పవన్ చరిష్మా మీదనే పెద్దాశ ?

ఏపీలో గెలిచేస్తాం, పొడిచేస్తాం అని బీజేపీ అంటున్నా కూడా క్షేత్ర స్థాయిలో మాత్రం సీన్ వేరేగా ఉంది. బీజేపీకి ఎనభయిల్లో ఉన్న బలమే ఇపుడూ ఉంది. నాడు [more]

Update: 2020-09-09 05:00 GMT

ఏపీలో గెలిచేస్తాం, పొడిచేస్తాం అని బీజేపీ అంటున్నా కూడా క్షేత్ర స్థాయిలో మాత్రం సీన్ వేరేగా ఉంది. బీజేపీకి ఎనభయిల్లో ఉన్న బలమే ఇపుడూ ఉంది. నాడు పాతిక ఏళ్ళు ఉన్న వారే ఇపుడు అరవై డెబ్బయిలకు చేరుకున్నారు. కొత్త నాయకత్వం తయారు కావడంలేదు. ఈ లోటు ఇలా ఉంటే లక్షల్లో సభ్యత్వాలు ఉన్నాయని గట్టిగా చెప్పుకుంటున్నారు. వారి నుంచి కొత్త నేతలను మాత్రం తయారు చేయలేకపోతున్నారు. ఈ పరిణామాల మధ్య ఏపీలో కులాల సమీకరణలను, పవన్ కల్యాణ్ సినీ గ్లామర్ ని అడ్డం పెట్టుకుని ఎంతో కొంత నిలదొక్కుకోవాలని బీజేపీ చూస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రతీ ఏటా తన జన్మదినం వేడుకలు చేసుకుంటారు. అది కేవలం అభిమానుల హంగామాగా ఉండేది. ఈసారి మాత్రం అలా కాదు, బీజేపీ నేతలు పోటీలు పడి పవన్ భజన చేశారు.

బిగ్ షాట్ గా …..

పవన్ కల్యాణ్ సినీ గ్లామర్ బీభత్సంగా ఉంటుంది. అది ఆయన అన్న చిరంజీవిని మించి ఉంటుంది. చిరంజీవి పుట్టిన రోజు ఈ మధ్యనే ‌ జరిగినా చాలా ప్రశాంతంగా అంతా సాగింది, కానీ పవన్ కల్యాణ్ విషయం అలా కాదు, టోటల్ ఆంధ్రా హోరెత్తిపోయింది. కొంతమంది అభిమానులు చనిపోయారు కూడా. ఇలా ఒక నటుడి కోసం ప్రాణాలు అర్పించే మూఢత్వం తమిళనాడులో ఉంది. ఇపుడు ఆంధ్రాలో ఒక్క పవన్ కళ్యాణ్ అభిమానుల్లోనే ఇది కనిపిస్తుంది. వారు పవన్ తరువాతే ఏదైనా అంటారు, ఆఖరుకు తమ కుటుంబాన్నికూడా లెక్కచేయరు. ఇపుడు అదే బీజేపీ లాంటి పార్టీల కళ్ళలో పడుతోంది. పవన్ కల్యాణ్ ను వారు మట్టిలో మాణిక్యంగా చూస్తున్నారు. పవన్ కల్యాణ్ లాంటి బిగ్ షాట్ తోనే ఏపీలో పొలిటికల్ బ్యాటింగ్ చేస్తే అనూహ్యం ఫలితాలు వస్తాయని ఆశపడుతున్నారు.

గౌరవం ఇస్తూనే…?

పవన్ కళ్యాణ్ కి రాజకీయాలు తెలియవు. ఆ మాటకు వస్తే నటిస్తాడు కానీ సినిమా వారికి ఉన్న నటనలు పవన్ కి తెలియవు. స్వచ్చంగా ఉంటాడని దగ్గర నుంచి చూసిన వారు చెబుతారు. ఇక పవన్ కల్యాణ్ లోనూ కొన్ని బలహీనతలు ఉన్నాయంటారు. ఆయన తనకు గుర్తింపు కావాలని కోరుకుంటాడు. ఆ సంగతి తెలిసే చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్నాకూడా పవన్ కి రెడ్ కార్పెట్ పరచి మంత్రులను స్వయంగా ఎయిర్ పోర్టు దాక పంపించి ఘనమైన స్వాగతాలు అప్పట్లో పలికేవారు. ఆ భాగ్యానికి పులకరించి పోయి బోళా శంకరుడుగా పవన్ కల్యాణ్ మారిపోయేవారు. ఇపుడు బీజేపీ కూడా అలాగే పవన్ కీర్తనలు మొదలుపెట్టింది. అందుకే ఏపీ ప్రెసిడెంట్ కాగానే సోము వీర్రాజు పవన్ ఇంటికి వెళ్ళి దండం పెట్టి వచ్చారు. మీరే కూటమికి దిక్కు సుమా అంటూ ఉబ్బించారు. ఇపుడు ఏపీ బీజేపీ నేతలు, కాదు, జాతీయ నేతలు కూడా పవన్ కల్యాణ్ కే విసుగొచ్చేలా ట్వీట్లతో తెగ పొగిడేశారు. ఇదంతా ముందు చూపుతోనేనని అంటున్నారు.

అది చేస్తారా….?

సరే పవన్ కల్యాణ్ కి రాజకీయాలు తెలియవు అని ఎంత చెప్పుకున్నా ఆయన రెండు ఎన్నికలను దగ్గరుండి చూశారు. ఒక ఎన్నికలో అయితే పోటీ చేసి అనుభవం గడించారు కూడా. అందువల్ల పవన్ ఇపుడు ఇలాంటి పొగడ్తలు విని నవ్వుకుంటున్నారు తప్ప మరీ బోళాగా వరాలు ఇచ్చేయడంలేదుట. అయితే జనసేన‌ బీజేపీ కూటమి జనంలోకి దూసుకురావాలంటే బీజేపీ నేతలు అర్జంటుగా చేయాల్సిన పని ఒకటి ఉందిట. అదే పవన్ కల్యాణ్ నికాబోయే సీఎం అని ప్రకటించాలిట. అది కనుక జరిగితే పవన్ రంగంలోకి దూకుతారని అంటున్నారు. అయితే బీజేపీ జాతీయ పార్టీ, పైగా తాము సొంతంగా పోటీ చేసిన రాష్ట్రాల్లో కూడా ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్ధులను ప్రకటించి ఎరగదు. అలాంటిది ఏపీలో పవన్ కల్యాణ్ సీఎంగా నాలుగేళ్ల ముందే ప్రకటిస్తుందా అన్నది పెద్ద చర్చ. పైగా ఎన్నికల నాటికి పరిస్థితులు తమకు సానుకూలంగా ఉంటే ఈ ప్రకటన ముందరి కాళ్ళకు బంధం వేస్తుందేమోనని కూడా వారికి ఉంది. అందుకే పవన్ కల్యాణ్ ను ఇలా ఉబ్బేస్తూనే పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. కానీ పవన్ కంటే ముందు ఆయన అభిమానులు ఊరుకునేలా లేరే. చూడాలి మరి ఈ కూటమి జూలకటక ఎలా ఉంటుందో.

Tags:    

Similar News