బీదకు ఏమైంది… అందుకే బయటకు రానంటున్నారా?

బీద మ‌స్తాన్‌రావు. బీఎంఆర్ సంస్థల అధినేత‌. సుదీర్ఘకాలం టీడీపీలో రాజ‌కీయాలు చేశారు. 2009 ఎన్నిక‌ల్లో కావ‌లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న 2014 ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. పార్టీ [more]

Update: 2020-09-02 00:30 GMT

బీద మ‌స్తాన్‌రావు. బీఎంఆర్ సంస్థల అధినేత‌. సుదీర్ఘకాలం టీడీపీలో రాజ‌కీయాలు చేశారు. 2009 ఎన్నిక‌ల్లో కావ‌లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న 2014 ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. పార్టీ ఓడిన‌ప్పుడు ఆయ‌న గెలిస్తే.. పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు ఓడిపోవ‌డంతో రాజ‌కీయంగా వెన‌క‌ప‌డిపోయారు. నెల్లూరు ఎంపీ స్థానం నుంచి గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌య్యారు. వాస్తవానికి ఈ సీటు ఆదాల ప్రభాక‌ర్‌రెడ్డికి క‌న్ఫర్మ్ చేసిన త‌ర్వాత ఆయ‌న వైఎస్సార్ సీపీలోకి చేరిపోయారు. ఈ నేప‌థ్యంలో బీద మ‌స్తాన్‌రావుకు చంద్రబాబు ఛాన్స్ ఇచ్చారు. అయితే ఆయ‌న ఓడిపోయిన త‌ర్వాత పార్టీకి దూర‌మ‌య్యారు. ఈ క్రమంలోనే కొన్నాళ్లకు జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైఎస్సార్ సీపీలోకి చేరిపోయారు. ప్రజా సేవకోస‌మే అధికార పార్టీలోకి చేరాన‌ని చెప్పుకొన్నారు.

రాజ్యసభ స్థానం దక్కుతుందని……

బీసీల్లో బ‌ల‌మైన యాద‌వ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత కావ‌డంతో బీద మ‌స్తాన్‌రావును పార్టీలోకి తీసుకువ‌చ్చేందుకు నెల్లూరు జిల్లాకే చెందిన రాజ్యస‌భ స‌భ్యులు వేమిరెడ్డి ప్రభాక‌ర్‌రెడ్డి, విజ‌య‌సాయి రెడ్డి ఇద్దరూ కూడా చ‌క్రం తిప్పారు. ఇక పార్టీ మారిన‌ప్పటి నుంచి ఇప్పటి వ‌ర‌కు కూడా బీద మ‌స్తాన్‌రావు మ‌ళ్లీ ఎక్కడా క‌నిపించ‌లేదు. నిజానికి కొన్నాళ్ల కింద‌ట రాజ్యస‌భ ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు త‌న‌కు ఒక టికెట్ ఇవ్వాల‌ని బీద మ‌స్తాన్‌రావు జ‌గ‌న్‌ను కోరిన‌ట్టు వార్తలు వ‌చ్చాయి. నిజానికి ఆయ‌న పార్టీలో చేరేప్పుడు కూడా రాజ్యస‌భ టికెట్ హామీ పొందార‌నే వార్తలు వ‌చ్చాయి. అయితే, ఆ త‌ర్వాత ఏమైందో ఏమో.. రాజ్యస‌భ టికెట్ల పంపిణీలో బీద‌కు చోటు ద‌క్కలేదు.

వ్యాపారాల కోసమేనా?

ఇక‌, అప్పటి నుంచి బీద మ‌స్తాన్‌రావు పార్టీలోనూ క‌నిపించ‌డం లేదు. పైగా నియోజ‌క‌వ‌ర్గంలోనూ క‌నిపించ‌డం లేదు. ఆయ‌న సోద‌రుడు మాత్రం బీద ర‌విచంద్ర యాద‌వ్‌.. మాత్రం టీడీపీలోనే కొన‌సాగుతున్నారు. త‌న వ్యాపారాలు, వ్యవ‌హారాల‌పైనే ఎక్కువ‌గా దృష్టి పెట్టే.. బీద మ‌స్తాన్‌రావు కేవ‌లం త‌న వ్యాపారాల కోస‌మే పార్టీ మారార‌నే ప్రచారం ఉంది అయితే, దీనిని ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. స‌రే! రాజ్యస‌భ టికెట్ రానంత మాత్రాన ఆయ‌న పార్టీకి దూరంగా ఎందుకు ఉన్నార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్ సీపీ నేత‌ల‌తో ఆయ‌న క‌లివిడిగా కూడా ఉండ‌లేక పోతున్నారు. పైగా నెల్లూరు వైసీపీలో ఉద్దండులు అయిన రాజ‌కీయ నేత‌లు ఉన్నారు. వీరి ముందు బీద మ‌స్తాన్‌రావు వెల‌గ‌క‌లేక‌పోతున్నార‌ట‌.

తమ్ముడు టీడీపీలో…..

ఇక బీద మ‌స్తాన్‌రావు సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన కావ‌లిలో రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి స్ట్రాంగ్‌గా ఉన్నారు. చివ‌ర‌కు సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఆయ‌న మాట చెల్లుబాటు అయ్యే ప‌రిస్థితి లేదు. ఇక ఆది నుంచి కూడా అటు టీడీపీలోనూ త‌న రాజ‌కీయాలు తాను చేసుకోవ‌డ‌మే త‌ప్ప..ఎవ‌రితోనూ క‌లిసేవారు కార‌న్న టాక్‌ బీద మ‌స్తాన్‌రావుపై ఉంది. ఇప్పుడు అధికార పార్టీలోనూ ఇదే త‌ర‌హా వ్యాఖ్యలు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. బీద‌ ఎప్పటికి ప్రజ‌ల మ‌ధ్యకు వ‌స్తారో వెయిట్ చేయాల్సిన ప‌రిస్థితి ఉంటే… అదే టైంలో అన్న వైసీపీలో ఉంటే త‌మ్ముడు ర‌విచంద్ర టీడీపీలో ఉండ‌డం కూడా బీద మ‌స్తాన్‌రావును అధికార పార్టీ వాళ్లు పూర్తిగా న‌మ్మక‌పోవ‌డానికి మ‌రో కార‌ణ‌మ‌ని టాక్‌..? ఇదే ప‌రిస్థితి ఉంటే వైసీపీ ఆట‌లో బీద మ‌స్తాన్‌రావు అర‌టిపండుగా మారితే పెద్ద ఆశ్చర్య ప‌డాల్సిన ప‌నిలేదంటున్నారు.

Tags:    

Similar News