ఈ మ్యాజిక్ వైసీపీని ఎక్కడికో తీసుకెళుతుందా…??

విశాఖ జిల్లాలో భీమునిపట్నానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పైగా ఓ సెంటిమెంట్ కూడా ఈ సీటుకు ఉంది. ఇక్కడ నుంచి గెలిచిన వారికి మంచి హోదాతో పాటు, [more]

Update: 2019-05-07 11:00 GMT

విశాఖ జిల్లాలో భీమునిపట్నానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పైగా ఓ సెంటిమెంట్ కూడా ఈ సీటుకు ఉంది. ఇక్కడ నుంచి గెలిచిన వారికి మంచి హోదాతో పాటు, పదవులు కూడా దక్కుతాయి. ఇక్కడ ఎవరు గెలిచినా రాష్ట్రంలో అధికారం కూడా ఖాయమన్న మాట ఉంది. దానికి ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇదే ఇపుడు ఆసక్తిక‌రమైన చర్చకు దారితీస్తోంది. తాజా ఎన్నికల్లో భీమిలి నుంచి అవంతి శ్రీనివాస్ పోటీ చేశారు. గోల్డెన్ సీటుగా పేరున్న ఇక్కడ నుంచి అవంతి పోటీకి దిగడం ఇది రెండోసారి. దాంతో తాను గెలవడం, తమ పార్టీకి అధికారం దక్కడం రెండూ జరిగితీరుతాయని అవంతి గట్టి నమ్మకంతో ఉన్నారట.

ఆ ఒక్కసారి తప్ప…

భీమునిపట్నం ఎపుడూ అధికార పక్షమే 1952 ఎన్నికల నుంచి తీసుకుంటే ఒకటి రెండు సందర్భాల్లో తప్ప ఎపుడూ ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే అధికార పార్టీలోనే ఉంటారు. ఇక్కడ ఏ పార్టీ జెండా ఎగిరితే ఆ పార్టీ అధికారంలో భాగస్వామ్యం అయిపోతుంది. ఒక్క 1989లో మాత్రం అందుకు రివర్స్ గా సాగింది. ఆనాడు అన్న నందమూరి తారకరామారావు ఓడిపోయి ప్రతిపక్షంలోకి వచ్చారు. భీమునిపట్నం నుంచి ఆర్ ఎస్ డీ పీ అప్పలనరసింహరాజు ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో కూర్చున్నారు. అది తప్ప అంతకు ముందు… తరువాత కూడా భీమిలీ సీటు అధికార పక్షంలోనే వుంటూ వచ్చింది. 2009 ఎన్నికల్లో ఇక్కడ నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్ధిగా అవంతి శ్రీనివాస్ గెలిచారు. ఆ తరువాత ఆయన అధికార కాంగ్రెస్ లో చేరిపోయారు. ఆ విధంగా భీమిలీ సెంటిమెంట్ నిలబడింది.

ఈసారి వైసీపీదేనా…?

ఇక ఇపుడు అవంతి మళ్ళీ భీమిలీ నుంచి పోటీలో ఉన్నారు. ఆయన గెలుపు ఖాయమని అంతా నమ్ముతున్నారు. పందాలు కూడా భారీ ఎత్తున కడుతున్నారు. ఆరు నూరు అయినా అవంతి గెలుపు ఖాయమని బల్ల గుద్దీ మరీ చెబుతున్నారు. మరి అటువంటి భీమిలీ సీట్లో వైసీపీ గెలిస్తే ఏపీలో కూడా వైసీపీ అధికారంలోకి వస్తుందా అన్న చర్చ అటు వైసీపీలో ఇటు టీడీపీలో సాగుతోంది. భీమిలీ సెంటిమెంట్ ప్రకారం అయితే వైసీపీ జెండా ఏపీలో కూడా ఎగరడం ఖాయం అంటున్నారు. మరో విధంగా కూడా భీమిలీని చెబుతున్నారు. ఇక్కడ 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. ఆ రెండు ఎన్నికల్లో కూడా ఉమ్మడి ఏపీలో టీడీపీ గెలవలేదు. దాంతో ఆ యాంటీ సెంటిమెంట్ టీడీపీని పట్టి పీడిస్తోంది. దాంతో ఇపుడు మొత్తం తమ్ముళ్ళు తమ సీటు విషయం పక్కన పెట్టి మరీ భీమిలీ ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు. భీమిలీ మ్యాజిక్ వైసీపీని ఎక్కడకు తీసుకెళ్తుందో చూడాలి మరి.

Tags:    

Similar News