ఎటయినా ఓకేనట.. అదే కావాల్సిందట

బీజేపీ ఇప్పుడు వన్ వేలో నే వెళుతుంది. దాని లక్ష్యం ఏపీలో సెకండ్ ప్లేస్. అది సాధ్యం కావాలంటే టీడీపీని బలహీనం చేయాలి. అధికార వైసీపీ పార్టీపై [more]

Update: 2021-01-27 14:30 GMT

బీజేపీ ఇప్పుడు వన్ వేలో నే వెళుతుంది. దాని లక్ష్యం ఏపీలో సెకండ్ ప్లేస్. అది సాధ్యం కావాలంటే టీడీపీని బలహీనం చేయాలి. అధికార వైసీపీ పార్టీపై వ్యతిరేకతను పెంచాలి. ఈ రెండు లక్ష్యాలతోనే ఏపీ బీజేపీ నేతలు ముందుకు వెళుతున్నారు. తిరుపతి ఉప ఎన్నికను పక్కన పెడితే ముందుగా హిందూ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకునేందుకు రధయాత్రను ప్రారంభించనున్నారు. ఈ రధయాత్ర వచ్చే నెల 4వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

రధయాత్రతో….

కపిలతీర్థం నుంచి రామతీర్థం వరకూ ఈ రధయాత్ర జరగనుంది. ఇటీవల ధ్వంసమైన అన్ని ఆలయాలను పరిశీలించే విధంగా ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్రలను కలుపుతూ ఈ రధయాత్ర రూట్ మ్యాప్ ను రూపొందించారు. ఈ రధయాత్ర పట్ల ఎంతవరకూ జనం సానుకూలంగా ఉన్నాన్నది పక్కన పెడితే దీంతో ప్రజల అటెన్షన్ ను తమ వైపు తిప్పుకోవచ్చన్న ఆలోచనలో బీజేపీ అధినేత సోము వీర్రాజు ఉన్నారు.

అడ్డంకులు ఏర్పడినా…..?

ఇక ప్రభుత్వం నుంచి రధయాత్ర కు అడ్డంకులు ఏర్పడినా అది తమకు కలసి వస్తుందని భావిస్తున్నారు. రధయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే దానికి సానుకూలంగా మలచుకునేందుకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు తమ యాత్రను అడ్డుకుంటే హిందువులను అడ్డుకున్నట్లే అని ప్రకటించడం ఈ సందర్భంగా గమనార్హం. అందుకే రధయాత్ర జరిగినా, జరగకపోయినా తమకు లాభమేనన్న విశ్లేషణలు వారు చేస్తున్నారు.

ఉప ఎన్నిక వరకూ…..

దీంతో పాటు తిరుపతి ఉప ఎన్నికలపై కూడా రధయాత్ర ప్రభావం ఉండనుంది. అందుకే వారం రోజుల పాటు మాత్రమే ఈ యాత్ర ఉండేలా సోము వీర్రాజు ప్లాన్ చేశారు. రధయాత్ర తమకు రెండు విధాలుగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇటు పార్టీ బలోపేతానికి, ఇటు తిరుపతి ఉప ఎన్నికకు ఇది ఉపకరిస్తుందని అంచనాలో ఉన్నారు. మొత్తం మీద రధయాత్ర ఏపీ బీజేపీ లో కొత్త మార్పులు తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నిక పూర్తయ్యే వరకూ ఏపీలో ఆలయాల దాడుల అంశాన్ని నాన్చుతూ ఉండాన్నదే బీజేపీ భావనగా కన్పిస్తుంది.

Tags:    

Similar News