బీజేపీ జనసేన సంథింగ్.. సంథింగ్…?

పొత్తులు విడిపోవడాలూ ఈ రెండూ రాజకీయాల్లో చాలా కామన్. వర్తమాన రాజకీయ చరిత్ర చూస్తే ఎపుడు ఎవరు ఎవరితో కలుస్తారో ఎందుకు విడిపోతారో కూడా వారికే అర్ధం [more]

Update: 2020-12-08 09:30 GMT

పొత్తులు విడిపోవడాలూ ఈ రెండూ రాజకీయాల్లో చాలా కామన్. వర్తమాన రాజకీయ చరిత్ర చూస్తే ఎపుడు ఎవరు ఎవరితో కలుస్తారో ఎందుకు విడిపోతారో కూడా వారికే అర్ధం కాదు, కేవలం నాలుగు ఓట్ల కోసం కుదుర్చుకునే బంధాల వెనకాల గట్టిగా అనుసంధానం చేసే సిద్ధాంతాలు ఏవీ లేవన్నది తెలిసిందే. అందుకే పొత్తులు కూడా పరిహాసం అయిపోయాయి. ఇక చూడబోతే ఏపీలో జనసేన బీజేపీల మధ్య పొత్తులు అందరినీ షాకింగ్ కి గురి చేశాయి. బీజేపీ తాను పట్టిన కుందేలుకు మూడే కాలు అని పంతం పట్టే రకం. పవన్ ది నిలకడ లేని రాజకీయం. మరి ఈ ఇద్దరికీ ఎలా సయోధ్య కుదిరింది అన్నది తలపండిన మేధావులకు సైతం అర్ధం కాలేదు.

న్యూనతా భావమేనా..?

జనసేనను తక్కువ చేసి చూస్తున్నారు అన్న న్యూనతాభావమేదో ఆ పార్టీ పెద్దలకు కలిగి ఉండాలి అందుకే హఠాత్తుగా హస్తిన టూర్ పెట్టుకుని మరీ బీజేపీ పెద్దలతో భేటీలు వేశారు. ఎన్ని సమావేశాలు జరిగినా బీజేపీ నుంచి పవన్ కోరుకునే క్లారిటీ అయితే రాదు, ఎందుకంటే బీజేపీ ఎప్పటికీ పెద్దన్నే కాబట్టి. బీహార్ లో నితీష్ కుమార్ లాంటి వరిష్ట నేతనే వంచేసిన చరిత్ర బీజేపీది. ఏపీలో చంద్రబాబు లాంటి రాజకీయ గండర గండడు సైతం నాలుగేళ్ల పాటు బీజేపీ ఎలా చెబితే అలా అన్నారు. ఇక కేంద్రం మెడలు వంచుతామని ఎన్నికల్లో పదే పదే చెప్పిన జగన్ ఏడాదిన్నరగా ఏమీ చేయలేకపోవడానికీ బీజేపీ తీరే కారణం.

అంతేగా అంతేగా …?

పవన్ సినిమా హీరో మాత్రమే. బీజేపీ కూడా ఆయనను అలాగే చూస్తోంది. పవన్ మాత్రం తనకు 2019 ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లు వచ్చాయి కాబట్టి ఏపీ వరకూ తాను పెద్దన్న అనుకుంటున్నారు. కానీ ఆ ఓట్లు, ఆ బ్యాంక్ అన్నది నీటి బుడగలాంటిది అని బీజేపీ భావన. ఎందుకంటే పవన్ కి సినీ క్రేజ్ తప్ప పార్టీ షేప్ లేదు, యంత్రాంగం అంతకంటే లేదు. కేవలం సినీ అభిమానులు పవన్ ని డ్యూయట్లు వెండి తెర మీద పాడినా, బయట ఉపన్యాసాలు చెప్పినా చూస్తారు చప్పట్లు కొడతారు. అందువల్ల పవన్ ని ఒక వ్యక్తిగానే బీజేపీ చూస్తోంది అన్నది ఒక విశ్లేషణ. పవన్ తనకు ఏపీలో రాజకీయ వాటా కావాలని అది పొత్తు ధర్మమ‌ని ఏమైనా ఊహించుకుంటే అది అతి అవుతుంది తప్ప మరేమీ ఉండదని కూడా అంటున్నారు.

తెగేదాక లాగితే…?

బీజేపీ ఎన్నడూ లేనంత బలంగా ఇపుడు దేశంలో ఉంది. ఆ పార్టీ ప్రధాని అభ్యర్ధిగా నరేంద్ర మోడీ 2014 ఎన్నికల ప్రచారం వేళ ఏపీలోని ఎన్నికల వేదికల మీద పవన్ పక్కన కూర్చోవచ్చు, ఆయన చేతిలో చేయి వేసి కబుర్లు చెప్పవచ్చు. నాడు గుజరాత్ పవన్ వెళ్తే సాదరంగా స్వాగతించి ఉండవచ్చు. అదంతా గతం. ఇపుడు పవన్ అలాంటివి ఆశించినా తప్పే అవుతుంది. ఎందుకంటే పవన్ రాజకీయ జీవితం తెరచేసిన పుస్తకం అయింది. 2019 తరువాత ఆయన ఏంటో, ఆయన పార్టీ ఏంటో బీజేపీ పూర్తిగా చదివేసింది. అయినా సరే పవన్ తో పొత్తు అని వెంపర్లాడడానికి కారణం ఆయన సినీ క్రేజ్. ఆయన వెనక ఉన్నారని భావిస్తున్న ఒక బలమైన సామాజిక వర్గం ఓట్ల కోసమే. పవన్ దాన్ని ఎక్కువగా ఊహించుకుని లోకల్ లీడర్లను కాదని ఢిల్లీ దాకా వెళ్ళి తేల్చుకోవాలనుకున్నా వాళ్ళు ఏమీ తేల్చరు, ఇక తెగేదాకా లాగితే నష్టపోయేది కూడా పవన్ ఆయన జనసేన మాత్రమే. మొత్తానికి పవన్ కి రాజకీయాల్లో తొలి పాఠాలు ఇలా బీజేపీ దగ్గరుండి నేర్పిస్తుంది అనుకోవాలేమో.

Tags:    

Similar News