పోయే వారు పోతే.. పోనీ… నో కాంప్రమైజ్

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. సందర్బాన్ని బట్టి, అవసరాలను బట్టి, ప్రయోజనాలను బట్టి స్నేహాలు ఉంటాయి. శత్రుత్వాలు ఏర్పడతాయి. అంతే తప్ప సిద్ధాంతాలు, విలువలు [more]

Update: 2020-10-02 16:30 GMT

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. సందర్బాన్ని బట్టి, అవసరాలను బట్టి, ప్రయోజనాలను బట్టి స్నేహాలు ఉంటాయి. శత్రుత్వాలు ఏర్పడతాయి. అంతే తప్ప సిద్ధాంతాలు, విలువలు స్నేహ్నానికి ప్రాతిపదిక కావు. అవి పైకి చెప్పే మాటలు. పొత్తుల వల్ల ఎవరెవరికి ఎంతమేరకు ప్రయోజనం అన్నదానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అకాలీదళ్- బీజేపీ బంధాన్ని చూసినా, ఏడాది క్రితం శివసేన-బీజేపీ బంధాన్ని పరిశీలించినా అర్థమయ్యే విషయం ఇదే. బీజేపీ ప్రస్థానం ప్రారంభమైన తొలి రోజుల్లో ఆ పార్టీతో జత కట్టడానికి ఏ పార్టీ కూడా ముందుకు రాలేదు. మతతత్వ అన్న పార్టీ ముద్ర ఇందుకు కారణం. దీంతో అతివాద హిందూత్వ భావజాలం గల శివసేన, సిక్కుల మత పార్టీగా గుర్తింపు పొందిన అకాలీదళ్ అప్పట్లో బీజేపీతో కలసి ముందుకు సాగాయి. నాడు ఈ రెండు పార్టీలకు బీజేపీ జూనియర్ భాగస్వామి కావడం గమనార్హం.

బుజ్జగింపులు లేకుండానే…?

కాలక్రమంలో బీజేపీ పెద్ద పార్టీగా అవతరించడంతో పరిస్థితులు మారాయి. ఫలితంగానే మహారాష్ట్రలో కూటమి నుంచి శివసేన బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్, శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్ సీపీతో కలసి సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేసింది. తాజా విషయానికి వస్తే బీజేపీ చిరకాల మిత్రపక్షం అకాలీదళ్ దూరమయ్యే పరిస్థితి కనపడుతోంది. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులు రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీసేవిధంగా ఉన్నాయంటూ అకాలీదళ్ కు చెందిన ఏకైక కేంద్రమంత్రి హరసిమ్రత్ కౌర్ పదవికి రాజీనామా చేశారు. ప్రధాని మోదీ వెనువెంటనే ఎలాంటి బుజ్జగింపులు లేకుండా ఆమోదించడం విశేషం. 2019లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన భాజపాకు కొద్ది రోజుల తరవాత జరిగిన మహారాష్ట్ర ఎన్నికలతో శివసేన దూరమయింది. ఏడాది తరవాత మరో చిరకాల మిత్రపక్షం అకాలీదళ్ కూడా దూరమయ్యే పరిస్థితి నెలకొంది.

ఎన్నికలే కారణం……

పైకి రైతుల ప్రయోజనాలు అని చెప్పినప్పటికీ మరో ఏడాదిలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలే ఇందుకు కారణమన్న అభిప్రాయం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పంజాబ్ రాజకీయాల్లో అకాలీదళ్ కు మొదటినుంచీ బీజేపీ జూనియర్ భాగస్వామి. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఈ ప్రాతిపదికనే పోటీ చేస్తున్నాయి. 2021 ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ప్రాతిపదికన సీట్ల సర్దుబాటుకు బీజేపీ ససేమిరా అంటోంది. మొత్తం 117 సీట్లలో తమకు 59 ఇవ్వాలని, మిగిలిన 58 సీట్లలో అకాలీలు పోటీ చేయాలని రాష్ట్ర కమలం పార్టీ అధ్యక్షుడు అశ్వనీ శర్మ బహిరంగంగానే కోరుతున్నారు. 2017నాటి ఎన్నికల్లో కూటమికి 18 సీట్లు వచ్చాయి. వాటిలో 15 అకాలీలకు, మిగిలిన మూడు కమలానికి దక్కాయి. గత ఏడాది లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 13 సీట్లకుచెరో రెండు గెలుచుకున్నాయి. ఎనిమిది సీట్లు కాంగ్రెస్ ఖాతాలో జమ కాగా, సంగ్రూర్ స్థానాన్ని ఆప్ పార్టీ కైవసం చేసుకుంది.

జూనియర్ భాగస్వామిగా…..

కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన హర సిమ్రత్ కౌర్ భటిండా నుంచి, ఆమె భర్త అయిన పార్టీ అధినేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ ఫిరోజ్ పూర్ నుంచి గెలుపొందారు. గురుదాస్ పూర్ నుంచి భాజపా అభ్యర్థి, బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ విజయం సాధించారు. హోషియాపూర్ స్థానాన్ని కూడా ఆ పార్టీ కైవసంచేసుకోవడం విశేషం. 2014లో పార్టీకి 8.7 శాతం, 2019 ఎన్నికల్లో 9.3 శాతం ఓట్లు వచ్చాయి. అదే సమయంలో అకాలీల ఓట్ల శాతం తగ్గడం గమనార్హం. ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జూనియర్ భాగస్వామిగా ఉండటానికి కమలనాధులు సుముఖంగా లేరు. మరోపక్క దేశవ్యాప్తంగా హిందువులు ఓట్లు కమలానికి పడుతుండగా పంజాబ్ లో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఆ ఓట్లన్నీ హస్తానికి పడుతున్నాయి.

కుటుంబ పాలనపై…..

అకాలీలతో మైత్రి కారణంగా ఈ ఓట్లు కోల్పోతున్నామన్నది కమలం అభిప్రాయం. గ్రామీణ ఓట్లు అకాలీలకు, పట్టణ, నగర ప్రాంత ఓట్లు బీజేపీకు వస్తున్నాయి. ఇటీవల కాలంలో అకాలీల ప్రతిష్ట దెబ్బతిన్నది. పార్టీ వ్యవస్థాపకుడు ప్రకాశ్ సింగ్ బాదల్ 90వ పడిలో ఉన్నారు. ఆయనకున్న పేరు ప్రతిష్టలు కుమారుడైన పార్టీ అధినేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ కు లేవు. పార్టీలో కుటుంబ పాలనపై నిరసనలు వినపడుతున్నాయి. ఇదే అదనుగా బీజేపీ పావులు కదుపుతోంది. అసమ్మతి అకాలీదళ్ నేతలను పార్టీలోకి చేర్చుకునేందుకు సిద్దంగా ఉంది. మొత్తానికి కమలం వెనక్కుతగ్గేటట్లు లేదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News