బీజేపీకి షాక్ ఇవ్వనున్న ఎమ్మెల్యే…?

జనసేనకు ఆశించిన స్థాయిలో నాయకుల వలసలు లేవన్న ఆందోళనకు తెరదించుతూ ఈనెల 21న పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు బిజెపి ఎమ్యెల్యే ఒకరు. రాజమండ్రి అసెంబ్లీ [more]

Update: 2019-01-12 11:00 GMT

జనసేనకు ఆశించిన స్థాయిలో నాయకుల వలసలు లేవన్న ఆందోళనకు తెరదించుతూ ఈనెల 21న పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు బిజెపి ఎమ్యెల్యే ఒకరు. రాజమండ్రి అసెంబ్లీ నుంచి బిజెపి తరపున పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచిన డాక్టర్ ఆకుల సత్యనారాయణ తన దారి తాను చూసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పార్టీకి ప్రజల్లో సరైన ఆదరణ లేకపోవడంతో గత కొంతకాలంగా డాక్టర్ ఆకుల ఆందోళన చెందుతూ వస్తున్నారు. అయితే ఈలోగా జనసేన రంగంలోకి దూసుకొచ్చిన నేపథ్యంలో డాక్టర్ ఆకుల ఆ పార్టీ వైపు పక్క చూపులు చూడటం మొదలు పెట్టారు. ముందుగానే జనసేన పార్టీతో ఎమ్యెల్యే భార్య పద్మావతి టచ్ లో ఉండటం చర్చనీయాంశం అయ్యింది.

డాక్టర్ నుంచి రియల్టర్ తరువాత పాలిటిక్స్ …

ప్రముఖ వైద్యుడిగా రాజమండ్రిలో గుర్తింపు ఉన్న డాక్టర్ ఆకుల సత్యనారాయణ రియల్టర్ గా మారి అతి తక్కువ కాలంలోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగారు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ లో చేరి టికెట్ ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడ ఆయనకు రిక్త హస్తమే లభించింది. ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీలో చేరి టికెట్ ప్రయత్నం చేసినా అక్కడా నిరాశే ఎదురైంది. ఆ తరువాత బీజేపీలో చేరి పార్లమెంట్ స్థానం కోసం గట్టి ప్రయత్నాలు చేసినా టిడిపితో పొత్తు నేపథ్యంలో ఎమ్యెల్యేగా పోటీ చేయాలిసి వచ్చింది.

వచ్చీ రాగానే రెండు గ్రూప్ లు..

డాక్టర్ ఆకుల బిజెపి నుంచి గెలిచిన వెంటనే ఆయనను పార్టీలోకి తీసుకువచ్చిన పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు తో విభేదాలు వచ్చి పడ్డాయి. దీంతో ఎమ్యెల్యే, ఎమ్యెల్సీ వర్గాలుగా బిజెపి రాజమండ్రిలో నడుస్తూ వచ్చింది. సోము వీర్రాజుకు డాక్టర్ ఆకుల ప్రతి సందర్భంలో తలపోటుగా మారారు. ఈ నేపథ్యంలోనే రాజమండ్రిలో రెండు పార్టీ కార్యాలయాలు కొనసాగాయి కూడా. ఎమ్యెల్యే ఆకుల పార్టీ మారాలన్న నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదని ఎప్పటి నుంచో ఆయన బీజేపీలో ఇమడలేక వేరే అవకాశం లేక కొనసాగుతున్నారని ఆయన సన్నిహితుల మాట.

గెలిచే అవకాశాలు లేకపోవడంతో … ?

బిజెపి ఏపీలో పూర్తిగా నిరాదరణకు గురవుతుందని ముందే గుర్తించి డాక్టర్ ఆకుల తన దారి తాను చూసుకోవాలని జనసేన అధినేత పవన్ తో టచ్ లో ఉంటూ వస్తున్నారు. వచ్చే ఫిబ్రవరిలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఇక ముసుగు తొలగించాలన్న నిర్ణయానికి వచ్చి మంచి రోజుగా ఈనెల 21ని నిర్ణయించినట్లు ఆయన సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం. ఆ రోజు పార్టీకి తన ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేసి జనసేన తీర్ధం పుచ్చుకోవడం లాంఛనమే అంటున్నారు. అందుకోసం ఆయన సర్వ సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.

Tags:    

Similar News