బియ్యపు మధు స‌రికొత్త రాజ‌కీయం.. వైసీపీలో క‌ల‌క‌లం

ఆయ‌న కొత్త ఎమ్మెల్యే. రాజ‌కీయాల్లోకి వ‌చ్చి కూడా మ‌హా అయితే.. ఓ ప‌దేళ్లకు మించ‌దు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీ లోను, చంద్రబాబు వ్యతిరేక‌త‌లోను కొట్టుకు [more]

Update: 2020-05-12 02:00 GMT

ఆయ‌న కొత్త ఎమ్మెల్యే. రాజ‌కీయాల్లోకి వ‌చ్చి కూడా మ‌హా అయితే.. ఓ ప‌దేళ్లకు మించ‌దు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీ లోను, చంద్రబాబు వ్యతిరేక‌త‌లోను కొట్టుకు వ‌చ్చిన నేత‌. అయితే, ఇప్పుడు అలాంటి నాయ‌కుడు రాజ‌కీయ ఉద్ధండుడు, ప్రస్తుతం వైసీపీలోని సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కుల్లో ఒక‌రుగా ఉన్న మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ‌పై విరుచుకుప‌డ‌డం.. ఈ వ్యాఖ్యలు తీవ్ర క‌ల‌క‌లం సృష్టించ‌డం, మంత్రిగారి పేరు ఎత్తకుండానే ఏకంగా శాఖ‌నే ప్రక్షాళ‌న చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్యలు చేయ‌డం వంటివి చూస్తే.. అస‌లు ఏం జ‌రుగుతోంది వైసీపీలో?! అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

బొత్సపై పరోక్ష వ్యాఖ్యలు…

చిత్తూరు జిల్లా శ్రీకాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ త‌ర‌ఫున ఒక‌సారి ఓడి.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన బియ్యపు మ‌దుసూద‌న‌రెడ్డి.. తాజాగా బొత్సను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఆయ‌న చేసిన వ్యాఖ్యల‌ను ప‌రిశీలిస్తే.. ఒక జూనియ‌ర్ ‌(బొత్సతో పోలిస్తే.. అంతే క‌దా) బొత్స వంటి సీనియ‌ర్ మోస్ట్‌ను టార్గెట్ చేయ‌డం, ఆయ‌న శాఖ‌ను వేలెత్తి చూపించి, చ‌డా మ‌డా క‌డిగేయ‌డం వంటివి చూస్తే.. దీని వెనుక ఏదో ఉంద‌నే వ్యాఖ్యలు వైసీపీలోనే చ‌ర్చకు వ‌స్తున్నాయి. నిజానికి బియ్యపు మ‌దుసూద‌న‌రెడ్డి రాజ‌కీయ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. బొత్స వంటి కీల‌క నేత‌ను టార్గెట్ చేసే స‌త్తా కానీ, స్థాయి కానీ, ఆయ‌న‌కు లేవు.

ఆయన వెనక ఉన్నారా?

అయితే, తాజాగా బియ్యపు మ‌దుసూద‌న‌రెడ్డి మాత్రం త‌న నియోజ‌క‌వ‌ర్గంలో త‌లెత్తిన స‌మ‌స్యను చూపిస్తూ.. ఇలా బొత్సపై కారాలు మిరియాలు నూర‌డం అంటే.. ఖ‌చ్చితంగా దీనివెనుక ఎవ‌రో పెద్దత‌ల‌కాయే ఉన్నార‌నేది వాస్తవం అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి అంత‌గా.. బొత్స అంటే.. ప‌డ‌ని నాయ‌కుడు వైసీపీలో ఉన్నారా? బొత్సను టార్గెట్ చేయ‌డం వ‌ల్ల వారికి ప్రయోజ‌నం ఏంటి? అలాంటి నాయ‌కులు.. నేరుగా బొత్సను ఏమీ అన‌లేక‌.. ఇలా బియ్యపు మ‌దుసూద‌న‌రెడ్డి వంటి జూనియ‌ర్‌తో అనిపించారా ? అంటే.. కొంద‌రు నాయ‌కులు ఔన‌నే అంటున్నారు. ఇప్పడు ఈ వ్యాఖ్య‌లు వైసీపీ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారాయి. చిత్తూరు జిల్లాకే చెందిన ఒక నేత జ‌గ‌న్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఆయ‌న అన్నీ తానై వ్యవ‌హరి స్తున్నారు. ఈ క్రమంలో కొన్నాళ్లుగా బొత్స స‌హా చాలా మంది మంత్రుల‌తో ఆయ‌న విభేదిస్తున్నారు.

తాను అనలేకనేనా?

అయితే, స‌ద‌రు మంత్రిగారు జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడు కావ‌డంతో మిగిలిన మంత్రులు మౌనం పాటిస్తున్నారు. ఆయ‌న‌ను ఏమీ అన‌లేక పోతున్నారు. అయితే, అంతా తానే అయి.. వ్యవ‌హ‌రిస్తున్న స‌ద‌రు మంత్రి ఇటీవ‌ల కాలంలో ప‌లు విష‌యాల్లో వేలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే బొత్సను టార్గెట్ చేశార‌ని, అందుకే తాను ఏమీ అన‌లేక‌.. త‌నకు అత్యంత స‌న్నిహితంగా ఉండే .. బియ్యపు మ‌దుసూద‌న‌రెడ్డిని వాడుకున్నార‌ని ప్రచారం సాగుతోంది. మ‌రి ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే.. వైసీపీలో మ‌రెంత మంది టార్గెట్ అవుతారో చూడాలి. ఏదేమైనా ఇలాంటి ప‌రిణామాల‌ను ముందుగానే ప‌రిష్కరించాల‌ని జ‌గ‌న్‌కు సూచిస్తున్నారు.

Tags:    

Similar News