ఎప్పుడైనా…ఏమైనా… జరగొచ్చు…!!

బీహార్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మిత్రపక్షాన్ని ఇబ్బంది పెట్టేలా ఒకరు, మచ్చిక చేసుకునేందుకు మరొకరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో [more]

Update: 2019-06-03 17:30 GMT

బీహార్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మిత్రపక్షాన్ని ఇబ్బంది పెట్టేలా ఒకరు, మచ్చిక చేసుకునేందుకు మరొకరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ యు కూటమి ఘన విజయం సాధించింది. లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ ఒక్క స్థానమూ గెలుచుకోలేకపోయింది. లాలూ కూతురు మీసా భారతి సయితం ఓటమిపాలయ్యారు. బీహార్ లో కాంగ్రెస్ తో కలసి ఆర్జేడీ కూటమి ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

గ్యాప్ పెరిగిందా?

అయితే లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ కూటమిలోనూ కొంత తేడా వస్తున్నట్లు కన్పిస్తుంది. కేంద్ర మంత్రి వర్గంలో జేడీయూకు చోటు కల్పించాలని ఆ పార్టీ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కోరారు. అయితే ఒక్క మంత్రి పదవిని మాత్రమే ఇస్తామని కమలనాధులు చెప్పడంతో కేంద్రమంత్రి వర్గంలో నితీష్ పార్టీ సభ్యులు చేరలేదు. ఆయన ఒక్క మంత్రి పదవిని తమకు ఇస్తామన్న దానిపై గుర్రుగా ఉన్నారు.

విస్తరణలో పక్కన పెట్టి….

దీంతో ఆయన బీహార్ లో మంత్రివర్గ విస్తరణ చేశారు. ఎనిమిది మంది జేడీయూ నేతలకు కేబినెట్ లో చోటు కల్పించారు. ప్రభుత్వంలో ఉన్న బీజేపీకి ఒక్క మంత్రి పదవి ఇస్తామని నితీష్ చెప్పారు. అందుకు బీజేపీ అంగీకరించకపోవడంతో నితీష్ కేవలం తన పార్టీ సభ్యులనే మంత్రివర్గంలో చేర్చుకున్నారు. కేంద్రమంత్రివర్గంలో తమకు అవమానం జరగడంతో నితీష్ బీజేపీకి తాను ఏంటో చూపించారని జేడీయూ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. వీరి మైత్రికి ఇప్పట్లో ఎలాంటి ఇబ్బంది లేకున్నా రానున్న అసెంబ్లీ సమయానికి సమీకరణాలు మారే అవకాశముందన్నది విశ్లేషకుల అంచనా.

మంచి చేసుకునే యత్నంలో…..

ఇక బీహార్ మాజీ ముఖ్యమంత్రి, లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీదేవి జేడీయూ, బీజేపీల మధ్య అంతర్గత వార్ ను తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేశారు. బీజేపీకి దగ్గరగా చేరేందుకు రబ్రీదేవి ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. రబ్రీదేవి ఇచ్చిన ఇఫ్తార్ విందుకు బీజేపీ నేతలను ఆహ్వానించడమే ఇందుకు బలం చేకూరుస్తుంది. గతంలో ఎన్నడూ లాలూ యాదవ్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు బీజేపీ నేతలను ఆహ్వానించలేదు. తన భర్త లాలూ యాదవ్ వివిధ కేసుల్లో జైల్లో మగ్గుతుండటం, మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో రబ్రీదేవి కమలనాధులను మంచి చేసుకునే ప్రయత్నంలో పడ్డారని తెలుస్తోంది. మొత్తం మీద బీహార్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏమైనా జరగొచ్చన్నది పరిశీలకుల భావన.

Tags:    

Similar News