తమిళ సై వారసులెవరు?

తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా మొన్నటి వరకూ కొనసాగిన తమిళసౌ సౌందర్ రాజన్ తెలంగాణ గవర్నర్ గా నియమితులయ్యారు. ఈనెల 8వ తేదీన ఆమె గవర్నర్ [more]

Update: 2019-09-18 17:30 GMT

తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా మొన్నటి వరకూ కొనసాగిన తమిళసౌ సౌందర్ రాజన్ తెలంగాణ గవర్నర్ గా నియమితులయ్యారు. ఈనెల 8వ తేదీన ఆమె గవర్నర్ గా బాధ్యతలను స్వీకరించారు. అయితే ఇప్పుడు తమిళనాడులో పార్టీ రధసారథి ఎవరన్న చర్చ జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కూడా దీనిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని భావిస్తోంది. తమిళనాడులో ఇప్పటి వరకూ ప్రాంతీయ పార్టీలదే హవా. అన్నాడీఎంకే, డీఎంకేలే ఇప్పటి వరకూ రాజ్యమేలుతూ వస్తున్నాయి.

ప్రాంతీయ పార్టీలయినా…..

అయితే జయలలిత, కరుణానిధి మరణంతో ఆ రెండు పార్టీలూ నాయకత్వ లేమితో అల్లాడుతున్నాయి. డీఎంకే కొద్దిలో కొద్దిగా పరవాలేదు. స్టాలిన్ నాయకత్వంలో ఆ పార్టీ పుంజుకుంటుందన్న సంకేతాలు ఇటీవల జరిగిన లోక్ సభ, శాసనసభ ఉప ఎన్నికల ఫలితాలతో స్పష్టమయింది. అయితే శాసనసభ ఎన్నికలకు వచ్చేసరికి స్టాలిన్ స్టామినా సరిపోతుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. దక్షిణాదిన బలపడాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీకి తెలంగాణ, తమిళనాడులు ఆశాజనకంగా కన్పిస్తున్నాయి.

పియూష్ గోయల్ కు…..

అందుకే తమిళనాడుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక్కడ ఏదో ఒక పార్టీతో పొత్తుతో వెళ్లినప్పటికి ముందు బీజేపీ క్షేత్రస్థాయిలో బలపడాల్సిన అవసరం ఉంది. అందుకే అమిత్ షా ఇటీవల కాలంలో తమిళనాడు పర్యటనలు ఎక్కువగా చేస్తున్నారు. రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయాల్ తమిళనాడు రాజకీయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. గతంలో ఎన్నికల సమయంలోనూ పియూష్ గోయల్ పొత్తుల విషయంలో కీలకంగా వ్యవహరించారు. తమిళసై స్థానంలో తమిళనాడు బీజేపీ రధసారధిని నిర్ణయించే బాధ్యతలను ఆయనకే అప్పగించినట్లు తెలుస్తోంది.

అనేక మంది పోటీలో…..

ఇక తమిళనాడు భారతీయ జనతా పార్టీ పగ్గాలు చేపట్టేందుకు అనేక మంది ఆసక్తి చూపుతున్నారు. ఇందులో బీజేపీ జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్న హెచ్ రాజా, కేంద్ర మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమిళి సై ఒకరకంగా పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేశారు.అందుకే యువకులకే కిరీటం పెట్టాలన్నది బీజేపీ కేంద్ర పెద్దల ఆలోచనగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో కొంత ఆలస్యమయినా సరైన వ్యక్తినే రధసారధిగా నియమించాలని బీజేపీ కేంద్ర నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News