“కరుణ” ఎందుకు లేదంటే?

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, వైఎస్ కుటుంబానికి అత్యంత విధేయుడు, ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో పార్టీని బ‌లోపేతం చేసిన నాయ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్న [more]

Update: 2020-02-08 06:30 GMT

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, వైఎస్ కుటుంబానికి అత్యంత విధేయుడు, ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో పార్టీని బ‌లోపేతం చేసిన నాయ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్న భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారా? వైసీపీని అడుగ‌డుగునా ప్రోత్సహించి, జ‌గ‌న్‌కు అన్ని విధాలా స‌హ‌క‌రించిన క‌రుణాక‌ర‌రెడ్డికి ఎలాంటి ప‌దవీ ద‌క్కక‌ పోవ‌డంతో పాటు పార్టీలోనూ పెద్దగా ప్రాధాన్యం లేక‌పోవ‌డంతో ఆయ‌న తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. వాస్తవానికి వైఎస్ హ‌యాం నుంచి కూడా చిత్తూరు జిల్లా రాజ‌కీయాల‌ను శాసించిన నేతగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు.

తాత నుంచి మనవడి వరకూ….

విద్యార్ధి నాయకుడిగా ఉన్నప్పటి నుంచే వైఎస్‌ఆర్‌ తండ్రి రాజారెడ్డితో భూమన కరుణాకర్ రెడ్డికి అనుబంధం ఉంది. అది వైఎస్‌తోనూ కొనసాగింది. జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర నేతగా ఎదిగారు కరుణాకర్‌రెడ్డి. వైఎస్ కుటుంబానికి ఆత్మీయుడిగా పేరుగాంచిన వ్యక్తి.. ఇప్పుడు ఆ కుటుంబానికే దూరమైపోయారనే టాక్‌ నడుస్తోంది. ఎమ్మెల్యే తప్ప ఎలాంటి అధికార పదవి హోదా లేకుండా పోవ‌డంతో భూమ‌న తీవ్ర అసంతృప్తికి గురవుతున్నార‌ని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం రాగానే మంత్రి పదవి ద‌క్కుతుంద‌ని భూమ‌న కరుణాకర్ రెడ్డి వ‌ర్గం భారీ ఎత్తున ఆశ‌లు పెట్టుకుంది. అయితే, సామాజిక స‌మీక‌ర‌ణ‌లో త‌న వ‌ర్గానికి అతి త‌క్కువ ప్రాధాన్యం ఇచ్చారు జ‌గ‌న్‌. దీంతో భూమ‌నకు ఛాన్స్ మిస్సయింది.

పాత పదవి అయినా…..

దీంతో గ‌తంలో తాను చేసిన టీటీడీ పాలకమండలి ఛైర్మన్ ప‌ద‌వి అయినా ద‌క్కుతుంద‌ని అనుకున్నారు. కానీ టీటీడీ చైర్మన్‌ గిరిని జగన్ త‌న బాబాయి వైవీ సుబ్బారెడ్డికి ఇచ్చారు. దీంతో ఆ ఆశ‌లు కూడా అడుగంటాయి. ఇక‌, నామినేటెడ్ ప‌ద‌వి అయినా ద‌క్కక‌పోతుందా? తుడా చైర్మన్‌గిరీ అయినా ల‌భించ‌క‌పోతుందా? అని భూమ‌న ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే, ఈ ప‌ద‌వికి త‌న రాజ‌కీయ శిష్యుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర‌రెడ్డికి కేటాయించారు జ‌గ‌న్‌. అంతేకాదు, ఏకంగా మూడు ప‌ద‌వుల్లో ఆయ‌ననే కూర్చోపెట్టారు. భూమన పదవి కోసం ఎదురు చూస్తుంటే చెవిరెడ్డి ప్రభుత్వ విప్‌ అయ్యారు.

తాను తెచ్చిన వారందరికీ….

భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధం లేకుండానే ఆయన నియోజకవర్గంలో భాగమైన తుడాకు చైర్మన్‌ అయ్యారు చెవిరెడ్డి. టీటీడీ చైర్మన్‌ పదవిని భూమన ఆశిస్తే చెవిరెడ్డి టీటీడీ పాలకమండలి ఎక్స్‌ అఫీషియో సభ్యుడయ్యారు. భూమన కరుణాకర్‌రెడ్డి స్వయంగా పార్టీలోకి తీసుకొచ్చిన రోజాకు కేబినెట్‌ హోదా ఉన్న ఏపీఐఐసీ చైర్‌ప‌ర్సన్ పదవి దక్కింది. ఇలా అన్ని విధాలా ఆయ‌న‌కు ప్రాధాన్యం ద‌క్కక‌ పోవ‌డంతో ఇప్పుడు కిం క‌ర్తవ్యం అంటూ మాన‌సికంగా కుంగిపోతున్నార‌ని అంటున్నారు అనుచ‌రులు. మ‌రి జ‌గ‌న్ ఎప్పటికి క‌రుణిస్తారో చూడాలి.

Tags:    

Similar News