గుజరాత్ గజ గజ లాడిస్తోందా… అందుకేనా ఈ అడుగు

రాజకీయాల్లో కాలమే అన్నింటికి సమాధానం చెబుతుంది. స్థాన బలానికి రాజకీయాల్లో ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా పరిస్థితి అదే. గుజరాత్ ఎన్నికలు [more]

Update: 2021-09-12 16:30 GMT

రాజకీయాల్లో కాలమే అన్నింటికి సమాధానం చెబుతుంది. స్థాన బలానికి రాజకీయాల్లో ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా పరిస్థితి అదే. గుజరాత్ ఎన్నికలు వీళ్ల రాజకీయ ప్రస్థానాన్ని శాసిస్తాయి. ఆ సంగతి వారికి తెలియంది కాదు. అందుకే అకస్మాత్తుగా గుజరాత్ ముఖ్యమంత్రి మార్పు. విజయరూపానీ స్థానంలో భూపేంద్ర పటేల్ ను నియమించడం వెనక కూడా స్ట్రాటజీ ఇదే. అయితే ఈ వ్యూహం ఎంత మేరకు సక్సెస్ అవుతుందన్నది పక్కన పెడితే సొంత ఇంట్లో ఓటమి మాట వినకూడదన్నదే ఇద్దరి తాపత్రయంగా కన్పిస్తుంది.

రెండు దశాబ్దాలుగా…

గుజరాత్ రెండు దశాబ్దాలుగా బీజేపీ కంచుకోటలా మారింది. మోదీ ముఖ్యమంత్రిగా పనిచేసిన నాటి నుంచి గుజరాత్ లో బీజేపీకి బలమైన పునాదులు ఏర్పాటు చేశారు. మోదీ ప్రధాని అయ్యాక అక్కడ నాయకత్వ సమస్య మొదలయింది. 2017 ఎన్నికలలో గుజరాత్ లో బీజేపీ గెలిచినా అది గెలుపు కాదనే చెప్పాలి. కాంగ్రెస్ బాగా పుంజుకుంది. 182 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ ఆ ఎన్నికల్లో కేవలం 99 స్థానాలనే సాధించింది. ఇది బీజేపీకి ఎదురుదెబ్బే అని చెప్పాలి.

పాటీదార్లతో పేచీ…

ప్రధానంగా పాటీదార్ల సామాజికవర్గం గుజరాత్ ను శాసిస్తుందనే చెప్పాలి. 2015 లో తమకు రిజర్వేషన్లు కల్పించాలంటూ పాటీదార్లు ఉద్యమాన్ని ప్రారంభించారు. అప్పటి వరకూ ఈ సామాజికవర్గం గుజరాత్ లో కాంగ్రెస్ వైపే ఉంది. అయితే మోదీ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీజేపీ వైపు మళ్లింది. అయితే ఇటీవల కాలంలో ఈ సామాజికవర్గం తీవ్ర అసంతృప్తికి గురయింది. జైన్ సామాజికవర్గానికి చెందిన నేత కావడం, కేశూభాయ్ పటేల్ ను తప్పించిన నాటి నుంచి పాటీదార్లు బీజేపీకి దూరమయ్యారు. తిరిగి కాంగ్రెస్ వైపు చూశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఓట్ల శాతాన్ని 33 శాతం నుంచి 41.4 శాతానికి పెరగడం కూడా బీజేపీ ఆందోళనకు కారణంగా చెప్పాలి.

అందుకే ఈ నియామకం…

అందుకే గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ను నియమించారు. వచ్చే ఎన్నికల కోసమే ఈయన నియామకం జరిగిందని చెప్పక తప్పదు. అయితే ఈ కొత్త ముఖ్యమంత్రి నియామకంతో పాటీదార్లందరూ మూకుమ్ముడిగా కాషాయ జెండాను పట్టుకుంటారా? అంటే డౌటే. కానీ ఎన్నికల్లో గెలిచేందుకు ఈ స్ట్రాటజీ తప్ప మోదీ, షాల వద్ద మరొకటి లేదు. మరి రానున్న ఎన్నికల్లో గుజరాత్ లో మళ్లీ విజయం సాధించాలన్న మోదీ, షాల వ్యూహం ఎంతమేరకు పనిచేస్తుందన్నది వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News