భూమా ఫ్యామిలీకి ఏమైంది?

రాజకీయాల్లో వారసత్వ రాజకీయాలు క్లిక్ అవ్వొచ్చు. కాకపోవచ్చు. అయితే క్లిక్ కాలేకపోయిన వాళ్లు వారి స్వయంకృతాపరాధమేనన్నది వాస్తవం. ఇలా వారసత్వ రాజకీయాలను అందిపుచ్చుకుని క్లిక్ కాలేకపోయింది భూమా [more]

Update: 2020-10-29 14:30 GMT

రాజకీయాల్లో వారసత్వ రాజకీయాలు క్లిక్ అవ్వొచ్చు. కాకపోవచ్చు. అయితే క్లిక్ కాలేకపోయిన వాళ్లు వారి స్వయంకృతాపరాధమేనన్నది వాస్తవం. ఇలా వారసత్వ రాజకీయాలను అందిపుచ్చుకుని క్లిక్ కాలేకపోయింది భూమా నాగిరెడ్డి కుటుంబం. భూమా ఫ్యామిలీ అంటేనే నంద్యాల ప్రాంతంలో ఒక ప్రత్యేకత ఉంది. దశాబ్దాలుగా భూమా కుటుంబం నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాలను శాసించింది. భూమా కుటుంబం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధినాయకత్వాన్ని కూడా శాసించేదిగా ఉండేది. వారికి పార్టీ పదవుల్లోనూ ప్రాధాన్యత లభించేది.

ఉప ఎన్నికల్లోనే…..

కొన్ని సార్లు ఓటమి పాలయినప్పటికీ భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డిలు తమ నాయకత్వ పటిమతో క్యాడర్ ను కాపాడుకుంటూ మళ్లీ విజయం సాధించిన పరిస్థితి ఉంది. కానీ వీరిద్దరి మరణం తర్వాత భూమా ఫ్యామిలీలో రాజకీయంగా ఎదగలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం వారు స్వయంగా చేసుకున్నదే అంటారు. భూమా శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించగానే కూతురు అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత టీడీపీలో మంత్రిగా కూడా పనిచేశారు.

స్వయంకృతాపరాధమే…..

కానీ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో భూమా అఖిలప్రియ ఓటమి పాలయ్యారు. ఇందుకు కారణం అఖిలప్రియ మంత్రిగా ఉండగా క్యాడర్ ను పట్టించుకోకపోవడమే అంటారు. తల్లి, తండ్రి స్థాయిలో నాయకత్వ పటిమను చూపలేకపోవడమేనన్నది వాస్తవం. వారి కూతురిగా అఖిలప్రియ ఆళ్లగడ్డను నిలబెట్టుకోవడంలో విఫలయమ్యారు. అలాగే భూమా నాగిరెడ్డి మరణం తర్వాత జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో సోదరుడి కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి విజయం సాధించారు. కానీ మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

పార్టీ పక్కన పెట్టేసిందా?

ఇక భూమా కుటుంబాన్ని పార్టీ కూడా పెద్దగా పట్టించుకోనట్లే కనపడుతుంది. మొన్నటి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రభావం కన్పించిందని, వీరికి మినహాయింపు ఇవ్వాలనుకున్నా సొంత క్యాడర్ నుంచే వ్యతిరేకత వస్తుండటంతో తెలుగుదేశం పార్టీ కూడా పక్కన పెట్టేస్తుంది. ఇక ఎన్నికల సమయానికి టిక్కెట్లు ఎవరికి ఇస్తారన్నది పక్కన పెడితే పార్టీ పదవుల్లో భూమా కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News