ఈసారి అస్సోం అంత సులువు కాదటగా?

వచ్చే ఏడాది మే నెలలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళతో పాటు అస్సోం, పుదుచ్చేరి అసెంబ్లి ఎన్నికలు జరగనున్నాయి. అస్సోం, పుదుచ్చేరి పేరుకు చిన్న రాష్ట్రాలు అయినప్పటికి [more]

Update: 2020-07-19 16:30 GMT

వచ్చే ఏడాది మే నెలలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళతో పాటు అస్సోం, పుదుచ్చేరి అసెంబ్లి ఎన్నికలు జరగనున్నాయి. అస్సోం, పుదుచ్చేరి పేరుకు చిన్న రాష్ట్రాలు అయినప్పటికి రాజకీయంగా వాటి ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయలేం. ఈశాన్య రాష్ట్రాల్లో అతిపెద్ద రాష్ట్రం అస్సోం. ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారం వంటిది ఈ రాష్ట్రం. ప్రస్తుతం ఇక్కడ సర్బానంద సోనావాల్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. తమిళనాడు పక్కనగల చిన్న ప్రాంతమే పుదుచ్చేరి. ఇది పూర్తి స్ధాయి రాష్ట్రం కాదు. కేంద్రపాలిత ప్రాంతం. అంటే ఢిల్లీ లాంటిది. పుదుచ్చేరికి ముఖ్యమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. సాధారణంగా రాష్ట్రాలకు గవర్నర్, కేంద్రపాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. గవర్నర్ కన్నా లెఫ్టినెంట్ గవర్నర్ కు ఒక్కింత ఎక్కువ అధికారాలు ఉంటాయి.

ఒకస్థానం నుంచి….

126 అసెంబ్లీ స్ధానాలుగల అస్సోం అసెంబ్లీకి 2016 మే లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. బీజేపీ 60, దాని మిత్రపక్షాలైన అస్సోం గణపరిషత్ 14, బోడో పీపుల్స్ ఫ్రంట్ 12 స్ధానాలు సాధించాయి. అసెంబ్లీ లో ఏక సంఖ్యా బలం కలిగిన కమలం పార్టీ ఒక్కసారిగా అధికారాన్ని అందుకుంది. 2001 నుంచి వరుసగా అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ సీఎం తరుణ్ గొగోయ్ ను ఓడించింది. అస్సోం విజయానికి సర్బానంద సోనావాల్, హిమంత్ బిశ్వశర్మ కారకులు. అప్పటి వరకు కేంద్రమంత్రిగా పనిచేసిన సోనావాల్ ను అధిష్టానం తెరపైకి తీసుకువచ్చింది. హిమంత్ బిశ్వశర్మ సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో కొనసాగారు. ఆయనకు ఈశాన్య రాష్ట్రాల రాజకీయాలు కొట్టినపిండి. ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక మంత్రి. కమలం పార్టీకి కళ్ళు,చెవులు వంటివారు. ప్రపూల్ కుమార్ మహంతా నేతృత్వంలోని అస్సోం గణపరిషత్, బోడో పీపుల్స్ ఫ్రంట్ వంటి ప్రాంతీయపార్టీలతో ఎన్.డి.ఎ గా ఏర్పడి 86 స్ధానాలను సాధించింది.

పౌరసత్వ చట్టంతో….

ఇటీవల కాలంలో కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించింది. రాష్ట్ర పార్టీ నాయకులు ఎంత సర్దిచెప్పనప్పటికీ దానిపై ప్రజల్లో అసంతృప్తి తొలగిపోలేదు. బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల భరతం పడతామంటుా అధికారంలోకి వచ్చి బీజేపీ కనీసం ఒక్క బంగ్లాదేశ్ అక్రమవలసదారుడిని కుాడా వెనక్కి పంపలేదని సిఎఎ ఆందోళనకారులు ధ్వజమెత్తారు. ఈ నేపద్యంలో 100 మిషన్ పేరుతో వచ్చే ఎన్నికల్లో గెలుపునకు కమలం పెద్దలు పావులు కదుపుతున్నారు. ముఖ్యమంత్రి సర్బానంద సోనావాల్, రాష్ట్ర ఆర్ధిక మంత్రి హిమంత బిశ్వశర్మ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రంజిత్ కుమార్ రావ్ పార్టీ విజయానికి ప్రణాళికలు రచిస్తున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో మెుత్తం రాష్ట్రంలోని 14 పార్లమెంటు స్థానాలకుకు 9 స్ధానాలను కమలం పార్టీ కైవసం చేసుకుంది. ఆ ప్రాంతిపదికన చుాస్తే అసెంబ్లి ఎన్నికల్లో పార్టీ గెలుపు నల్లేరుపై నడక కావాలి. కానీ లోక్ సభ ఎన్నికల అనంతరం జరిగిన ఢిల్లీ, జార్ఖండ్, మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లి ఎన్నికల ఫలితాల ప్రతికుాలంగా వచ్చిన నేపద్యంలో రాష్ట్రపార్టీ నేతలు ఒకింత ఆందోళన చెందుతున్న మాట నిజం. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 26 స్ధానాలు, లోక్ సభ ఎన్నికల్లో ఒక్క స్ధానానికి పరిమితమైన హస్తం పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. మిషన్ – 80 పేరుతో ముందుకు వెళుతున్నట్లు మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, రిపున్ బోరా వెల్లడించారు. కమలం మెాసాన్ని ప్రజలు గ్రహించారని వారు తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో తేజ్ పుల్ స్ధానం నుంచి మాజీ ఐఎఎస్ అధికారి ఎమ్ జి వి కె భాను పోటీచేసి ఓడిపోయారు. ఈయన మాజీ కేంద్రమంత్రి పి.వి రంగయ్య నాయుడు అల్లుడు. నాటి ఎన్నికల్లో మరో ప్రాంతీయ పార్టీ ఎఐయుడిఎఫ్ 13 స్ధానాలు సాధించింది.

పుదుచ్చేరిలోనూ….

30 స్ధానాలుగల పుదుచ్చేరి లో వి.నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ – డిఎమ్.కె సంకీర్న సర్కారు కొనసాగుతోంది. 2016 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ 15, డిఎమ్.కె 3 స్ధానాలు సాధించాయి. అనేక ఆటుపోట్లు ఎదురైనప్పటికి గత అయిదేళ్ళుగా నారాయణస్వామి సర్కారు కొనసాగుతుండటం విశేషం. బీజేపీ మనిషి అయిన రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ అనేక ఇబ్బందులు పెడుతున్నప్పటికి నారాయణస్వామి సర్కారు వాటిని అధిగమిస్తోంది. పాలన వ్యవహారాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ తరచుా జోక్యం పై రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించడం విశేషం. మాజీ ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి నాయకత్వంలోని అఖిలభారత ఎన్.ఆర్.కాంగ్రెస్ 7, ఆయన తో కలసి పోటీచేసిన అన్నా డిఎమ్.కె 4 స్ధానాలు గెలిచింది. గతఏడాది లోక్ సభ ఎన్నికల్లో పుదుచ్చేరి స్ధానాన్ని కాంగ్రెస్ అభ్యర్ధి వైద్యలింగం దాదాపు 2 లక్షల మెజారిటీని సాధించారు. ఈ ప్రాతిపదికన చుాస్తే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్ళీ గెలవాలి. అప్పటికీ రాజకీయంగా ఎన్ని మార్పులు జరుగుతాయో వేచిచూడాలి. మరోపక్క వచ్చే ఎన్నికల్లో డి.ఎమ్.కె తో కలసి పోటీచేస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రకటిస్తున్నారు. తమిళనాడు పిసిసి చీఫ్ కె.ఎస్.ఆళగిరి, మాజీ చీఫ్ కె.వి.తంగబాలు, ముఖ్యమంత్రి నారాయణస్వామి ఇటీవల డిఎమ్.కె అధినేత స్టాలిన్ తో సమావేశమయ్యారు. డిఎమ్.కె తో విభేదాలున్నాయని వస్తున్న వార్తల నేపధ్యంలో వారిభేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుత పరిస్ధితుల ప్రకారం చుాస్తే ఎన్ని విభేధాలు ఉన్నప్పటికీ ఉభయ పార్టీలు ఉమ్మడిగానే ముందుకు వెళ్ళే అవకాశం ఉంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News