పాత గుర్రాలకు పరుగు పందెం...?

Update: 2018-04-12 15:30 GMT

గడచిన నాలుగు సంవత్సరాలుగా పనిచెప్పకుండా పక్కనకూర్చోబెట్టిన సీనియర్ రాజకీయవేత్తలకు పనిచెప్పాలనుకుంటోంది బీజేపీ అగ్రనాయకత్వం. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, వామపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. ప్రత్యేకహోదా సాధన సమితి వంటి సంస్థలూ వేడి రగిలుస్తున్నాయి. ఇక రాష్ట్రంలో ప్రధానప్రతిపక్షమైన వైసీపీ ఢిల్లీలో చేసిన దీక్ష సైతం కేంద్రంపై ఎక్కుపెట్టిన అస్త్రమే. నేరుగా బీజేపీని వైసీపీ విమర్శించకపోయినా చేసిన ఉద్యమం మాత్రం జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. కాంగ్రెసు సంగతి సరేసరి. మొత్తమ్మీద ఏపీలో రాజకీయ పార్టీలన్నీ తనకు వ్యతిరేకంగా ఉన్నట్లు స్పష్టంగా తెలుసుకున్న బీజేపీ కౌంటర్ స్ట్రాటజీ ఏమిటన్న ఆలోచనలో పడింది. ఈ భారం , బాధ్యత సీనియర్లకు అప్పగించాలనే దిశలో మేధోమధనం సాగిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే వారంతా ఇప్పుడు ప్రజల నుంచి వ్యక్తమవుతున్న శత్రుభావాన్ని తట్టుకోగలమా? అన్న సందేహంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఫలితం లభిస్తుందో లేదో తెలియని ప్రయత్నం మాత్రం జోరుగా సాగుతోంది.

నోరు కుట్టేశారు...

1998-99 సమయంలో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి కొంత పాప్యులారిటీ పెరిగింది. వాజపేయి పట్ల సానుభూతి, కార్గిల్ వార్, తెలుగుదేశం తో మైత్రి వంటి అంశాలన్నీ కలిసి వచ్చి ఒక బలమైన పార్టీగా తొలిసారిగా తనను తాను నిరూపించుకుంది కమలం పార్టీ. 2004 కి వచ్చేనాటికి మళ్లీ పరపతి పలచబడిపోయింది. 2009 కి మరింత దిగజారింది. 2014 మళ్లీ తెలుగుదేశంతో జతకట్టింది. ఊపిరిపోసుకుంది. అయితే సొంతంగా బలపడటానికి టీడీపీతో మైత్రి ఆటంకంగా మారింది. రాష్ట్రవిభజనతో హేమాహేమీల వంటి కాంగ్రెసు నాయకులు పార్టీని విడిచిపెట్టి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కావూరు సాంబశివరావు, పురందేశ్వరి, కన్నాలక్ష్మీనారాయణ వంటివారు ఈ కోవలో ఉన్నారు. తమ ప్రాంతాలతోపాటు రాష్ట్రస్థాయి ప్రభావం చూపగలవారు వీరంతా. మేధావి, మంచి వక్తగా ముద్ర పడిన ఉండవల్లి అరుణ్ కుమార్ , పారిశ్రామిక వేత్త, ఆంధ్రాఅక్టోపస్ లగడపాటి రాజగోపాల్ వంటి వారు సైతం కాంగ్రెసుకు దూరమయ్యారు. కానీ ఏ పార్టీని ఎంచుకోలేదు. కేంద్రంలో బీజేపీ రావడంతో ఆ పార్టీలో చేరినవారికి మంచి హోదా లభిస్తుంది. వారి కృషితో రాష్ట్రంలో కమలవికాసం జరుగుతుందని చాలామంది భావించారు. కానీ జరిగింది అందుకు విరుద్దం. ముఖ్యంగా కావూరు, కన్నా, పురందేశ్వరి వంటివారు తెలుగుదేశం అధినేతతో తీవ్రమైన శత్రుభావం కనబరిచేవారు. అందువల్ల వీరికి ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వకుండా బీజేపీ జాగ్రత్త పడింది. చంద్రబాబు నాయుడితో కోరి గొడవ పెట్టుకోవడమెందుకనే ఉద్దేశంతో వీరిని బాగా నియంత్రించింది. తెలుగుదేశానికి వ్యతిరేకంగా వీరెవరూ ఎటువంటి ప్రకటనలు చేయకుండా అనేక సందర్బాల్లో అదుపు చేసింది. రాష్ట్రబీజేపీ అధ్యక్షుడు హరిబాబుకు చంద్రబాబుతో సత్సంబంధాలే ఉండటము, వెంకయ్యనాయుడు హవా కారణంగా టీడీపీకి ఎదురులేకుండా పోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు వ్యతిరేకులు నోరు కుట్టుకుని కూర్చోవాల్సి వచ్చింది.

కొంప మునిగింది....

దశాబ్దాల అనుబంధం ఉన్న కాంగ్రెసుతో విభేదించి బయటికి రావడమంటే చిన్నవిషయం కాదు. వారి మాటకు కూడా విలువ పెరుగుతుంది. కానీ బీజేపీ దానిని ఎన్ క్యాష్ చేసుకోలేకపోయింది. టీడీపీ మైత్రికే పెద్దపీట వేసింది. చంద్రబాబుతో సంబంధాలు ఎక్కడ చెడిపోతాయోననే ఉద్దేశంతో అతి జాగ్రత్తకు పోయింది. అంతేకాకుండా ఈ అగ్రనాయకులందరూ కాంగ్రెసుకు చెందినవారు కావడంతో ఎప్పట్నుంచో బీజేపీనే నమ్ముకుని పనిచేస్తున్న వారిని డామినేట్ చేసేస్తారనే భయమూ వెన్నాడింది. చంద్రబాబు వ్యూహాత్మకంగా ఈ నాయకులకు బీజేపీలో ప్రాముఖ్యం దక్కకుండా చాణక్యం నెరిపారు. ఇందుకు బీజేపీ అగ్రనేత అయిన వెంకయ్య నాయుడు సహకరించారనేది అభియోగం. పురందేశ్వరి ఎంపీగా గెలిస్తే కేంద్రమంత్రి గా స్థానం లభిస్తుందనే అంచనాలు అప్పట్లో ఉండేవి. ఆమె నిజానికి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, బాపట్ల, ఒంగోలు వంటి స్థానాల్లో ఏదో ఒక సీటును ఆశించింది. కానీ రాయలసీమలో గెలవడం అసాద్యమని తెలిసి అక్కడి రాజంపేట స్థానాన్ని పొత్తులో బాగంగా చంద్రబాబు కేటాయించారు. ఆ రకంగా ఆమెకు చెక్ పెట్టారు. ఎన్టీరామారావు కుమార్తెగా ఆమెకున్న ఇమేజ్ ని దెబ్బతీయగలిగారు. జాతీయ స్థాయిలో బీజేపీ లో వెలుగొందకుండా నియంత్రించగలిగారు. కావూరి సాంబశివరావుకు అసలు సీటే దక్కలేదు. కనీసం కేంద్రంలో ఏదేని నామినేటెడ్ పదవి దక్కినా ఆయన చక్రం తిప్పగలిగి ఉండేవారు. దానికి కూడా దూరం పెట్టేశారు. ఆరుసార్లు ఎంపీగా , కేంద్రమంత్రిగా పనిచేసిన కావూరికి బీజేపీలో దక్కిన గౌరవం అది. కాపు సామాజిక వర్గం నుంచి బలమైన నాయకుడు కన్నా లక్మీనారాయణ. వంగవీటి మోహనరంగా తర్వాత కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అంతటి సామాజిక ప్రాధాన్యం సంతరించుకున్న వ్యక్తి. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆయనకు ఆ సామాజిక వర్గంలో పలుకుబడి ఉంది. ఆయనకు బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షపదవి ఇస్తారని తొలుత ప్రచారం సాగింది. పార్టీలోనూ పెద్దపదవి దక్కలేదు. సొంతంగా రాష్ట్రంలో పునర్మిర్మాణానికి అవసరమైన సత్తువ సమకూర్చే అవకాశం చేజేతులారా వదులుకుంది బీజేపీ. ఇలా తమ గూటిలోకి వచ్చిన ప్రముఖులకు సముచిత స్థానమిచ్చి సమర్థంగా వాడుకోవడంలో వైఫల్య ఫలితం ఇప్పుడు తెలిసొస్తోంది.

చేతులు కాలాక...

తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన సంక్షుభిత పరిస్థితులు బీజేపీని విలన్ నంబర్ వన్ గా మార్చేశాయి. పార్టీకి 2019 ఎన్నికల్లో ఎదురీత తప్పదు. పార్టీని బయటపడేసే నాయకుడు కనిపించడం లేదు. పార్టీలో చేరినవారికి కానీ, ఎప్పట్నుంచో పార్టీలో ఉన్నవారికి కానీ తగినంత ప్రాధాన్యం ఇవ్వకుండా తప్పుచేశామనే పశ్చాత్తాపం పార్టీలో వ్యక్తమవుతోంది. పార్లమెంటు పనిచేయనందుకునిరసనగా దీక్షలు చేయమని ప్రధాని పిలుపునిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. చాలాచోట్ల బీజేపీ నాయకులతో ఇతర పార్టీలు, ప్రజలు ఘర్షణ పడ్డారు. ఇది బీజేపీపై వ్యతిరేకతకు అద్దం పడుతోంది. ఏపీకి చెందిన రామ్ మాధవ్ వంటి వ్యూహకర్తకు బాధ్యతలు అప్పగించాలని భావించారు. కానీ అతను మూడు దశాబ్దాలుగా రాష్ట్రంలో లేరు. ఈశాన్య రాష్ట్రాలు , జమ్ముకశ్మీర్ వంటి చోట్ల సంఘ్ నిర్మాణాత్మక పనుల్లోనే మునిగితేలారు. పెద్దగా వర్కవుట్ అవ్వదని నిర్ణయానికొచ్చేశారు. సోము వీర్రాజు వాయిస్ గట్టిగానే వినిపించినప్పటికీ బలమైన క్యాడర్ ఉన్న నాయకుడు కాదు. మాజీ మంత్రి మాణిక్యాలరావు వంటివారికి పగ్గాలు అప్పగించాలనే యోచన పై కూడా సానుకూలత రావడం లేదు. మాణిక్యాలరావు కమిట్మెంట్ ఉన్న కార్యకర్తే. కానీ లోకల్ లీడర్ పరిధి నుంచి ఎదగలేదనేది పార్టీ అభిప్రాయం. కాంగ్రెసు నుంచి వచ్చిన ప్రముఖులు ఇప్పుడు పార్టీ బాధ్యతలు తీసుకునేందుకు జంకుతున్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావును కొంచెం ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు చూసుకో అంటూ బతిమాలి అప్పగించారు. కానీ ఆయన తెలుగులో వాదనాపటిమ కలిగిన వక్త కాదు. సర్వేలు చేయడంలో దిట్ట మాత్రమే. ఏతావాతా కష్టకాలంలో బీజేపీని ముందుండి నడిపే నాయకులు కరవు అవుతున్నారు. పాతవాళ్లే మళ్లీ పార్టీని పట్టాలపైకి ఎక్కించాలనే వాదనలు వినిపిస్తున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News