భూమన బాగా దూరమయ్యారులా ఉందే?

భూమన కరుణాకర్ రెడ్డి పూర్తిగా సైలెంట్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన హవా కొనసాగుతుందని భావించినా, పూర్తిగా పక్కన పెట్టేయడంతో భూమన కరుణాకర్ రెడ్డి [more]

Update: 2020-03-19 06:30 GMT

భూమన కరుణాకర్ రెడ్డి పూర్తిగా సైలెంట్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన హవా కొనసాగుతుందని భావించినా, పూర్తిగా పక్కన పెట్టేయడంతో భూమన కరుణాకర్ రెడ్డి గొంతుక పెద్దగా విన్పించడం లేదు. మూడు రాజధానులు, మండలి రద్దు, స్థానికసంస్థల అంశాలపై ఆయన మాట అస్సలు వినపడటం లేదు. ఎన్నికలకు ముందు వరకూ భూమన కరుణాకర్ రెడ్డి వైసీపీకి ప్రధాన గొంతుకగా ఉన్నారు. చంద్రబాబుపై విరుచుకుపడాలంటే భూమనకు మాత్రమే సాధ్యమన్న స్థాయికి వెళ్లారు.

తొమ్మిదేళ్లుగా…..

స్పష్టంగా మాట్లాడటం, సూటిగా విమర్శలు చేయడంలో భూమన కరుణాకర్ రెడ్డి దిట్ట. వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా భూమనకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. అంతెందుకు మొన్నటి వరకూ కూడా జగన్ భూమన కరుణాకర్ రెడ్డికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. భూమన కూడా జగన్ పాదయాత్రలో పాల్గొన్నారు. పార్టీకి తొమ్మిదేళ్లుగా అండగా నిలిచారు. అందుకోసమే భూమన కరుణాకర్ రెడ్డికి ఎన్నికల సమయంలో ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జిగా నియమించారు.

మంత్రి పదవి రాదని….

కానీ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కూడా భూమన కరుణాకర్ రెడ్డిని జగన్ పట్టించుకోలేదు. ఉత్తరాంధ్ర బాధ్యతలను విజయసాయిరెడ్డికి అప్పగించారు. గతకొంతకాలంగా భూమన కరుణాకర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఆయన చిరకాల కోరిక మంత్రి కావాలని. కానీ ఈ టర్మ్ లో అది సాధ్యం కాదని భూమన కరుణాకర్ రెడ్డికి అర్థమయిపోయిందంటున్నారు. అందుకే ఇక తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారంటున్నారు.

వైఎస్ ఫ్యామిలీ దూరంగా….

ఇక వైఎస్ ఫ్యామిలీకి కూడా గత ఆరు నెలలుగా భూమన కరుణాకర్ రెడ్డి దూరంగా ఉంటున్నారన్న టాక్ ఉంది. ఎక్కువగా ఆయన తిరుపతి, హైదరాబాద్ లలో మాత్రమే ఉంటారంటున్నారు. విజయవాడ వచ్చిన ప్రయివేటు హోటల్ లో దిగి తన పని చేసుకుని వెళ్లిపోతారు తప్ప తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లింది తక్కువేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద జరుగుతున్న పరిణామాలతో భూమన వైసీపీకి, వైఎస్ కుటుంబానికి బాగా దూరమయ్యారన్న ప్రచారం మాత్రం బలంగా విన్పిస్తుంది.

Tags:    

Similar News