మోడీ చేతుల్లోనే జగన్ భవిష్యత్తు..?

జగన్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన దూకుడు రాజకీయం చేస్తారు. అది కొన్ని సార్లు ప్లస్ అయినా ఎక్కువ సార్లు మైనస్ అవుతుంది. గత ఏడాదిన్నర పాలనలో [more]

Update: 2020-10-27 12:30 GMT

జగన్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన దూకుడు రాజకీయం చేస్తారు. అది కొన్ని సార్లు ప్లస్ అయినా ఎక్కువ సార్లు మైనస్ అవుతుంది. గత ఏడాదిన్నర పాలనలో అది రుజువు అయింది. జగన్ పాలనకు కొత్త కానీ, వ్యవస్థలు అన్నీ పాతవే. అవి సుదీర్ఘకాలంగా ఒక పద్ధతిలో పనిచేస్తున్నాయి. ఎవరో వచ్చారని అవి మారవు. లోపాలు తప్పులు ఉంటే నెమ్మదిగా సరిచేసుకోవాలి, కానీ అన్నప్రాసననాడే ఆవకాయ పెట్టేసే ఆరాటం వల్ల నష్టపోయేది జగనే. సరే ఈ సంగతి తెలిసినా కూడా జగన్ తన దూకుడు పాలిటిక్స్ ఎక్కడా ఆపడంలేదు.

జోస్యాలు పెరిగాయి….

జగన్ పదవి ఊడుతుంది, ఆయన మాజీ అవుతారు అంటూ అపుడే జోస్యాలు చెప్పడం మొదలైపోయింది. ఎందుకంటే ఆయన సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి మీద ఆరోపణలు చేశారుట. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి మరీ రచ్చ చేశారట. ఇక జగన్ పదవి క్రిస్మస్ నాటికల్లా పోతుందని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు జోస్యం చెప్పేసారు. అపుడే తాను ఏపీకి వస్తాను అంటున్నారు. ఇక విశాఖ ఆక్టోపస్ సబ్బం హరి కూడా జగన్ సీఎం గా ఎక్కువ రోజులు ఉండరని అంటున్నారు. ఇవి వైసీపీలో పెద్ద ఎత్తున అలజడిని రేకెత్తిస్తున్నాయి. మరి ఇలాగే జరుగుతుందా. అలా జరిగితే గతి గత్యంతరం ఏంటి అన్నది కూడా వారిని పట్టిపీడిస్తోంది.

మోడీతోనే ….

ఈ కీలకమైన సమయంలో కేంద్రంలో అగ్ర స్థానంలో ఉన్న మోడీ, అమిత్ షాల మీదనే అందరి దృష్టి ఉంది. జగన్ ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకున్నారు. సుప్రీం కోర్తు ప్రధాన న్యాయమూర్తి చేతిలో బంతి ఉంది. అదే సమయంలో కేంద్రంలోని ప్రభుత్వం కూడా ఇపుడు చాలా ముఖ్యమైన పాత్ర వహించాలి. కేంద్రం చొరవ తీసుకుంటేనే ఈ వివాదానికి ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుంది అని అంటున్నారు. న్యాయ వ్యవస్థ, శాసనవ్యవస్థల మధ్య ఘర్షణ మంచిది కాదు అని కూడా అంతా అంటున్నారు. అయితే కేంద్రం మనసులో ఏముందో ఇంతదాకా బయటపడలేదు. మరి జగన్ అక్టోబర్ మొదటి వారంలో ఢిల్లీ వెళ్లారు. అపుడే ఆయన లేఖను సీజేఐకి రాశారు. మరి కేంద్ర పెద్దలతో సంప్రదించకుండా ఇంతటి రిస్క్ తీసుకుంటారా అన్నది ఒక వైపు వాదన.

వారిని నమ్మొచ్చా …?

రాజకీయాల్లో ఎపుడు ఎవరు ఎలా ఉంటారో తెలియదు. కేంద్రంలోని పెద్దలు జగన్ తో అవసరార్ధం చెలిమి చేస్తున్నారు. ఆ సంగతి జగన్ కి ఎంతవరకు తెలుసో తెలియదో కానీ రాజకీయంపై అవగాహన ఉన్నవారందరికీ అది తెలుసు. జగన్ వరకూ చూసుకుంటే కళ్ళు మూసుకుని కేంద్రానికి మద్దతు ఇస్తున్నారు. అయితే జగన్ ఇపుడు అతి పెద్ద కోరిక కోరుతున్నారు. అమరావతి రాజధాని భూముల మీద సీబీఐ విచారణ జరగాలి. జగన్ సీజేఐ కి రాసిన లేఖను కూడా ఆ వైపు నుంచే చూడాలి. కానీ అది చాలా విషయాలతో ముడిపడిఉంది. జగన్ భావిస్తున్నట్లుగా చేయడానికి బీజేపీ రెడీ కావాలంటే స్వయంగా కొన్ని తలనొప్పులు భరించాలి. అలా చేయడానికి అంత పెద్ద పార్టీ ఎందుకు సిధ్దంగా ఉంటుంది అన్నది కూడా చర్చగా ఉంది. ఒకవేళ మోడీ కానీ ఈ సమయంలో చేయి వదిలేస్తే జగన్ భవిష్యత్తు దారుణమైన ఇబ్బందుల్లో పడుతుంది అని అంతా అంటున్నారు. మరి మోడీ, షాలకు జగన్ మీద ఉన్న అసలైన ప్రేమ ఏంటన్నది కొద్ది రోజుల్లోనే అంతా చూస్తారని చెబుతున్నారు.

Tags:    

Similar News