బాబుపై బీజేపీ దశల వారీ వ్యూహం మొదలయిందిగా...!

Update: 2018-05-15 14:30 GMT

‘కేసులు పెడతారు. నన్నువేధిస్తారు. మీరంతా అండగా ఉండాలం’టూ చంద్రబాబు నాయుడు పదే పదే ప్రజలకు విజ్ణప్తి చేస్తున్నారు. బీజేపీ అధిష్ఠానం మరొక రకంగా యోచిస్తోంది. బాబు ఏ అంశం ఆధారంగా బీజేపీని భ్రష్టు పట్టించాలని చూస్తున్నారో ఆ అంశం ఆయన చేజారిపోయేలా కమలనాథుల వ్యూహం కనిపిస్తోంది. ఒకవైపు రాజకీయంగా, మరొకవైపు ప్రజల్లో ఉక్కిరిబిక్కిరి చేయాలనేది అమిత్ షా ఆలోచనగా భాజపా శ్రేణులు చెబుతున్నాయి. బీజేపీతో అనవసర వైరం కొని తెచ్చుకున్నందుకు రెంటికీ చెడ్డ రేవడిలా టీడీపీని దెబ్బతీయాలని మోడీ, అమిత్ షాలు పక్కా వ్యూహమే సిద్దం చేశారంటున్నారు. అవసరమైతే తమ పార్టీ కొంత దెబ్బతిన్నప్పటికీ టీడీపికి చుక్కలు చూపించాలని యోచిస్తున్నట్లు సమాచారం. తద్వారా చంద్రబాబు పార్టీని నిర్వీర్యం చేస్తే 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం దక్షిణ భారత దేశం ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ వంటి ఒక బలమైన పార్టీ తమకు మిత్రపక్షంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందుకు ద్విముఖ వ్యూహం అనుసరించబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కన్నా లక్ష్మీనారాయణను రాష్ట్రశాఖ అధ్యక్షునిగా నియమించడంతో మొదటి దశ వ్యూహం అమలు మొదలైందంటున్నారు.

కన్నా తురుపు ముక్క...

తన సిద్దాంతాన్ని, పార్టీని నమ్ముకుని దీర్ఘకాలంగా పనిచేస్తున్న వ్యక్తులను కాదని 2014 ఎన్నికల తర్వాత పార్టీలోకి వచ్చిన కన్నాలక్ష్మీనారాయణకు బీజేపీ పట్టం గట్టింది. సంఘ్ పరివార్ శక్తులు నిరసిస్తాయి. పార్టీలో అసంతృప్తి సెగలు రగులుతాయి. కొందరు రాజీనామాలు చేసే అవకాశమూ ఉంది. ఇవన్నీ తెలిసి కూడా బీజేపీ సాహసించింది. రిస్కు తీసుకుంది. ఇందుకు అనేక రాజకీయ గణాంకాలు, సమీకరణలు దోహదం చేశాయి. కాపు సామాజిక వర్గానికే చెందిన మాజీ మంత్రి మాణిక్యాల రావు, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఈ పదవి కోసం పోటీ పడ్డారు. వీరందరికి పార్టీతో దీర్ఘకాలంగా అనుబంధం ఉంది. సోము వీర్రాజు తీవ్రంగా ప్రయత్నించారు. వీళ్లెవర్నీ కాదంటూ పార్టీ నుంచి వెళ్లిపోతానని బెదిరించిన కన్నా కే అగ్రతాంబూలం అందించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తెలుగుదేశం సామాజిక వర్గ నేపథ్యంలో బలమైన పార్టీగా ఉంది. కాపులు మాత్రమే బలమైన ప్రత్యామ్నాయ శక్తులుగా ఉన్నారు. వంగవీటి మోహనరంగా తర్వాత ఈ రెండు జిల్లాల్లో కాపు సామాజిక వర్గంలో అంతటి పలుకుబడి కలిగిన నాయకుడు కన్నాలక్ష్మీనారాయణ. కృష్ణా, గుంటూరుల్లో ఇతరసామాజిక వర్గాలతోనూ కన్నాకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఉభయగోదావరి జిల్లాల్లోని నాయకులకు బాద్యతలు అప్పగించినా అంతటి ప్రభావాన్ని చూపలేరనేది అధిష్టానం అంచనా. అందులోనూ ఈ జిల్లాల్లో జనసేన హవా నడుస్తుందని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.కాపు సామాజికవర్గం పవన్ కల్యాణ్ కే మద్దతు గా నిలుస్తారని బీజేపీ నాయకులే ఆంతరంగికంగా ప్రకటిస్తున్నారు. అందుకే మాణిక్యాలరావు, ఆకుల, సోము సోదిలో లేకుండా పోయారు. అంతేకాకుండా కన్నాకు వైసీపీతో ఉన్న ఈక్వేషన్లు కూడా భవిష్యత్తులో బీజేపీకి లాభిస్తాయనేది భావన. వైసీపీలోకి వెళ్లడానికి రంగం సిద్దం చేసుకున్న తర్వాతనే అమిత్ షా జోక్యం చేసుకుని కన్నాలక్ష్మీనారాయణను తమ పార్టీ వీడకుండా కాపాడుకున్నారు. ఎన్నికల అనంతరం కన్నాను బీజేపీ, వైసీపీ పొత్తునకు తురుపుముక్కగా వినియోగించేందుకు ముందస్తుగానే రంగం సిద్దం చేసుకుంటున్నారనేది పరిశీలకుల విశ్లేషణ.

రాజీనామాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే...

ప్రత్యేక హోదా కోసం తాము పోరాటం చేస్తున్నామంటూ తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళుతోంది. ప్రత్యేక హోదా అస్త్రం ఆ పార్టీ వద్ద లేకుండా చేసేస్తే సరిపోతుందని బీజేపీ అగ్రనాయకులు ఆలోచిస్తున్నారంటున్నారు. ముఖ్యంగా ఇప్పటికే హోదా కోసం వైసీపీ ఎంపీలు అయిదుగురు రాజీనామాలు సమర్పించారు. స్పీకర్ వాటిని ఆమోదించాల్సి ఉంది. మోడీ, అమిత్ షాలు ఈవిషయంలో శ్రద్ధ వహిస్తే ఒక్క క్షణంలో వాటి ఆమోదం జరిగిపోతుంది. ప్రత్యేక హోదా ఇవ్వలేదనే ముద్ర బీజేపీపై ఎలాగూ పడిపోయింది. దాని నుంచి తప్పించుకోవడం సాధ్యం కానంతగా విస్తృత ప్రచారాన్ని టీడీపీ కల్పించింది. అదే అంశంపై రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలు ఉప ఎన్నికకు వెళితే ఆపార్టీకి అడ్వాంటేజీ ఉంటుంది. టీడీపీ ఎంపీలను రాజీనామా చేయమని జగన్ డిమాండ్ చేసినా చంద్రబాబు స్పందించలేదు. వైసీపీ సాహసం చేసింది. కమిట్ మెంట్ ఉందనే ఒక సెంటిమెంటును ఆ పార్టీ రగిలించకలుగుతుంది. సాకులు చెప్పడం టీడీపీకి కష్టమవుతుంది. అయితే బీజేపీ మాత్రం దారుణంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ వైసీపీకి ప్రజల్లో మొగ్గు కల్పించగలిగితే దాని ప్రభావం సార్వత్రిక ఎన్నికల వరకూ కొనసాగితే వేవ్ క్రియేట్ చేయవచ్చనేది బీజేపీ ఆలోచనగా కొందరు చెబుతున్నారు. వైసీపీ కూడా ఇందుకు సిద్దంగానే ఉందనేది సమాచారం. ఇదే జరిగితే టీడీపీ ప్రత్యేక హోదా పోరాటమనేది గాలిలో కలిసిపోతుంది. వైసీపీ విశ్వసనీయత పెరుగుతుందని బీజేపీ , వైసీపీలు రెండూ లెక్కలు వేసుకుంటున్నాయి. అయితే ఉప ఎన్నికలు వస్తే టీడీపీ సర్వశక్తులు సమీకరించే అవకాశం ఉంటుంది. కానీ నంద్యాల తరహాలో మొత్తంగా యంత్రాంగాన్ని దింపలేదు. అయిదు పార్లమెంటు స్థానాల పరిధి అంటే దాదాపు 35 అసెంబ్లీ నియోజకవర్గాల మీద కాన్సంట్రేషన్ పెట్టడం కష్టం. మినీ సార్వత్రిక ఎన్నికల వాతావరణాన్ని సృష్టించినట్లవుతుంది. జనసేన వంటి చిన్న పార్టీలు సైతం ఈ వేడిలో తడబడి సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే బలహీన పడాలంటే ఉప ఎన్నికలు ఒక్కటే శరణ్యమనే భావన నెలకొంది. ఆచితూచి పావులు కదుపుతూ ఎవరికీ అనుమానం రాకుండా జూన్ నెలలోపు రాజీనామాల ఆమోదం తంతు ముగిస్తే రాజకీయ రణం మొదలై పోయినట్లే చెప్పవచ్చు.

బాబుకు సంకేతాలు...

ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయని చంద్రబాబు నాయుడికి ఢిల్లీ నుంచి సంకేతాలున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ పార్టీశ్రేణులు ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఒకవేళ ఉప ఎన్నికలు ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన ఎంపీలు, దాని కోసం పోరాడుతున్న టీడీపీ మధ్య పోరుగా ప్రజలు భావిస్తే త్యాగం చేసిన వారివైపే సెంటిమెంటు మొగ్గు ఉంటుంది. అందుకే ప్రస్తుతం కౌంటర్ స్ట్రాటజీ వైపు టీడీపీ దృష్టి సారిస్తోంది. బీజేపీ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఆ తీవ్రతను వైసీపీ వైపు మళ్లించగలిగితే టీడీపీ గట్టెక్కగలుగుతుందనే అంచనా. అందుకే వైసీపీ, బీజేపీలు రెండూ కుమ్మక్కవుతున్నాయనే ప్రచారం ఇప్పట్నుంచే మొదలు పెట్టారు. ఎన్నికల తర్వాత బీజేపీతో వైసీపీ కలిసిపోతుందనే ఉధృత ప్రచారాన్ని సైతం వివిధ రూపాల్లో మొదలుపెట్టాలని చూస్తున్నారు. దీనివల్ల మైనారిటీ, దళిత ఓట్లను వైసీపీకి దూరం చేయవచ్చనేది దూరాలోచన. ఈ మూడుపార్టీల ఎత్తుగడల ఫలితం తేలాలంటే ముందుగా రాజీనామాల పర్వం పూర్తి కావాల్సి ఉంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News