏమిటనే విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహాలు లేవు. అయితే వాటిని చేరుకోగలుతాయా? అందులో వాస్తవమెంత వరకూ ఉందనే విషయంలోభిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పత్రం..అభియోగం...

ప్రభుత్వ పనితీరుపైనా, నిధుల వినియోగంపైనా ఆరోపణలు తలెత్తినప్పుడు ప్రతిపక్షాలు వైట్ పేపర్ విడుదల చేయమని డిమాండు చేస్తుంటాయి. వాస్తవంగా జరుగుతున్న పరిస్థితులను ప్రజల ముందు పెట్టాలనే ఉద్దేశంతో వీటిపై ఒత్తిడి పెడుతుంటారు. అటువంటి డిమాండ్లు వచ్చిన అన్ని సందర్భాల్లోనూ ప్రభుత్వం తిరస్కరిస్తుంటుంది. తమ గుట్టు తామే బయటపెట్టుకోవడం ఇష్టం లేక అలా చేస్తుంటుంది. ఒకవేళ తాము తప్పు చేయలేదని భావిస్తే వైట్ పేపర్లు విడుదల చేస్తుంది. దానిలోని లోపాలను పట్టుకుని ప్రభుత్వపనితీరును విపక్షాలు ఎండగడుతుంటాయి. ఇప్పుడు ఏపీ వైట్ పేపర్లు మొత్తంగా ఈ పద్ధతికి భిన్నంగా ఉన్నాయి. ఎవరూ అడగకముందే తామే వివరాలు చెబుతామంటూ చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చారు. ఆత్మస్తుతి పరనింద లక్ష్యంగా పత్రాలు రూపొందాయని ఇప్పటికే వైసీపీ,బీజేపీ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఏపీలో సాగుతున్న పనులకు , అభివృద్ధికి, ప్రగతికి తాము ఏవిధంగా కృషి సాగిస్తున్నదీ చెప్పడం ఒక వంతు మాత్రమే. కేంద్రప్రభుత్వాన్ని నిలదీయడం, హామీలను అమలు చేయలేకపోయిన వైఫల్యాలను రాజకీయాస్త్రాలుగా మార్చడం ప్రధానోద్దేశం. సర్కారు లక్ష్యం ఎలా ఉన్నప్పటికీ తాము వెనకబడకూడదనే ఉద్దేశంతో వైసీపీ సైతం వేడిని రగిలిస్తోంది. ఇప్పటికే సర్కారీ పేపర్ల లోగుట్టును అధ్యయనం చేసేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుంది.

బ్లాక్ పేపర్స్...?

అధికారపార్టీకి కొన్ని వెసులుబాటులు ఉంటాయి. రాజకీయ ప్రయోజనాలను, ప్రభుత్వ పథకాలతో మిళితం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఒకదెబ్బకు రెండు పిట్టలు తరహాలో ప్రచారానికి ప్రభుత్వ నిధులను విచ్చలవిడిగా వాడేసుకోవచ్చు. దాంతో ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లడంతో పాటు వాటిని అమలు చేస్తున్న టీడీపీకి పేరు వస్తుంది. ఇందుకు అవసరమైన బహిరంగసభలు, వేదికలు, జనాల తరలింపు వంటివన్నీ సర్కారు పద్దులోనే పడతాయి. ప్రచారం మాత్రం పార్టీకి లభిస్తుంది. ఈమొత్తం తతంగంలో ప్రతిపక్షం నష్టపోతుంది. అధికారపార్టీని విమర్శించాలన్నా తమ చేతి చమురు వదులుకోవాల్సిందే. ప్రభుత్వం పెద్ద ఎత్తున తలపెట్టిన శ్వేతపత్రాలపై వైసీపీ గుర్రుగా ఉంది. వీటి ద్వారా టీడీపీ రాజకీయ ప్రయోజనాలు నొల్లుకోకుండా అడ్డుపడాలనే ఉద్దేశంతో వైసీపీ ప్రత్యేక అధ్యయనం మొదలు పెట్టింది. వైట్ పేపర్లలోని లోపాలు, ప్రభుత్వ వైఫల్యాలను కలగలిపి బ్లాక్ పేపర్లు విడుదల చేయాలని యోచిస్తోంది. ముల్లును ముల్లుతోనే తీయాలనే లక్ష్యంతో వీటిని రూపొందించాలని భావిస్తోంది. ఇవి కూడా పక్కా రాజకీయంతోనే ముడిపడి ఉంటాయి.

వేడి తగ్గకూడదు..

వైట్ పేపర్ల విడుదలకు ఎంచుకున్న సమయం ప్రత్యేక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. జనవరి ఆరోతేదీన ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కీలకమైన ప్రకటనలు చేసే అవకాశం ఉంది. రాష్ట్రానికి ఇంతవరకూ విడుదల చేసిన నిధుల వివరాలను, మంజూరు చేసిన ప్రాజెక్టులను ప్రధాని ప్రస్తావిస్తారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ రాజకీయ అవసరాల కోసమే తమకు దూరమైందన్న విషయాన్ని ఎత్తిచూపేందుకు ఆస్కారం ఉంది. రైల్వేజోన్, ప్రత్యేక ప్యాకేజీ, కేంద్ర విద్యాసంస్థల వంటి అంశాలను హైలైట్ చేయించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా రైల్వేజోన్ కు సంబంధించి కీలకమైన ప్రకటన ఉండవచ్చునంటున్నారు. ప్రధాని పర్యటనతో బీజేపీ ఏరకమైన మైలేజీ పొందకుండా చూడాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఉన్నారు. అందుకే ప్రజలను సన్నద్ధం చేసే క్రమంలో భాగంగానే వైట్ పేపర్ల విడుదల మొదలు పెట్టారు. జనవరి ఒకటోతేదీన కేంద్రప్రభుత్వ విధానాలకు నిరసనగా ర్యాలీలు, ప్రదర్శనలతో ప్రజలంతా రోడ్లపైకి రావాలని పిలుపునిచ్చారు. ప్రధాని పర్యటన వరకూ వేడి తగ్గకుండా చూసుకోవాలని భావిస్తున్నారు. టీడీపీ క్యాడర్ కు ఇప్పటికే ఈవిషయంలో స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు. ప్రధాని పర్యటన చేస్తున్న రోజున అధికారికంగా కాకపోయినా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కూడా టీడీపీ భావిస్తోంది. అయితే అది పార్టీ కార్యక్రమంగా కనిపించకుండా ప్వచ్ఛందంగా ప్రజలు నిర్వ హించినట్లుగా కనిపించే విధంగా ప్లాన్ చేయాలని పార్టీ యోచిస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News