ఆళ్లగడ్డ అలివికాకుండా ఉందే….??

కర్నూలు జిల్లాలో కీలక నియోజకవర్గమైన ఆళ్లగడ్డలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకగ్రీవంగా విజయం సాధించి తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి పదవి [more]

Update: 2019-03-19 11:00 GMT

కర్నూలు జిల్లాలో కీలక నియోజకవర్గమైన ఆళ్లగడ్డలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకగ్రీవంగా విజయం సాధించి తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్న భూమా అఖిలప్రియ ఈ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మొదటిసారి ఆమె ఎన్నికలను ఎదుర్కోనున్నారు. కచ్చితంగా విజయం సాధించాలని ఆమె పట్టుదలగా ఉన్నారు. ఇక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక్కడి నుంచి గంగుల ప్రభాకర్ రెడ్డి కుమారుడు గంగుల బిజేంద్ర రెడ్డి(నాని) బరిలో ఉండనున్నారు. చాలా రోజులుగా ఆయన నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో యువ నాయకురాలు, యువ నేత మధ్య తీవ్ర పోటీ నెలకొననుంది.

మూడు కుటుంబాలదే ఆధిపత్యం

ఆళ్లగడ్డ నియోజకవర్గం ఐదు దశాబ్దాలుగా మూడు కుటుంబాల చేతుల్లోనే ఉంటోంది. 1967 నుంచి గంగుల, ఎస్వీ, భూమా కుటుంబాల మధ్యే ఇక్కడ పోటీ ఉంటోంది. ఆళ్లగడ్డలో ఎవరు గెలిచినా ఈ మూడు కుటుంబాల వారే కావడం గమనార్హం. 1967 నుంచి గంగుల కుటుంబం ఐదుసార్లు విజయం సాధించింది. ఎస్వీ కుటుంబం నుంచి శోభానాగిరెడ్డి తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి రెండుసార్లు గెలుపొందారు. భూమా కుటుంబం నుంచి భూమా నాగిరెడ్డి అన్న శేఖర్ రెడ్డి ఒకసారి, భూమా నాగిరెడ్డి రెండు సార్లు, ఆయన భార్య భూమా శోభానాగిరెడ్డి ఐదుసార్లు విజయం సాధించారు. శోభానాగిరెడ్డి మరణం తర్వాత ఆమె కూతురు అఖిలప్రియ ఏకగ్రీవంగా గెలిచారు. ఇక్కడ మరోసారి భూమా, గంగుల కుటుంబాల మధ్య పోటీ ఉండనుంది.

అఖిలప్రియకు వ్యతిరేకంగా మారుతున్న నేతలు

మంత్రిగా అఖిలప్రియ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, తల్లిదండ్రులను కోల్పోయినందున అఖిలప్రియపై ప్రజల్లో సానుభూతి ఆమెకు కలిసివస్తుందనే నమ్మకంతో ఉన్నారు. అయితే, ఆమెకు రోజురోజుకు పరిస్థితులు వ్యతిరేకంగా మారుతున్నాయి. తన తండ్రికి అనుచరులుగా ఉన్న వారు కూడా అఖిలప్రియకు దూరమవుతున్నారు. వారిని అఖిలప్రియ గౌరవించడం లేదనే ఉద్దేశ్యంతో కొందరు భూమా వర్గం నేతలు దూరమయ్యారు. ఇక, తెలుగుదేశం పార్టీలో ఉన్న విభేదాలు కూడా ఆమెకు మైనస్ గా మారే అవకాశం ఉంది. ఇక్కడ టీడీపీ తరపున పలుమార్లు పోటీ చేసి ఓడిన ఇరిగెల రాంపుల్లారెడ్డి కుటుంబం ఇటీవలే ఆ పార్టీని వీడి వైసీపీలో చేరింది. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో టీడీపీలో చేరిన గంగుల ప్రతాప్ రెడ్డి కూడా టీడీపీపై అసంతృప్తిగా ఉన్నారు. ఇక, అఖిలప్రియ మేనమామ ఎస్వీ జగన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అఖిలప్రియకు భారీ షాక్ గా చెప్పవచ్చు.

గట్టి పోటీ ఇవ్వనున్న వైసీపీ

జగన్ రెడ్డి చేరికతో గంగుల, ఎస్వీ కుటుంబాలు ఒక్కటైనట్లు కనిపిస్తోంది. ఇక, భూమా నాగిరెడ్డికి సుదీర్ఘకాలం కుడిభుజంగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి ఇప్పుడు అఖిలప్రియకు వ్యతిరేకంగా మారారు. ఇవన్నీ అఖిలప్రియకు వ్యతిరేక పరిణామాలుగా మారాయి. ఇక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ప్రజల్లో కొంత సానుకూలత ఉంది. దీనికి తోడు గంగుల కుటుంబానికి సైతం మంచి పట్టు ఉండటం, చాలా రోజులుగా అభ్యర్థి నాని ఇక్కడ క్షేత్రస్థాయిలో పనిచేసుకుంటుండటం, ఇటీవల పార్టీలోకి వలసలు పెరగడం, టీడీపీలో ఉన్న వర్గ విభేదాలు వైసీపీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి అఖిలప్రియకు మొదటి ఎన్నికలే గడ్డు పరిస్థితి ఎదుర్కోనున్నట్లు కనిపిస్తోంది.

Tags:    

Similar News