ఏరికోరి తెచ్చినట్లున్నారే

ఏపీకి కొత్త గవర్నర్ వచ్చారు. ఆయన పేరు బిశ్వభూషణ్ హరిచందన్. ఆయన కరడు కట్టిన బీజేపీ కార్యకర్త. పార్టీ కోసం ఏదైనా చేసే నాయకుడని పేరు. బీజేపీ [more]

Update: 2019-07-17 06:30 GMT

ఏపీకి కొత్త గవర్నర్ వచ్చారు. ఆయన పేరు బిశ్వభూషణ్ హరిచందన్. ఆయన కరడు కట్టిన బీజేపీ కార్యకర్త. పార్టీ కోసం ఏదైనా చేసే నాయకుడని పేరు. బీజేపీ పూర్వ రంగం జనసంఘ్ నుంచి ఆయన పార్టీలో కొనసాగుతున్నారు. అయిదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా కూడా పనిచేసిన బిశ్వభూషణ్ హరిచందన్ ఏపీ పొరుగున ఉన్న ఒడిషా రాష్ట్రానికి చెందిన వారు. ఆయన్ని ఏరి కోరి బీజేపీ ఏపీకి నియమించడం వెనక వ్యూహాలేంటన్నదే ఇపుడు అందరి ఆలోచనగా ఉంది. కరడు కట్టిన బీజేపీ నేతలు గవర్నర్లుగా ఉన్న చోట్ల వారు ఎపుడూ పార్టీకే విధేయులుగా ఉంటారు. కర్నాటకలో ఉన్న గవర్నర్ వజూబాయి కూడా ఆరెసెస్, బీజేపీ కార్యకర్త. ఆయన గత ఏడాది మెజారిటీ లేకపోయినా యడ్యూరప్పను ఆహ్వానించి ఎంతలా కధ నడిపారో లోకమంతా చూసింది. ఇక చాలా మంది బీజేపీ నాయకులను గవర్నర్లుగా నియమించి బీజేపీ కూడా కాంగ్రెస్ బాటనే నడుస్తోంది. దీని వల్ల రాజకీయ లాభాలను కూడా ఆ పార్టీ బాగానే పొందుతోంది.

అయిదేళ్ల తరువాత…..

నిజానికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ పదవీకాలం ఎపుడో పూర్తి అయింది. ఆయన వద్దు అంటూ అప్పట్లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మిత్ర పార్టీగా ఉన్న బీజేపీని కోరుకున్నారు. అప్పటి ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు ద్వారా కేంద్రానికి లేఖలు కూడా రాయించారు. అయినా అయన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇపుడు బాబు మాజీ అయిపోయారు. జగన్ సీఎం గా ఉన్నారు. ఈ నేపధ్యంలో హఠాత్తుగా కొత్త గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నియామకం వెనక ఆంతర్యం ఏంటన్నది ఆసక్తిగా మారింది. గవర్నర్ పాత్ర మామూలుగా అయితే నామమాత్రమైనా, కొత్త ప్రభుత్వాలని పిలిచినపుడు, సంఖ్యా బలం తక్కువగా ఉన్న సందర్బాల్లో కీలకంగా ఉంటుంది. ఇక ఏపీలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు కానీ, రేపటి రాజకీయాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ నియామకం జరిగిందని అంతా భావిస్తున్నారు. ఏపీ బీజేపీకి ఓ విధంగా రాజ్ భవన్ ఇపుడు అండగా ఉంటుందని చెప్పుకోవచ్చు.

కట్టడి చేయడానికేనా…?

బాబును నాలుగేళ్ళు భరించిన బీజేపీ జగన్ ను మాత్రం రెండు నెలలు కూడా మోయలేనంటోంది. కేంద్రంతో జగన్ కి పని ఉంది కానీ జగన్ తో మాకు అవసరం ఏంటన్నది బీజేపీ విధానంగా కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో పూర్తిగా కరడు కట్టిన బీజేపీ నేత బిశ్వభూషణ్ హరిచందన్ ను రాజ్ భవన్లో కూర్చోబెట్టడం అంటే కేంద్రం దూత పక్కనే ఉన్నట్లుగా భావించాలి. ఓ విధంగా మోడీ పరోక్ష పర్యవేక్షణలో ఏపీ పాలన సాగబోతోందని కూడా అనుకోవాలి. జగన్ కి రాజకీయంగా అనుభవం తక్కువ. ఆయన సైతం అలవి కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చారు, ప్రత్యేక హోదాపై ఆయన కేంద్రాన్ని నిలదీస్తున్నారు. విభజన హామీలపైనా పట్టుపడుతున్నారు. ఈ నేపధ్యంలో కేంద్రం చేస్తాం, చూస్తాం అంటూనే ఓ ఏడాది గడిపేస్తే అపుడు అసలైన కష్టాలు జగన్ కి మొదలవుతాయి. బడ్జెట్లో హామీలు తీర్చకపోతే జనంలో వ్యతిరేకత వస్తుంది. అలా అక్కడ నుంచి రాజకీయంగా పావులు కదపాలన్నది బీజేపీ ఎత్తుగడగా భావిస్తున్నారు. అందుకే తమవాడు అయిన మనిషిని రాజ్ భవన్లో ముందే రెడీ చేసి పెట్టుకున్నారని అంటున్నారు.

Tags:    

Similar News