భూమా పని అయిపోయిందా?

నంద్యాలలో తెలుగుదేశం పార్టీ పరిస్థిితి నానాటికీ తీసికట్టుగా తయారయింది. నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిచిన భూమా బ్రహ్మానందరెడ్డి 2019 ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత నంద్యాల వైపు [more]

Update: 2020-02-04 14:30 GMT

నంద్యాలలో తెలుగుదేశం పార్టీ పరిస్థిితి నానాటికీ తీసికట్టుగా తయారయింది. నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిచిన భూమా బ్రహ్మానందరెడ్డి 2019 ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత నంద్యాల వైపు కూడా చూడలేదంటున్నారు. పార్టీకి, క్యాడర్ కు భూమా దూరంగా ఉండటంతో ద్వితీయ శ్రేణి నేతలు కొందరు ఇప్పటికే పార్టీకి దూరమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండటంతో పార్టీ సీనియర్ నేతలు ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

ఉప ఎన్నికల్లో గెలిచినా….

నంద్యాలలో భూమా ఫ్యామిలీకి పట్టుంది. అయితే భూమా నాగిరెడ్డి మరణం తర్వాత ఆయన రాజకీయ వారసుడిగా వచ్చిన భూమా బ్రహ్మానందరెడ్డి ఉప ఎన్నికల్లో గెలిచారు. కానీ ప్రజలతో మమేకం అవ్వడలో భూమా బ్రహ్మానందరెడ్డి విఫలమయ్యారు. 2019 ఎన్నికల్లో భూమా దారుణ ఓటమికి గురయ్యారు. అప్పటి నుంచి ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదు.

నేతలు వెళ్లిపోతున్నా…..

దీంతో కొందరు ద్వితీయ శ్రేణినేతలు వైసీపీలో చేరిపోయారు. పార్టీని పట్టించుకోకుండా భూమా బ్రహ్మానందరెడ్డి వ్యాపారాలకే పరిమితమయ్యారంటున్నారు. ఇటీవల కొందరు మైనారిటీ నేతలు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిపోయారు. వారంతా భూమాకు అనుంగు అనుచరులే. వారిని ఆపలేకపోయారని టీడీపీకి చెందిన సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

అధిష్టానానికి ఫిర్యాదులు…..

మరి కొద్దిరోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ పట్టు నిలుపుకోకపోతే భవిష్యత్తు ఉండదని భూమాను కొందరు నేతలు ఇప్పటికే హెచ్చరించినట్లు తెలిసింది. అయినా భూమా బ్రహ్మానందరెడ్డి పార్టీ క్యాడర్ కు దూరంగా ఉంటున్నారు. ఈ విషయాన్ని సోదరి అఖిలప్రియ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. మొత్తం మీద భూమా బ్రహ్మానందరెడ్డి రాజకీయాలంటే అంత ఆసక్తి కనపర్చడం లేదన్నది మాత్రం అర్థమవుతోంది. ఆయన స్థానంలో మరొకరికి పార్టీ పగ్గాలు ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఊపందుకుంది.

Tags:    

Similar News