ప్రశ్నిస్తే… ప్రతీకారమేనా?

విధానపరమైన లోపాలను ఎత్తి చూపడం ప్రతిపక్షం బాధ్యత. అధికార పార్టీకి ప్రజల విషయంలో ఎంతటి బాధ్యత ఉంటుందో, ప్రతిపక్షానికీ నిలదీయడానికి అంతటి అధికారం ఉంటుంది. తామెన్నుకున్న ప్రభుత్వాన్ని [more]

Update: 2020-07-09 16:30 GMT

విధానపరమైన లోపాలను ఎత్తి చూపడం ప్రతిపక్షం బాధ్యత. అధికార పార్టీకి ప్రజల విషయంలో ఎంతటి బాధ్యత ఉంటుందో, ప్రతిపక్షానికీ నిలదీయడానికి అంతటి అధికారం ఉంటుంది. తామెన్నుకున్న ప్రభుత్వాన్ని ప్రతి సందర్భంలోనూ ప్రజలు నేరుగా ప్రశ్నించలేరు. ప్రజల్లో తలెత్తే సందేహాలను నివృత్తి చేసేందుకు , కర్తవ్యం గట్టు తప్పకుండా చూసేందుకు ప్రతిపక్షం పనిచేయాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం షాడో గవర్నమెంట్ గా పనిచేస్తూ ఉంటుంది. దీనిని నేరంగా, ద్రోహంగా భావిస్తే అధికారంలో ఉన్నవాళ్లు తప్పులో కాలేసినట్లే. ప్రత్యర్థి పార్టీ చేసే సూచనలు, వేసే ప్రశ్నలు అప్రమత్తం చేస్తాయి. నాయకులే కాకుండా అధికారులు సైతం ఆచితూచి వ్యవహరించేలా హెచ్చరిస్తాయి. కానీ భారతదేశంలో పరిస్థితులు భిన్నంగా పరిణమిస్తున్నాయి. కాంగ్రెసు, బీజేపీ పార్టీలు ప్రతి విషయంలోనూ కత్తులు నూరుకుంటున్నాయి. దేశ రక్షణ వంటి విషయాల్లోనూ సంయమనం పాటించలేకపోతున్నాయి.

ప్రశ్నిస్తే నేరమా..?

చైనా విషయంలో కాంగ్రెసు పార్టీ కొంచెం ఘాటుగానే స్పందించింది. గల్వాన్ ప్రాంతంలో చైనా దురాక్రమణ చేసిందా? లేదా? అనేది ఆ పార్టీ సంధించిన అస్త్రం. సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన పార్టీగా , ప్రధాన ప్రతిపక్షంగా ఆ ప్రశ్న అడగటంలో తప్పేమీ లేదు. సున్నితమైన అంశాల్లో ఎంతవరకూ బదులు చెప్పాలో అంతవరకూ స్పందించి కేంద్రం మిన్నకుండి పోవచ్చు. అయినా వాస్తవాలు ప్రజలందరికీ తెలుసు. చైనా చొచ్చుకువచ్చిన సందర్భంలోనే మన సైనికులు నిరోధించే ప్రయత్నంలో మరణించారని ప్రపంచమంతా కోడై కూసింది. దేశ రక్షణ, విదేశాంగ శాఖలు ఆ విషయాన్ని అంగీకరించాయి. ప్రధాని అఖిల పక్ష సమావేశంలో ఆత్మరక్షణకు వెళ్లి అసలు ఆక్రమణే లేదంటూ అతిశయోక్తులు పలకడంతోనే సమస్య వచ్చి పడింది. దానిపై తిరిగి ప్రధాని కార్యాలయం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయినా కాంగ్రెసు కూపీ లాగాలనుకోవడం కేవలం రాజకీయ కోణమే. దానిని భూతద్దంలో చూస్తూ కాంగ్రెసును ద్రోహపూర్వక పార్టీగా ముద్ర వేయాలని బీజేపీ అనుకోవడమూ రాజకీయమే.

ఇదా సమయం…

కాంగ్రెసు పార్టీ చిత్తశుద్ధితోనే ప్రశ్నలు వేసిందని చెప్పలేం. రాజకీయ ఉద్దేశం ఆ పార్టీ నేతల ప్రశ్నల్లో దాగి ఉంది. 1962 ఉదంతంలో నెహ్రూ హయాంలో కాంగ్రెసు తీవ్రంగా భంగపాటును ఎదుర్కొంది. చైనా విషయంలో కావాల్సినంత అప్రతిష్ఠను మూటగట్టుకుంది. 38 వేల చదరపు కిలోమీటర్ల భూభాగం చైనా పాలయ్యింది. దానిని బీజేపీ ప్రతి సందర్భంలోనూ ఎత్తి చూపుతుంది. దానికి బదులుగా పరిహారం తీర్చుకుందామనే యావ కాంగ్రెసు నేతల నిలదీతలో కనిపించింది. సరెండర్ మోడీ అంటూ రాహుల్ ఈ విషయంలో అత్యుత్సాహం కనబరిచారు. ఈ రెండు పార్టీలు ఒకదానికొకటి అండగా ఉండి పరస్పరం సలహాలు, సూచనలు చేసుకోవాల్సిన సమయం. కానీ రాజకీయాల బాట పట్టడంతోనే పరిస్థితులు దిగజారుతున్నాయి. గతంలో 1971లో పాక్ యుద్ధంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చూపిన ధైర్యసాహసాలను ప్రతిపక్షంలో ఉన్న వాజపేయి గొప్పగా ప్రశంసించారు. అపరకాళిగా అభివర్ణించారు. ఆ స్ఫూర్తి ఇప్పుడు కరవైంది. వాజపేయి, పీవీ నరసింహారావుల మధ్య కూడా సుహృ‌ద్భావ సంబంధాలు ఉంటుండేవి. ఇప్పుడు ఆరకమైన వాతావరణం బీజేపీ, కాంగ్రెసుల్లో మచ్చుకైనా కానరావడం లేదు.

వ్యక్తిగత ద్వేషం…

అధికార, విపక్షాలు విధానపరమైన విషయాలపై దృష్టి పెట్టకుండా వ్యక్తులను టార్గెట్ చేయడం ఎక్కువై పోయింది. నాయకుడిని బద్నాం చేస్తే సులభంగా ప్రచారం వస్తుందనే భావన పెరిగింది. సిద్దాంతాలు, పార్టీ విధానాలు, దేశ ప్రయోజనాల పేరిట మాట్లాడితే ప్రజలు పట్టించుకోరని నాయకులు అనుకుంటున్నారు. అందువల్ల వ్యక్తులపైనే గురిపెడుతున్నారు. గతంలో ప్రతిపక్షాలు, బీజేపీ ..రాహుల్ గాంధీని లక్ష్యంగా చేస్తూ విమర్శలు గుప్పించేవి. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్రమోడీ అదే రకమైన దాడిని కాంగ్రెసు, ప్రతిపక్షాల నుంచి ఎదుర్కొంటున్నారు. వ్యక్తులు ఆయా వ్యవస్థలు, పార్టీలకు ప్రాతినిద్యం వహిస్తారు. ముఖ్యంగా బీజేపీ వంటి పార్టీల్లో సిద్దాంతాలకు మొదటి ప్రాధాన్యం ఉంటుంది. వాటిని అమలు చేసే విధానాల్లో భిన్నత్వం ఉండొచ్చు. దానిని గుర్తించి మూలాలపై దృష్టి పెట్టకుండా నరేంద్రమోడీనే లక్ష్యం చేయడం వల్ల తాత్కాలికంగా బాగా అనిపించవచ్చు. కానీ సైద్ధాంతిక పోరాటంలో వెనకబాటుతనం తప్పదు. కాంగ్రెసు పార్టీ ఈవిషయంలోనే సరైన అంచనాలు వేయలేకపోతోంది. మోడీ తర్వాత నాయకత్వాన్ని సైతం బీజేపీ చాపకింద నీరులా తయారు చేసుకుంటూ వెళ్లిపోతోంది. తమ నాయకత్వంలోని అయోమయాన్నికాంగ్రెసు ఇంకా దిద్దుకోలేక తలకిందులవుతోంది.

ప్రతీకార రాజకీయాలు…

ప్రత్యర్థులపై తమ చేతిలోని దర్యాప్తు సంస్థల అస్త్రాలను ప్రయోగించే ప్రతీకార రాజకీయాలు దేశంలో కొత్తేమీ కాదు. కానీ ఇటీవల మరింతగా ముదురుపాకాన పడ్డాయి. ప్రధాని మోడీని కాంగ్రెసు పార్టీ చైనా విషయంలో వేలెత్తి చూపుతోంది. దీనికి బదులుగా కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాస్త్రాలను బయటకు తీస్తోంది. ఎప్పుడో పది పన్నెండేళ్ల క్రితం నాటి చైనా విరాళాల విషయాన్ని తవ్వుతోంది. కాంగ్రెసు పార్టీ దేశభక్తిని సందేహాస్పదం చేయాలని ఎత్తుగడలు వేస్తోంది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్టు, ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్టుల విరాళాల అంశాన్ని పెద్దది చేసి చూపాలని ప్రయత్నిస్తోంది. ఈ ట్రస్టులన్నిటికీ గాంధీ కుటుంబమే సారథ్యం వహిస్తోంది. తాజాగా హోం మంత్రిత్వ శాఖ ఆయా ట్రస్టుల వ్యవహారంపై అంతర్ మంత్రిత్వకమిటీని ఏర్పాటు చేసింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సీబీఐ లను రంగంలోకి దింపింది. ఆరేళ్ల నుంచి తామే అధికారంలో ఉన్న బీజేపీ నేత్రుత్వంలోని కేంద్రానికి ఇప్పుడే ట్రస్టుల వ్యవహారం ఎందుకు గుర్తుకొచ్చిందనేది అందరికీ తెలుసు. చైనా విషయంలో ప్రశ్నలు ఎక్కుపెడుతున్న ప్రధాన ప్రతిపక్షానికి రాజకీయంగా బదులివ్వ దలచుకోలేదు. నైతికంగా దెబ్బతీయాలనే వ్యూహం తోనే ముందుకు సాగుతోంది. ఈ దర్యాప్తు గుట్టు ఇప్పటికిప్పుడు తేలిపోయేదీ కాదు. కానీ ప్రతిపక్షానికి కళ్లెం వేయడానికి ఒక అస్త్రాన్ని తన వద్ద ఉంచుకొంటోంది కేంద్రం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News