బిజెపి లోకల్ స్టాండ్...

Update: 2018-07-22 14:00 GMT

రాహుల్ గాంధీ దేశ అత్యున్నత చట్ట సభలో కన్నుకొట్టాడు. ప్రధాని విపక్షాలకు తన ప్రసంగంతో కన్నుగీటాడు. రారమ్మంటూ సందేశమిచ్చాడు. కాంగ్రెసు పార్టీ కంటే తమ పార్టీ ఎంత మంచిదో సంకేతమిచ్చాడు. ఇందుకు అవసరమైతే కొన్ని త్యాగాలకూ సిద్దమయ్యే సూచనలూ కనబరిచారు. మోడీ దక్షిణాదిన పార్టీని బలపరుచుకోవాలన్న తాపత్రయంలో ఉన్నారు. సొంతబలం సరిపోయే పరిస్థితులు కనిపించడం లేదు. కమలం వికసిస్తుందనుకున్న కర్ణాటక చివరిక్షణంలో చేజారిపోయింది. ఆంధ్రా,తమిళనాడు, కేరళ ల్లో పెద్దగా వర్కవుట్ అయ్యే సూచనలు లేవు. తెలంగాణ నాయకులు ఇస్తున్న నివేదికలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకూ పొంతన కుదరడం లేదు. దీంతో ఎవరో ఒకరిద్దరు మిత్రులను వెంటనే చేర్చుకోవాల్సిందేనని ఖరారైపోయారు. అన్నాడీఎంకే ఎలాగూ గుప్పెట్లోనే ఉంది. తెలంగాణ రాష్ట్రసమితిని దక్షిణాదిన రెండో పెద్ద మిత్రునిగా భావిస్తున్నారు మోడీ. దీంట్లోని రాజకీయ సమీకరణలు సార్వత్రిక ఎన్నికల బలాబలాలను తారుమారు చేయగలవనేది పరిశీలకుల అంచనా.

కేసీఆర్ నచ్చేశాడు..

తెలుగుదేశం పార్టీని కౌంటర్ చేయాలనుకుంటే విమర్శించవచ్చు. చేసిన తప్పిదాలను ఎండగట్టవచ్చు. నిన్నామొన్నటివరకూ మిత్రునిగా ఉన్న చంద్రబాబు నాయుడిని ఏనాడూ తనతో చేతులు కలపని కేసీఆర్ తో పోల్చి చెబితే పక్కా రాజకీయమే. ప్రధాని మోడీ అదే పంథా ఎంచుకున్నారు. సీనియర్ చంద్రబాబు నాయుడు ఎప్పుడూ రాష్ట్రవిభజన సమస్యలపై పేచీలకు, పీటముడులకు యత్నించారనే కోణంలో మోడీ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ మాత్రం పరిణతి ప్రదర్శించారని పొగడ్తలతో ముంచెత్తారు. అంతేకాదు, తెలంగాణ సీఎం అభివ్రుద్ధిపై ద్రుష్టి పెట్టి దూసుకుపోతున్నారని చెప్పారు. ఏదో శంకుస్థాపన బహిరంగ సభలో మొక్కుబడిగా చేసిన ప్రకటన కాదు ఇది. లోక్ సభలో సాక్షాత్తు ప్రధానమంత్రి ఇచ్చిన కితాబు. అంతకుముందే టీఆర్ఎస్ ఎంపీలు ఆంధ్రాలో కలిపిన తమ మండలాలు తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాను వ్యతిరేకించారు. ఇవన్నీ కమలం మనసులో పుట్టిన ఆలోచనలే అనేది పరిశీలకుల అంచనా. తద్వారా ఆంధ్రప్రదేశ్ వాదనను లోక్ సభలో బలహీనపరచాలనేది వ్యూహం. ప్రభుత్వానికి వ్యతిరేక ఓటును టీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించారు. దీంతో ఇరువర్గాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిని అనుసరించినట్లు స్పష్టమవుతోంది. కేసీఆర్ ఇప్పుడు మోడీకి సౌత్ ఇండియన్ డార్లింగ్ గా అభివర్ణిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్.

బాబుకు కౌంటర్ ...

చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమినుంచి బయటికి వచ్చేశారు. అంతటి సీనియర్ నేత, టీడీపీ వంటి బలమైన పక్షం ఎన్డీఏ ను వ్యతిరేకించడమంటే చెడు సంకేతాలు ప్రజల్లోకి వెళతున్నాయి. సోదర తెలుగు రాష్ట్రమైన కేసీఆర్ మాత్రమే బలమైన కౌంటర్ గా ఉపయోగపడగలరని మోడీ, అమిత్ షాలు భావిస్తున్నారు. దీంతో ప్రత్యక్షంగా కాకపోయినా రహస్య మిత్రుడిగా అయినా కేసీఆర్ తమ ప్రభుత్వానికి అవసరమైన సందర్బాల్లో మద్దతు ఇచ్చేలా కమలనాథులు వ్యూహరచన చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి పరిపాలన పరంగానూ, కేసీఆర్ కు రాజకీయంగానూ ప్రధాని కితాబు ఇవ్వడం వెనక దాగిఉన్న నిజమిదే. టీఆర్ఎస్ కూడా ఎప్పట్నుంచో బీజేపీపై సానుకూలత ప్రదర్శిస్తోంది. రాష్ట్రస్థాయి బీజేపీ నాయకులను అస్సలు లెక్క చేయడం లేదు. కమలం అధిష్టానం వద్ద తమకు పలుకుబడి ఉందని ప్ర్రదర్శించుకునే పనిలో బిజీ అయిపోయింది. కేంద్ర మంత్రులు వచ్చి వరసగా టీఆర్ఎస్ ను పొగిడేసి వెళ్లిపోతున్నారు. ఇదంతా కేసీఆర్ సర్కారుకు బూస్టప్ ఇచ్చే ప్రయత్నమే. పైపెచ్చు ఇక్కడ కేసీఆర్ కు ప్రధానప్రత్యర్థి కాంగ్రెసు పార్టీ . శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న సూత్రం సెంట్ పర్సంట్ అమలవుతోంది.

అంతుపట్టని ఆలోచన..

మోడీ, అమిత్ షాలు అనుసరించే వ్యూహాలు ఎవరికీ అంతుచిక్కవు. ఇటీవలి కాలం వరకూ వైసీపీని అక్కున చేర్చుకుంటారనే భావన సర్వత్రా వ్యాపించింది. విజయసాయి రెడ్డి తదితర ఎంపీలు ఇందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఎన్నికల్లో పొత్తు కాకుండా అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు సిద్దమయ్యారు. కానీ పార్లమెంటులో తన ప్రసంగంతో ప్రధాని గాలి తీసేశారు. వైసీపీ ఉచ్చులో తెలుగుదేశం పార్టీ చిక్కుకుని తమకు దూరమైందని చెప్పుకొచ్చారు. ఇది వైసీపీని డ్యామేజీ చేసే స్టేట్ మెంట్. వైసీపీ బడ్జెట్ సెషన్ లో అవిశ్వాసం ఇచ్చిన రోజుల్లో తిరస్కరించారు. తాజాగా ఆ పార్టీ మొత్తం రాజీనామా చేసిన తర్వాత టీడీపీ అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించారు.. ధికారికంగా పార్టీఫిరాయింపుదార్లకు వైసీపీ సభ్యులుగా గుర్తింపునిస్తున్నారు. సభలో బుట్టారేణుకతో మాట్లాడించారు. ఇవన్నీ నెగటివ్ సంకేతాలే. వైసీపీ,బీజేపీ బంధానికి బ్రేకులు పడినట్లే. తెలంగాణలో కమలం పార్టీ నాయకులు ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తున్నారు. పార్లమెంటు సాక్షిగా ప్రధాని వీరి గాలి తీసేశారు. కేసీఆర్ ను నాలుగు తిట్లు తిట్టి నగరంలో నాలుగైదు స్థానాలు తెచ్చుకోవాలనే వ్యూహంలో ఉన్నారు స్థానిక నాయకులు. ఇప్పుడు వారికి ఆ అవకాశం లేకుండా చేసేశారు మోడి. జాతీయ స్థాయి సమీకరణల్లో లోకల్ లోటస్ దెబ్బతినే సూచనలు కనిపిస్తున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

 

Similar News