డైరెక్షన్ ఢిల్లీ నుంచేనా?

ఏపీ బీజేపీ అధ్యక్షునిగా చాలాకాలం పాటు పనిచేసిన హరిబాబు విశాఖ ఎంపీగా అయిదేళ్ళ పాటు కొనసాగారు. ఆయన ఏ హోదాలో ఉన్నా కూడా ఇతర రాజకీయ పార్టీల [more]

Update: 2019-11-24 03:30 GMT

ఏపీ బీజేపీ అధ్యక్షునిగా చాలాకాలం పాటు పనిచేసిన హరిబాబు విశాఖ ఎంపీగా అయిదేళ్ళ పాటు కొనసాగారు. ఆయన ఏ హోదాలో ఉన్నా కూడా ఇతర రాజకీయ పార్టీల నాయకులను ఘాటుగా విమర్శించి ఎరగరు. ఆయన ఎపుడూ సైలెంట్ గానే ఉంటారు. బీజేపీ సిధ్ధాంతాల గురించి ఎంత చెప్పమన్నా చెబుతారు కానీ ఎదుటి వారిని విమర్శించమంటే మాత్రం దూరం జరుగుతారు. అటువంటి హరిబాబు ఇపుడు పెద్ద గొంతు చేసుకుంటున్నారు. మరి కాషాయదళం నాయకుల నుంచి ఆదేశాలు వచ్చాయో మరేంటో తెలియదు కానీ పార్టీ నాయకుల మీటింగులో హరిబాబు గట్టిగానే బాణాలు వేస్తున్నారు. జగన్, చంద్రబాబు మీద విమర్శలు ధాటిగానే చేస్తున్నారు.

జైలు నుంచి ఒకరు.. వెళ్ళేది ఒకరు….

ఏపీలో ముఖ్యమంత్రుల కధలు ఇలా ఉన్నాయంటూ హరిబాబు చేసిన హాట్ కామెంట్స్ ఇపుడు తాజా రాజకీయాల్లో చర్చగా ఉన్నాయి. జైలు నుంచి వచ్చిన ఒకరు ముఖ్యమంత్రిగా ఉంటే నిన్నటివరకూ ముఖ్యమంత్రిగా ఏపీని ఏలిన వారు రేపో మాపో జైలుకు వెళ్ళబోతున్నారని హరిబాబు మాటల తూటాలే పేల్చారు. అక్రమాస్తుల కేసులో జగన్ 16 నెలల పాటు జైల్లో ఉన్నారని, ఇపుడు అదే అక్రమాస్తుల కేసులో చంద్రబాబు ఏసీబీ విచారణను ఎదుర్కోబోతున్నారని అర్ధం వచ్చేలా హరిబాబు మాట్లాడారు. ఇప్పటివరకూ బీజేపీ నేతలెవరూ ఇంత గట్టిగా కామెంట్స్ చేసి ఎరుగరు. మరో వైపు సీనియర్ నేత పీవీ చలపతిరావు లాంటివారు బీజేపీలో ఉంటూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎమ‌ర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్ళారని హరిబాబు గుర్తు చేశారు. ఇపుడు జైళ్లకు వెళ్తున్న వారు, వెళ్ళిన వచ్చిన వారు ఎందుకోసం శిక్షలు అనుభవిస్తున్నారో చెప్పగలరా అని హరిబాబు ప్రశ్నించారు. మొత్తానికి హరిబాబు సైలెంట్ గా ఉంటూనే గట్టి పంచులే వేశారని కమలనాధులే హుషార్ అవుతున్నారు.

బాబు మీద ఫస్ట్ టైం…

ఇక్కడో విషయం ఉంది. హరి బాబు చంద్రబాబు మీద ఇలా ఎపుడూ విమర్శలు చేయలేదు. ఆయన పార్టీ వారు ఎన్ని విమర్శలు చేసినా కూడా హరిబాబు మాత్రం మౌనమే నా భాష అన్నారు. అటువంటి హరి బాబు ఇపుడు ఇన్నాళ్ళకు బాబు మీద కూడా మాటల యుధ్ధానికి సిధ్ధపడుతున్నరంటే బీజేపీ పెద్దల డైరెక్షన్ లాగానే ఉంది అంటున్నారు. ఏపీ బీజేపీలో బాబుకు ఓ వర్గం మద్దతు ఉందని వస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి అందరి చేతా హోల్ సేల్ గానే బాబుకు కౌంటర్లు ఇప్పించేందుకు బీజేపీ హై కమాండ్ రెడీ అయిందని అంటున్నారు. మరో వైపు నీతి నిజాయతీ బీజేపీ వైపు, అవినీతి కధలు, జైలు జీవితాలు మరో వైపు అంటూ కమలం పార్టీ కొత్త రాజకీయ ప్రచారానికి సన్నధ్ధమవున్నట్లే కనిపిస్తోంది. మరి చూడాలి బీజేపీ చెబుతున్న ఈ జైలు కధలను జనం ఎంతమేరకు విశ్వసిస్తారో, ఏపీ రాజకీయాలు ఏ మలుపు తీసుకోబోతున్నాయో.

Tags:    

Similar News