స్ట్రీట్ ఫైటర్... సీఎం ఎలా అయ్యారంటే....??

Update: 2018-12-24 16:30 GMT

భూపేశ్ భఘేల్.... ఈ పేరు వింటేనే ఛత్తీస్ ఘడ్ భారతీయ జనతా పార్టీ వెన్నులో వణుకు పుడుతుంది. నిన్న మొన్నటి దాకా పీసీసీ అధ్యక్షుడిగా ఆయన ప్రభుత్వానికి పెద్ద సవాల్ గా నిలిచారు. ఈటెల్లాంటి మాటలతో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేవారు. నిర్దిష్టమైన ఆరోపణలతో ప్రభుత్వాన్ని నిలదీసేవారు. ఆయన విమర్శలు, సవాళ్లు, ఆరోపణలకు సమాధానం చెప్పలేక రమణ్ సింగ్ సర్కార్ అప్పట్లో నీళ్లు నమిలేది. దీటుగా సమాధానం చెప్పలేక బేలగా చూసేది. బిక్కమొహం వేసేది. చివరకు ఆత్మరక్షణలో పడి ఏమిచేయాలో అర్థంకాక తలపట్టుకుని కూర్చునేది.

నిబద్ధత..పోరాట పటిమ.....

పార్టీ పట్ల నిబద్ధత, ఈ పోరాటపటిమే బఘేల్ ను అత్యున్నత పదవిని అందుకునేలా చేశాయి. పార్టీలో దిగ్గజాలైన చరణ‌ దాస్ మహంత, సింగ్ దేవ్ వంటి ఉద్దండులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి వరమాల ఆయన మెడలోనే పడింది. బీజేపీ పట్ల సింహస్వప్నంలా వ్యవహరించి చివరకు సీఎం పీఠం ఎక్కారు. రాష్ట్రంలో దాదాపు పదిహేనేళ్ల పాటు బీజేపీ పాలనకు చరమగీతం పాడటంలో కీలక పాత్ర పోషించారు. బఘేల్ జీవితం వడ్డించిన విస్తరేమీ కాదు. ఆటుపోట్ల మయం. రాజకీయ చరిత్రలో అనేక ఎత్తుపల్లాలను దగ్గరగా చూశారు. అయినా ఏనాడూ ధైర్యాన్ని వీడలేదు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా పోడారే తప్ప ఏనాడూ తలవంచలేదు. అదే ఆయన ప్రత్యేకత.

సామాజికవర్గమే.....

ఉమ్మడి మధ్యప్రదేశ్ లోని దుర్గ్ జిల్లాలో 1961 ఆగస్టు 23న జన్మించారు బఘేల్. ఎనిమిదో దశకం ప్రారంభంలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1994-95 మధ్యకాలంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్వవహరించారు. క్రమంగా రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్య నేతగా ఎదిగారు. 1993 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి విజయం సాధించారు. అజిత్ జోగి, దిగ్విజయ్ సింగ్ మంత్రివర్గంలో పనిచేశారు. కుర్మి సామాజిక వర్గానికి చెందిన బఘేల్ కు ఆ సామాజికవర్గంలో మంచి పలుకుబడి ఉంది. 52 శాతం గల కుర్మి సామాజిక వర్గం రాష్ట్రంలో రాజకీయంగా బలమైనదనడంలో సందేహం లేదు. 1993తో పాటు 1998, 2003లలో కూడా అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2008 లో బీజేపీ చేతిలో ఓటమి పాలయ్యారు. 2009 లో రాయ్ పూర్ నుంచి లోక్ సభకు పోటీ చేసి బీజేపీ చేతిలో ఓడిపోయారు. 2013, 2018 ఎన్నికల్లో పఠాన్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మొదటి నుంచి ఆయన ఇక్కడి నుంచే పోటీచేస్తున్నారు.

మలుపు అక్కడి నుంచే....

2014 బఘేల్ జీవితంలో మలుపులాంటిది. అదే ఏడాది అక్టోబరులో రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు అందుకున్నారు. వరుస పరాజయాలతో అప్పుడు పార్టీ నిస్తేజంగా ఉంది. శ్రేణులు, నాయకులు వైరాగ్యంలో మునిగి ఉన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. దీనికి తోడు సీనియర్ నాయకుల మధ్య ముఠా తగాదాలు ఉండేవి. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా ఉండేది. దీనికి తోడు 2013లో మావోయిస్టుల నరమేధంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు హతమయ్యారు. వారిలో పీసీసీ చీఫ్ నంద్ కుమార్ పటేల్, సీఎల్పీ నాయకుడు మహేంద్ర కర్మ మరో 27 మంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ పగ్గాలు అందుకోవడానికి ఎంతో ధైర్యం, గుండెనిబ్బరం కావాలి. అయినప్పటికీ గత అయిదేళ్లుగా రమణ్ సింగ్ సర్కార్ పై అలుపెరుగని పోరాటం చేశారు. పార్టీని, ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేశారు. ఆయనకు "స్ట్రీట్ ఫైటర్" అన్న పేరుంది.

ఎన్నో వివాదాలు....ఎన్నో కేసులు.....

ఏ చిన్న సమస్య వచ్చినా జనం తరుపున ముందు రోడ్డెక్కుతారు. తానున్నానని వారికి దన్నుగా నిలుస్తారు. ఒక్కోసారి దూకుడుగా వ్యవహరించి ఇబ్బందులు పాలయిన సందర్భాలు కూడా ఉన్నాయి. బీజేపీ నేతకు చెందిన అశ్లీల దృశ్యాల సీడీని విడుదల చేసి వివాదాల్లో చిక్కుకున్నారు. ఈ కేసులో ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో కక్ష గట్టిన రమణ్ సింగ్ ప్రభుత్వం ఆయనపై కేసులు పెట్టింది. బఘేల్ తో పాటా ఆయన భార్య భూకబ్జాలకు పాల్పడినట్లు కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదుర్కొన్నారు. సొంత పార్టీలోనూ బఘేల్ కు ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆయన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు తెరవెనుక గట్టి ప్రయత్నాలు జరిగాయి. పార్టీలో అంతర్గతంగా, బయట ప్రభుత్వంపై పోరాటం చేయడంలో ఆయన ఏనాడూ వెనకడుగు వేయలేదు. 2000 నవంబరు 1న ఆవిర్భవించిన రాష్ట్రానికి బఘేల్ మూడో ముఖ్యమంత్రి. మధ్యప్రదేశ్ ను విభజించి ఏర్పాటు చేసిన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అజిత్ జోగీ కాగా రెండో సిఎం రమణ్ సింగ్.ప్రజలకు ఇచ్చిన హామీల అమలే తన తొలి ప్రాధాన్యమని బఘేల్ చెబుతున్నారు. రైతు రుణమాఫీపై తొలి సంతకం చేశారు. 2013లో మావోయిస్టుల చేతిలో ఊచకోతపై సిట్ ను ఏర్పాటు చేయనున్నారు. బఘేల్ పై అటు పార్టీ, ఇటు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. హామీలను అమలు చేయాలని ప్రజలు కోరుకుంటుండగా, పార్టీ పునాదులను విస్తరించాలని అధిష్టానం కోరుకుంటుంది. ఈ బాధ్యతల నిర్వహణలో ఎంతవరకూ విజయవంతమవుతారన్న దానిపైనే బఘేల్ రాజకీయ జీవితం ఆధార పడి ఉంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News