ఇలా అయితే కష్టమేగా మరి

వచ్చే ఎన్నికల్లోగా దక్షిణాదిన బీజేపీ తమ సత్తా చాటి చెప్పాలని వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది. కర్ణాటక లో అధికారాన్ని తిరిగి హస్తగతం చేసుకోవడం, తెలంగాణ లో నాలుగు [more]

Update: 2019-08-12 17:30 GMT

వచ్చే ఎన్నికల్లోగా దక్షిణాదిన బీజేపీ తమ సత్తా చాటి చెప్పాలని వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది. కర్ణాటక లో అధికారాన్ని తిరిగి హస్తగతం చేసుకోవడం, తెలంగాణ లో నాలుగు ఎంపి సీట్లు దక్కించుకోవడం, ఆంధ్రప్రదేశ్ లో టిడిపి బలహీనపడటం, కేరళలో కూడా గతం కన్నా పార్టీ కామ్రేడ్ లతో పోటీ పడటం ఇలా అనేక అంశాలు బీజేపీలో ఆశలు రేపుతున్నాయి. తమిళనాడులో తెరముందు సీన్ లేకపోయినా తెరవెనుక చేయాలిసినంతా చేయాలన్న వ్యూహంతో దూసుకుపోతున్నారు. అయితే అధిష్టానం వ్యూహాలన్నీ ఇతర పార్టీలనుంచి నేతలకు పార్టీ కండువా కప్పడం తప్ప ఆయా రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడంలో మాత్రం కాషాయ పార్టీ దృష్టి పెడుతున్నది శూన్యమన్నది చర్చనీయాంశం అవుతుంది. కేంద్రం నుంచి ఉదారంగా నిధులు ఇవ్వడంలో కానీ, అభివృద్ధి పనులు చేపట్టడంలో లేని స్పీడ్ మాత్రం రాజకీయాలు చేయడంలో చూపడం విమర్శలకు తెరతీస్తోంది.

ఏపీ వరదలే దర్పణం …

ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలు వరద తాకిడితో వణికిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని భద్రాచలం మండలం, దేవీపట్నం మండలాలు, కోనసీమ లంక ప్రాంతాల్లో వేలాదిమంది నిరాశ్రయులై పోయారు.ఇళ్ళు పొలాలు కోల్పోయి వీధిన పడ్డారు. రెండువారాలకు పైగా నీటిముంపులోనే కొట్టుమిట్టాడుతూ వున్నారు. వీరికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి సాయం మాట ఎలా వున్నా కనీస పరామర్శ లేకపోయింది. అయితే రాజకీయ అంశాల్లో మాత్రం ఎపి, తెలంగాణాలో యమజోరుగా తమ బీజేపీ కార్యకలాపాలు సాగించడం గమనార్హం. కమలంలో నేతలను చేర్చుకోవడం అగ్రనేతల పర్యటనలు చక్కగానే సాగుతున్నాయి.

కేరళలో చూస్తే …

కేరళ లో గత ఏడాది జలప్రళయం సంభవించింది. మరోసారి వరుణుడు పగబట్టడంతో అనేక వేలమంది నిరాశ్రయులయ్యారు. వారిని కేంద్రంలోని బీజేపీ నేతలు ఓదార్చింది లేదు. సాయం ప్రకటించింది లేదు. చివరికి ఆ రాష్ట్రం నుంచి పోటీ చేసిన పాపానికి రాహుల్ గాంధీ కేరళ వెళ్ళి వరద బాధితులను ఆదుకోండి అంటూ కేంద్రానికి విన్నవించుకోవాలిసి వచ్చింది. అయినప్పటికీ కేరళకు అరకొర సాయమే కేంద్రం నుంచి దక్కే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు విశ్లేషకులు. గతంలో కేరళ వరదలను ప్రధాని మోడీ విహంగ వీక్షణం చేసి సాయం ప్రకటించారు. రెండోసారి ప్రధాని అయ్యాక అదీ లేదు.

కర్ణాటకలో అయితే …

కర్ణాటకలో బిజెపి సర్కార్ అధికారంలోకి రావడం తో కేంద్రమంత్రులు అక్కడ రంగంలోకి దిగి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నిర్మల సీతారామన్ కొన్ని వరద ప్రాంతాలు పరిశీలించారు. హోం మంత్రి అమిత్ షా కన్నడ ముఖ్యమంత్రిని వెంటబెట్టుకుని విహంగ వీక్షణం చేసి బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు. ఇక రేపో మాపో ప్రధాని సైతం వరద ప్రాంతాలను సందర్శించే అవకాశాలు వున్నాయి.

పార్టీ అధికారంలో ఉంటేనే వస్తారా …?

బీజేపీ అధికారంలో వున్న రాష్ట్రాలకే మంత్రులు, నేతలు పరిశీలనకు వచ్చి సాయం ప్రకటిస్తారా ? ఇదే షోషల్ మీడియా లో నెటిజెన్స్ సంధిస్తున్న ప్రశ్నలు. ఇలా అయితే దక్షిణాదిన కమల వికాసం సాధ్యం ఎలా అవుతుందని కడిగేస్తున్నారు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలా బీజేపీ సర్కార్ అనుసరించడాన్ని తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా కమలనాధులు కళ్ళు తెరిచి ముంపు ప్రాంతాలను పరిశీలించి సాయం అందించాలని కోరుతున్నారు. గతంలో ఎపికి వచ్చిన తుఫాన్లు వచ్చిన సమయంలో సైతం కేంద్రం ఇలా సవతి తల్లి ప్రేమే చుపిందన్నది రాష్ట్రవాసుల అభియోగంగా వుంది.

కేంద్రం అందరికి కేంద్రమే గా …

గోదావరి జిల్లాల్లో అవసరమైన చోట్ల వారధులు నిర్మిస్తే ప్రకృతి వైపరీత్యాల సమయంలో కనీసం ప్రాణాలు కాపాడుకుంటారని కేంద్రం దేశవ్యాప్తంగా వరద తాకిడి ఎదుర్కొనే అన్ని ప్రాంతాలపై శాశ్వతంగా ప్రజల ప్రాణాలను కాపాడే కార్యాచరణ తీసుకుని జనం గుండెల్లో నిలవాలని సూచిస్తున్నారు. వరద సమయాల్లో ఇప్పటికి నాటుపడవలనే ఆశ్రయిస్తున్నారని స్వతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా బ్రిటిషర్లు నిర్మించిన అరకొర వంతెనలే నేటికీ జనజీవన రవాణకు ఇప్పటికి వినియోగిస్తున్నారంటే కేంద్ర పాలకులు సిగ్గుపడాలని విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయాలు అభివృద్ధిలో చేసి పక్షపాతం లేని పాలన అందించాలని జనం కోరుతున్నారు. మరి ఇవి బీజేపీ నేతల చెవికి ఎక్కుతాయో లేదో.

Tags:    

Similar News