వీరిద్దరికీ బిగ్ రిలీఫ్

బీజేపీ దూకుడు ఎంత చేస్తున్నా కూడా కలసిరాని చోట చతికిలపడుతూనే ఉంది. అది నిన్న కర్నాటకలో జరిగింది నేడు మహారాష్ట్రలో జరిగింది. ఇంకా నాలుగున్నరేళ్ళ సమయం ఉంది [more]

Update: 2019-11-26 12:30 GMT

బీజేపీ దూకుడు ఎంత చేస్తున్నా కూడా కలసిరాని చోట చతికిలపడుతూనే ఉంది. అది నిన్న కర్నాటకలో జరిగింది నేడు మహారాష్ట్రలో జరిగింది. ఇంకా నాలుగున్నరేళ్ళ సమయం ఉంది ఈ లోగా విపక్షానికి ఊపిరి తీసుకునే అవకాశం బాగానే ఉంటుంది. ఏది ఎలాగున్నా కూడా మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చగా ఉన్నాయి. ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ చేసిన ప్రయత్నం విఫలం కావడం ఓ విధంగా తెలుగు ముఖ్యమంత్రులు జగన్ కి, కేసీయార్ కి బిగ్ రిలీఫ్ గా చెప్పుకోవాలి. అక్కడే కనుక సక్సెస్ అయి ఉంటే మాత్రం తరువాత త్రివిక్రముని అవతారం ఎత్త్తి మూడవ కాలు ఈ ఇద్దరి నెత్తి మీదనే బీజేపీ పెట్టేసేది. బలం లేని చోట ఎంతలా వ్యూహాలు రచించినా కుదరదు అని మహా రాజకీయం రుజువు చేసింది. ఇది కాషాయానికి కషాయం తాగించేసిందంటున్నారు. ఇపుడదే తెలుగు రాజకీయాలకు బిగ్ రిలీఫ్ గా చెబుతున్నారు.

కామ్రేడ్ ఎర్ర హెచ్చరిక….

మహారాష్ట్ర పరిణామాలపై తనదైన శైలిలో విరుచుకుపడిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అక్కడ కనుక బీజేపీ విజయవంతం అయితే రేపటి రోజున కేసీఆర్, జగన్ లను సైతం వదిలిపెట్టదని రెడ్ వార్నింగ్ తాజాగా చేశారు. దాంతో తెలుగు రాజకీయలు సైతం మహారాష్ట్ర ఎపిసోడ్ ని నిశితంగా గమనించాల్సివచ్చింది. ఇపుడు అక్కడ బీజేపీ ఫెయిల్యూర్ తో బాగా వెనక్కి తగ్గుతుందని అంతా అంటున్నారు. ఇక ఏపీలో చూసుకుంటే ఆపరెషన్ కమల పేరిట బీజేపీలోకి చాలామందిని చేర్పించాలని కూడా ఎత్తుగడలు వేస్తోంది. ఏపీలో టీడీపీ, వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు తమ వైపు చూస్తున్నారని కమలనాధులు ఇంతవరకూ చెప్పుకొచ్చారు. అదే విధంగా వైసీపీ ఎంపీలు బీజేపీ నేతలకు టచ్ లో ఉన్నారని కూడా సుజనా చౌదరి లాంటి వారు పెద్ద బాంబులే పేల్చారు.

కమలం వైపు చూస్తారా..?

నిజానికి గుప్పెట మూసినపుడే దేనికైనా విలువ. బీజేపీ బలం క్రమంగా తగ్గుతోందని మహారాష్ట్ర, హర్యానా ఫలితాలు తాజాగా నిరూపించాయి. ఇక శివసేన వంటి ప్రాంతీయ పార్టీలు సైతం బీజేపీకి దూరంగా జరిగాయి. తాజాగా అక్కడ సర్కార్ ఏర్పాటు చేయలేక కాషాయపార్టీ పూర్తిగా చతికిలపడింది. దీంతో ఈ నేపధ్యంలో ఏపీలో బీజేపీ విస్తరణ అన్నది ఎంతవరకూ విజయం సాధిస్తుందన్నది కూడా పెద్ద ప్రశ్నగా ఉంది. ఎంత గోడ దూకుడు బాపతు అయినా క్షేమంగా ఉండే ప్రదేశంలోనే దూకాలనుకుంటాడు. ఉత్తరాదిన బలం తగ్గుతున్న బీజేపీకి ఏపీలో అసలు పునాదుల్లో సైతం పట్టు లేదన్న సంగతి మిగిలిన పార్టీ వారికీ తెలియని విషయం కాదు.

మోజు తీరేనా…?

అయితే కేంద్రంలో అధికారం చూపించి చేర్చుకోవాలనుకున్నా ఇపుడు ఆ మోజు కూడా తీరిపోయేలా కనిపిస్తోంది. ఓ విధంగా ఇపుడు ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలకు కూడా బీజేపీతో రాజకీయ సమీకరణల విషయంలో పునరాలొచించుకోవాల్సిన సమయం వచ్చేసింది. అధికార వైసీపీ సైతం దూకుడుగా ముందుకు వ‌చ్చి ప్రత్యేక హోదాతో పాటు, విభజన హామీల గురించి నిగ్గదీస్తే జనంలో కూడా ఆ పార్టీకి గట్టి మద్దతు లభిస్తుంది. అదే విధంగా కమలంతో చెలిమి కోసం అంగలారుస్తున్న టీడీపీ, జనసేన వంటి పార్టీలు తమ సొంత రాజకీయాలకు పదును పెడితే రాష్ట్రం బాగుపడుతుంది. వారి రాజకీయం కూడా గాడిలో పడుతుంది.

Tags:    

Similar News