తిధి, నక్షత్రం బాగా లేదంట....!!

Update: 2018-11-13 16:30 GMT

భారతీయ జనతా పార్టీ పూర్తి సాంప్రదాయ పార్టీ. హిందుత్వ భావాజాలాన్ని పుణికిపుచ్చుకున్న రాజకీయ పార్టీ. వారాలు, నక్షత్రాలు, తిధులు, ముహూర్తాలు అంటే కమలం పార్టీకి ఎనలేని గురి. పార్టీ వేసే ప్రతి అడుగూ, తీసుకునే ప్రతి నిర్ణయం వీటి ప్రాతిపదికగానే ఉంటాయి. అయినా ఈ మధ్య కమలం పార్టీకి కాలం కలసి రావడం లేదు. అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. అపశకునాలు ఎదురవుతున్నాయి. ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ పెద్దలు ఆపసోపాలు పడుతున్నారు. ఈ పరిస్థితులను ఎలా అధిగమించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. 2014లో మోదీ విజయం అనంతరం అప్రతిహతంగా అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ ఇటీవల కాలంలో ముఖ్యంగా గత ఏడాది నుంచి అనేక ఇబ్బందుల పాలవుతుంది. కర్ణాటక ఎన్నికలు, గత సంవత్సర కాలంగా జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో వైఫల్యం తప్పదన్న సర్వేలు పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

కలిసి రాకపోవడానికి.....

ఇందుకు కారణం కొత్త కార్యాలయంలోకి పార్టీ అడుగుపెట్టడమేనని కొందరు కమలనాధులు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యాలయం పార్టీకి ఏమాత్రం కలసి రాలేదని వారు వాదిస్తున్నారు. ఇందుకు పక్కా ఉదాహరణలను చూపెడుతున్నారు. గతంలో అశోక్ రోడ్డు -11లో పార్టీ కార్యాలయం ఉండేది. అందులో తగిన వసతులు లేవని, పార్టీ అవసరాలకు సరిపోవడం లేదన్న ఉద్దేశ్యంతో కొత్త కార్యాలయాన్ని నిర్మించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్-6లో అధునాతన సౌకర్యాలు, సకల హంగులతో అయిదు అంతస్థుల్లో కొత్త కార్యాలయాన్ని నిర్మించారు. ఇది కార్పొరేట్ కార్యాలయాన్ని తలదన్నే విధంగా ఉంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మేళవించిన ఈ కార్యాలయాన్ని ఏడాదిన్నరలోనే నిర్మించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 18న ప్రధాని మోదీ స్వయంగా ప్రారంభించారు. కానీ ఈ భవనం పార్టీకి అస్సలు అచ్చిరాలేదని, ఇక్కడికి వచ్చాక పార్టీకి అన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నాయని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు కొన్ని తాజా ఉదాహరణలను కూడా పార్టీ వర్గాలు చూపెడుతున్నాయి. పార్టీ ఈ భవనంలోకి మారాక యూపీలోని గొరఖ్ పూర్, పూల్పూర్, కైరానా లోక్ సభ స్థానాల్లో ఘోర పరాజయం పాలైంది. ఈ మూడూ కమలం పార్టీవే కావడం విశేషం. గోరఖ్ పూర్ స్థానం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ సొంత నియోజకవర్గం కావడం గమనార్హం. ఇక్కడి నుంచి ఆయన అయిదు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడంతో ఉప ఎన్నిక అవసరమైంది. పూల్ పూర్ స్థానం నుంచి ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రాతినిధ్యం వహించారు. ఆయన రాజీనామాతో ఎన్నిక అనివార్యమైంది.

కర్ణాటక ఎన్నికల్లోనూ.....

తర్వాత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ అధికారంలోకి రాలేకపోయింది. టీడీపీ కూటమికి దూరమైంది. కాశ్మీర్ లో పీడీపీతో ఏర్పాటైన సంకీర్ణ సర్కార్ నుంచి వైదొలిగింది. చిరకాల మిత్ర పక్షం శివసేన తెగదెంపులకు సిద్ధపడుతోంది. పార్టీ కొత్త కార్యాలయంలోకి మారాకే ఇవన్నీ జరిగాయని పార్టీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. ఇటీవల కర్ణాటకలో జరిగిన మూడు లోక్ సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో పార్టీ ఘోరంగా దెబ్బతింది. కంచుకోట బళ్లారిని హస్తగతం చేయకతప్పలేదు. రాష్ట్ర పార్టీ పెద్దదిక్కు అయిన యడ్యూరప్ప ప్రాతినిధ్యం వహించిన శివమొగ్గ నియోజకవర్గంలో చావుతప్పి కన్ను లొట్టపోయిన చందాన గెలిచింది. 2014 లో యడ్యూరప్పకు 3.63 లక్షల మెజారిటీ లభిస్తే, ఇప్పుడు ఆయన తనయుడు రాఘవేంద్రకు మెజారిటీ 47వేలకు పడిపోవడం గమనార్హం. మాండ్య లోక్ సభ స్థానం, జమఖండి అసెంబ్లీ స్థానాల్లో కమలం పార్టీ దాదాపు కనుమరుగైంది.

నాలుగున్నరేళ్లలో....

గత నాలుగున్నరేళ్లలో దేశవ్యాప్తంగా మొత్తం 30 లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే అందులో కమలం పార్టీ కేవలం ఆరుస్థానాలనే నిలబెట్టుకుంది. మరో 9 స్థానాలను విపక్షాలకు అప్పగించింది. విపక్షానికి చెందిన కనీసం ఒక్కస్థానాన్ని కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయింది. ఫలితంగా 2014 ఎన్నికల్లో పార్టీ బలం 282 ఉండగా ఇప్పుడు దాని బలం 272కు పడిపోయింది. పార్టీ గెలిచిన ఆరు స్థానాల్లో కూడా మెజారిటీ బాగా పడిపోయింది. 2014లో మోదీ సొంత రాష్ట్రమైన వడోదరతో పాటు యూపీలోని వారణాసిలోనూ పోటీ చేశారు. అనంతరం వడోదర స్థానానికి రాజీనామా చేశారు. మహారాష్ట్రలోని బీడ్ ఎంపీ గోపీనాధ్ ముండే ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక జరిగింది. వడోదర, బీడ్ ఉప ఎన్నికల్లో కమలం పార్టీ ఘనవిజయం సాధించింది. ఇక ఆతర్వాత జరిగిన అన్నీ ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బలు అనివార్యమయ్యాయి.

అత్తెసరు మెజారిటీ....

కొన్ని చోట్ల గెలిచినా మెజారిటీ అత్తెసరు కావడం గమనార్హం. మహారాష్ట్రలో రైతునేత నానా పటోలె భండారా గోండియా స్థానానికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడంతో జరిగిన ఉప ఎన్నికల్లో కమలానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ స్థానాన్ని శరద్ పవార్ పార్టీ ఎన్సీపీ గెలుచుకుంది. పంజాబ్ లోని గురుదాస్ పూర్ బీజేపీ ఎంపీ, ప్రముఖ నటుడు వినోద్ ఖన్నా మృతితో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జాకడ్ 1.90 లక్షల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అస్సోంలోని లఖంపూర్, మహారాష్ట్రలోని పాలఘడ్, మధ్యప్రదేశ్ లోని షధోల్ లోక్ సభ స్థానాలను ఉఫ ఎన్నికల్లో కమలం పార్టీ నిలబెట్టుకున్నప్పటికీ మెజారిటీ బాగా పడిపోవడం గమనార్హం. బీజేపీ కోల్పోయిన 9 స్థానాల్లోనూ అయిదింటిలో హస్తం పార్టీ, రెండింటిలో సమాజ్ వాదీ పార్టీ కైవసం చేసుకున్నాయి. శరద్ పవార్ పార్టీ ఎన్సీపీ, అజిత్ సింగ్ సారథ్యంలోని ఆర్ఎల్డీ చెరో స్థానాన్ని దక్కించుకున్నాయి. మొత్తం మీద కొత్త కార్యాలయం కలసి రాలేదన్నది కమలం శ్రేణుల భావన. ఈ నేపథ్యంలో మళ్లీ కార్యాలయాన్ని అశోక్ రోడ్డులోని పాతచోటికి మార్చాలన్న ఆలోచనను పార్టీ చేస్తోంది. 2014లో వార్ రూమ్ గా ఉపయోగించుకున్న ప్రస్తుత మంత్రి శ్రీపాదయశోనాయక్ కు చెందిన లోధీ ఎస్టేట్ బంగళాను కూడా పరిశీలించనున్నట్లు సమాచారం. మున్ముందు ఏమి జరుగుతుందో చూడాలి మరి....!!

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News