ఇక సింగిల్ గానే…. సోలోగా వెళ్లడమే బెటర్

చిన్న చిన్న రాష్ట్రాల్లో తప్ప ఎక్కడా పొత్తుతో బరిలోకి దిగకూడదని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. అన్ని రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీ చేయాలన్న లక్ష్యంతో పనిచేయాలని బీజేపీ [more]

Update: 2020-09-15 18:29 GMT

చిన్న చిన్న రాష్ట్రాల్లో తప్ప ఎక్కడా పొత్తుతో బరిలోకి దిగకూడదని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. అన్ని రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీ చేయాలన్న లక్ష్యంతో పనిచేయాలని బీజేపీ కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వాలకు స్పష్టమైన సూచనలు చేసింది. కొన్నింటికి మాత్రమే మినహాయింపులుంటాయని, అన్ని రాష్ట్రాల్లో సొంతంగా ఎదిగేందుకే శ్రమించాలని పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు అందాయి.

పొత్తులతో వెళితే…..

పొత్తులతో వెళ్లిన కారణంగా ఆ పార్టీలకు తలొగ్గాల్సి ఉంటుందన్న అభిప్రాయం ఉంది. అలాగే మోదీ ఇమేజ్ ఉండటంతో ఈ సమయంలోనే పార్టీని రాష్ట్రాల్లో బలోపేతం చేసుకోవాలని కేంద్ర నాయకత్వం అభిప్రాయపడుతుంది. ప్రస్తుతం బీజేపీలో మోదీ, షా తప్ప మరో నాయకుడు లేరు. పేరుకు నేతలు ఉన్నప్పటికీ వారి జోక్యం పార్టీ వ్యవహారాల్లో అంతంత మాత్రమే. సీనియర్ నేతల అభిప్రాయాలను వివిధ రాష్ట్రాల ఎన్నికల సమయంలో కూడా తీసుకోరన్నది వాస్తవం. దేశమంతా మోడీ, షా ల పేర్లే విన్పించాలి.

వారి డిమాండ్లకు….

మహారాష‌్ట్రలో శివసేనతో దశాబ్దాలుగా ఉన్న అనుబంధాన్ని తెంచుకోవాల్సి వచ్చింది. పొత్తు కారణంగానే శివసేన డిమాండ్లు పెట్టిందన్న అభిప్రాయం ఉంది. అందుకే ఎన్నికల ముందు పొత్తు కన్నా, ఎన్నికల అనంతరం అలయన్స్ గా ఏర్పడితే బెటరన్న ఒపీనియన్ కు వచ్చింది. అయితే ఈ నిబంధన నుంచి దక్షిణాది రాష్ట్రాలకు మినహాయింపు ఇచ్చిందంటున్నారు. బీజేపీ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకోవచ్చన్న సిగ్నల్స్ పంపింది.

కొన్ని రాష్ట్రాలకు మినహాయింపు…..

వచ్చే 2024 నాటికి దాదాపు అన్ని రాష్ట్రాల్లో సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నించాలని బీజేపీ కేంద్ర నాయకత్వం సూచిస్తుంది. స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామని, అందుకు తగిన కార్యాచరణను రూపొందించుకోవాలని చెబుతున్నారు. ఇందుకు కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలను ఉదాహరణగా చూపుతున్నారు. పొత్తు ఉన్న రాష్ట్రాల్లోనూ బీజేపీ అధిక స్థానాలను సాధించుకుని విజయం సాధించేలా ప్రయత్నం చేయాలని కేంద్ర నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. త్వరలో జరగనున్న తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలను దృ‌ష్టిలో పెట్టుకునే ఈ కామెంట్స్ చేసినట్లు కనపడుతోంది. మొత్తం మీద దేశ వ్యాప్తంగా సొంతంగానే అన్ని రాష్ట్రాల్లో బలపడాలన్న ఐదేళ్ల లక్ష్యాన్ని కేంద్రనాయకత్వం రాష్ట్ర నేతల ముందుంచింది.

Tags:    

Similar News