ధీమా అదేగా?

ఏపీకి కొత్త బడ్జెట్లో ఏమీ దక్కలేదు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ కూడా ఏపీకి ఉత్త చేయి చూపించింది. ఇది అంధ్ర జనులకు చాలా పాత వార్త. పవన్ [more]

Update: 2020-02-02 16:30 GMT

ఏపీకి కొత్త బడ్జెట్లో ఏమీ దక్కలేదు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ కూడా ఏపీకి ఉత్త చేయి చూపించింది. ఇది అంధ్ర జనులకు చాలా పాత వార్త. పవన్ కళ్యాణ్ భాషలో చెప్పాలంటే పాచిపోయిన లడ్డూల లాంటి వార్త. అందుకే కేంద్ర బడ్జెట్ పై ఎవరూ చర్చకు పెట్టలేదు. ఏదో ఒరిగిపోతుందన్న ఆశలు పెంచుకోలేదు. షరా మామూలుగా పత్రికలు మాత్రం ఏపీకి మళ్ళీ మొండి చేయి, రిక్త హస్తం అంటూ తమ భాషాపాండిత్యాన్ని ప్రదర్శించాయి. నిజానికి ఇది ఇక్కడితో మొదలైంది కాదు. ఇంతటితో ఆగేదీ కాదు. ఏపీకి పెద్ద అన్యాయం విభజనతోనే జరిగిపోయింది. దాంతో పోల్చుకుంటే ఇదెంత అన్న వైరాగ్యం కూడా జనాల్లో ఉంది.

ఏం చేయగలరు…?

వైసీపీకి ఇపుడు ఏపీలో 22 మంది ఎంపీలు ఉన్నారు. ఆ మిగిలిన ముగ్గురూ టీడీపీకి ఉన్నారు. వీరంతా కలసి పార్లమెంట్ లో నిలదీస్తారని కానీ, బీజేపీ మెడలు వంచుతారని కానీ భ్రమలైతే ఏపీ ప్రజలకు లేవంటే లేవు. ఎందుకంటే ఇది చూసేసిన సినిమా. 2014 నుంచి 2019 వరకూ టీడీపీ ఎంపీలు మెజారిటీగా ఉండేవారు. అపుడు వారు రొటీన్ డైలాగ్ ఒకటి చెప్పేవారు. అవును నిజమే ఏపీకి తీరని అన్యాయమే జరిగింది. మేము గట్టిగా పార్లమెంటులో నిలదీస్తామని, ఇలా అయిదేళ్ళూ గడిపేశారు కానీ ఏమీ రాలేదు, జరగలేదు. ఇపుడు అదే సౌండ్ వైసీపీ ఎంపీలు చేస్తున్నారు. సేమ్ టూ సేమ్ సీన్ అంతే. ఇంతకంటే ఏం చేయగలరు మరి.

బీజేపీ ఫ్యాన్సే…

చిత్రమేంటంటే ఏపీలో ఉన్న ప్రధాన పార్టీలన్నీ కూడా బీజేపీ ఫ్యాన్సే. అధికార వైసీపీ బీజేపీతో దోస్తీ చేస్తోంది. ప్రతిపక్ష టీడీపీ కాషాయం కొంగు పట్టుకోవాలని ఉబలాటపడుతోంది. ఇక జనసేన పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా బీజేపీతో చీర అంచులు ముడే వేసుకున్నారు. ఇలా ముగ్గురు ప్రధాన నాయకులూ కూడా బీజేపీని పల్లెత్తు మాట అనలేని నిస్సహాయతతో ఉన్నారు. బీజేపీ ఏం చేసినా ఫరవాలేదు అన్నది ఈ పార్టీల తీరు అయినపుడు కేంద్రం ఎందుకు ఉదారంగా వరాలు ఇస్తుంది. అసలు ఆ ఊసు కూడా ఎందుకు తలుస్తుంది. ఇదే కదా రాజకీయం అంటే.

అడిగే దిక్కేదీ…?

విభజన చట్టం ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వాలి. దాన్ని అటకెక్కించేసారు. రాజధానికి నిధులు ఇవ్వాలి. ఇపుడు ఏపీలో మూడు రాజధానుల రగడ కొనసాగుతోంది. దాంతో బీజేపీకి ఈ తలనొప్పి కూడా లేదు. పోలవరం నిధులు ఇవ్వాలి. రివర్స్ టెండరింగ్ పేరిట వైసీపీ సర్కార్ పాత కాంట్రాక్టులను రద్దు చేసింది. దాని మీద కోర్టులో కేసుతో కొత్త కాంట్రాక్టర్ మేఘా సంస్థ పనుల పైన స్టే ఉంది. ఎక్కడా పనులు ఒక్క అంగుళం కూడా సాగడంలేదు. ఇక పోలవరానికి ఎందుకు నిధులు ఇవ్వాలి. ఏపీకి లోటు బడ్జెట్ ఉంది అంటారు. చేతికి ఎముక లేకుండా నాడు చంద్రబాబు, నేడు జగన్ సంక్షేమ పధకాల జడివాన కురిపిస్తారు. ఈ తీరు చూసినపుడు ఎక్కడ లోటు ఉంది. ఎందుకు నిధులు ఇవ్వాలని కేంద్రం అనుకుంటే తప్పేముంది. అసలు ఇవన్నీ కాగితాలలో ఎక్కడో మూలన పడి ఉన్న లెక్కలు. వాటి గురించి గట్టిగా నిలదీసి గర్జించే నాయకుడు ఏపీ నుంచి ఉన్నారా? బీజేపీని గద్దించి మాకు చేసిన అన్యాయం ఇదీ అని చెప్పే తెగువ ఎవరికైనా ఉందా? సో.. కేంద్రం బేఫికర్ గా ఉండొచ్చు. ఎన్ని బడ్జెట్లు అయినా ఇలాగే పెడుతూ ఉంటారు. ఏపీని మాత్రం అసలు పట్టించుకోరు. ఈ కధ ఇంతే.

Tags:    

Similar News