దక్షిణాదిపై కాషాయం జండా సాధ్యమేనా ?

తూర్పు , పడమర, ఉత్తరం ఈ మూడు చోట్ల కాషాయ దళం ( బిజెపి )అశ్వమేధం పూర్తి చేసుకుని దక్షిణ ముఖంగా బయల్దేరింది. దక్షిణాదిన కేవలం కర్ణాటక [more]

Update: 2019-06-23 18:29 GMT

తూర్పు , పడమర, ఉత్తరం ఈ మూడు చోట్ల కాషాయ దళం ( బిజెపి )అశ్వమేధం పూర్తి చేసుకుని దక్షిణ ముఖంగా బయల్దేరింది. దక్షిణాదిన కేవలం కర్ణాటక లో మాత్రమే ఉనికి చాటుకుంటున్న కమలానికి మొన్నటి ఎన్నికల్లో తెలంగాణ లో ఆశలు చిగురించాయి. కేరళలో సైతం జండా పాతే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తమిళనాడు, ఆంద్ర ప్రదేశ్ లలో కాలుమోపెందుకు అందివచ్చే అవకాశాల పై లోతుగా అధ్యయనం చేసి ఒక్కోచోటా ఒక్కో ప్లాన్ అమలు చేస్తుంది బిజెపి.

టిడిపిని మింగేస్తేనే ….

ఆంధ్ర ప్రదేశ్ లో పూర్తిగా టిడిపిని మింగేయగలిగితేనే ఆ స్థానాన్ని బిజెపి ఆక్రమించుకునే అవకాశాలు వుంటాయని భావిస్తుంది మోడీ, షా ద్వయం. అందుకు అవసరమైన కసరత్తును ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నలుగురు రాజ్యసభ సభ్యులను టిడిపి నుంచి గోడదూకించి శ్రీకారం చుట్టేసింది. ఇప్పుడు టిడిపి ఎమ్యెల్యేలు బిజెపి టార్గెట్. అందుకు అవసరమైన వ్యూహాలు చాపకిందనుంచి అమలు చేసేస్తోంది. ఇప్పటికే ఆ సంకేతాలను కూడా పార్టీ శ్రేణులతో ఇప్పించేసింది. ఎంపి జివిఎల్ నరసింహారావు, ఎమ్యెల్సీ లు సోము వీర్రాజు , మాధవ్ తాజాగా చేస్తున్న వ్యాఖ్యలు టిడిపి లో మరిన్ని భూకంపాలు తప్పవని స్పష్టం చేసింది.

జనసేన భర్తీ చేయలేదా …

టిడిపి స్థానాన్ని భవిష్యత్తులో జనసేన భర్తీ చేసే అవకాశాలను బిజెపి కొట్టి పారేస్తోంది. బిజెపి మాత్రమే వైసిపికి ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించనున్నట్లు ఇప్పటినుంచి తేల్చి చెప్పడానికి ఆపరేషన్ ఆకర్ష్ కి తెరలేపింది. అందుకోసం తాము ఇక మడికట్టుకోవడం సాధ్యం కాదని ఒక పక్క టిడిపి మరోపక్క వైసిపి లకు చెప్పక చెప్పేసింది. కమ్మ, బిసి వర్గాలు అండగా టిడిపి ప్రధాన ఓటు బ్యాంక్ ఇప్పటివరకు వుంది. వైసిపికి రెడ్డి, ఎస్సి ఎస్టీ , మైనారిటీలు ఓటు బ్యాంక్ గా ఏర్పడ్డారు. కేవలం కాపు సామాజిక వర్గం అండతో మాత్రమే జనసేన సాగుతుందని కమ్మ సామాజిక వర్గాన్ని కమలంలోకి ఆకర్షించి, జనసేన తో దెబ్బయిన కాపు నేతలను, టిడిపిలో ఓడిన కాపు నాయకులను కలుపుకుని తమ సంప్రదాయ బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ ఓటు బ్యాంక్ ను రప్పించుకోగలిగితే 2024 లో అధికారం కోసం పోరాటం చేసి విజయం సాధించడం అసాధ్యం కాదన్నది కమలం అంచనా అని హస్తిన విశ్లేషకుల మాట.

Tags:    

Similar News