బీజేపీ టార్గెట్?

రెండు తెలుగు రాష్ట్రాల్లో సడెన్ గా రాజకీయ పరిణామాల్లో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో నిన్నటి వరకూ బీజేపీని పల్లెత్తు మాట అనని వైసీపీ ఒక్కసారిగా [more]

Update: 2020-01-26 15:30 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో సడెన్ గా రాజకీయ పరిణామాల్లో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో నిన్నటి వరకూ బీజేపీని పల్లెత్తు మాట అనని వైసీపీ ఒక్కసారిగా నోరు చేసుకుంది. తమ పార్టీ పెద్ద గొంతుక అయిన అంబటి రాంబాబు ద్వారా గట్టి రిటార్టునే ఇప్పించింది. గత ఎనిమిది నెలలుగా వీరంగం వేస్తున్న కమలదళానికి గట్టి జవాబే ఇచ్చింది. అసలు ఏంటి మీ పొలిటికల్ పాలసీ అనేంతదాకా అంబటి శరసంధానం సాగిపోయింది. నిజానికి బీజేపీని ఇలా ఘాటుగా వైసీపీ ముఖ్య నాయకుడొకరు ఇప్పటిదాకా ప్రశ్నించిన దాఖలాలు లేకపోవడం వల్ల ఇది పెద్ద చర్చకే కారణమవుతోంది.

ఏకేశారుగా….

బీజేపీ 2019 ఎన్నికల ప్రణాళికకు కట్టుబడి ఉండదా, ఆ పార్టీ నాడు ఏమి చెప్పిందంటూ అంబటి ప్రశ్నించడం వెనక పెద్ద అర్ధాలే ఉన్నాయంటున్నారు. హైకోర్టుని కర్నూలులో పెడతామని అన్నారు, అమరావ‌తిలో పెద్ద ఎత్తునా భూదందా, అవినీతి జరిగిందని, అధికారంలోకి వస్తే విచారణ చేయిస్తామని అన్నారు. రైతులు కోరుకుంటే భూములు తిరిగి ఇస్తామని అన్నారు, ఇంతలా స్కాములతో నిండిన అమరావతి మళ్ళీ రాజధాని అని బీజేపీ నేతలు ఎందుకు కోరుకుంటున్నారు. బాబుకు ఎందుకు బాసటగా నిలుస్తున్నారు, ఆసలు ఏపీ రాజకీయాల విషయంలో మీ విధానం ఏంటన్న దాకా అంబటి ప్రశ్నల వర్షం కొనసాగింది.

అవసరం లేదుట..?

ఏపీలో మూడు రాజధానుల విషయంలో కేంద్రాన్ని అడగాల్సిన అవసరం లేదని అంబటి కుండబద్దలు కొట్టారు. ఇది రాష్ట్ర పరిధిలోని అంశమని చెప్పుకున్నారు. ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ డియోధర్ మాటలపై కౌంటర్ అటాక్ చేశారు. మాకు ఒక ప్రభుత్వంగా విధానం ఉంటుంది. దాన్ని అనుసరించి ముందుకు వెళ్తామని కూడా అంబటి చెప్పేశారు. ఇవన్నీ చూసినపుడు బీజేపీ మీద వైసీపీ తొలి అటాక్ మొదలెట్టిందన్న చర్చ ముందుకు వస్తోంది. జగన్ ఎంతలా సహనంతో ఉన్నా ఆయన మీద సీబీఐ కేసుల ఉచ్చు బిగించడం, బద్ద శత్రువైన చంద్రబాబుకు మద్దతుని ఇస్తూ, మరో వైపు పవన్ తో పొత్తులు పెట్టుకుని ఎదురు దాడి చేయడంతో ఒళ్ళు మండిన వైసీపీ అధినాయక‌త్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలలకే కేంద్రంతో కయ్యానికి రెడీ అవుతోందా అన్న డౌట్లు పుట్టుకువస్తున్నాయి.

సమర నినాదమే :

సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కేంద్రంపై నిప్పులు చెరిగారు. మోడీ, షాల వైఖరిపై సమర శంఖమే పూరించారు. తాను సీఏఏను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని, అవసరమైతే హైదరాబాద్ లోనే జాతీయ సదస్సు పెడతానని గర్జించారు. అంటే మరో ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ పావులు కదుపుతున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి. ఇక మోడీ పాలనలో దేశంలో ఆర్ధిక మాంధ్యం పెరిగిందని, అన్ని రంగాల్లో విఫలం అయ్యారని కూడా కేసీఆర్ అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే కూడబలుక్కున్నట్లుగా రెండు తెలుగు రాష్ట్రాల అధినేతలు కేంద్రాన్ని, బీజేపీని టార్గెట్ చేశారా అనిపిస్తోంది. దీని ఫలితాలు, పర్యవసానాలు ఏంటన్నది కూడా వేచిచూడాల్సివుంది.

Tags:    

Similar News