ఇప్పుడు కాదు.. అంతా ఫలితాల తర్వాతేనట

ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ తన పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే ఆనవాయితీ లేదు. ఒక్క బీహార్ లోనే నితీష్ కుమార్ ను అక్కడి పరిస్థితులను బట్టి [more]

Update: 2021-01-28 18:29 GMT

ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ తన పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే ఆనవాయితీ లేదు. ఒక్క బీహార్ లోనే నితీష్ కుమార్ ను అక్కడి పరిస్థితులను బట్టి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని పార్టీ నేతల నుంచి డిమాండ్ విన్పిస్తుంది. పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లాలన్నది బీజేపీ వ్యూహంగా ఉంది. అయితే పార్టీ నేతలు మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని కోరుతున్నారు.

ముఖ్యమంత్రి అభ్యర్థి కోసం….

నిజానికి అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి కోసం బీజేపీ కేంద్ర నాయకత్వం అన్వేషణ ప్రారంభించింది. ఆర్ఎస్ఎస్, విహెచ్.పి సలహాలను కూడా ఇందుకు స్వీకరిస్తుంది. ఇప్పటికే ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ లు కొన్ని పేర్లను సూచించినట్లు తెలుస్తోంది. ఇందులో మఠాధిపతులతో పాటు కొందరు పార్టీకి తొలి నుంచి కష్టపడుతున్న వారు కూడా ఉన్నారని సమాచారం. అయితే ఎన్నికలు జరిగి గెలిచే స్థానాలు దక్కిన తర్వాతే బీజేపీ కేంద్ర నాయకత్వం కూర్చుని ముఖ్యమంత్రి ఎవరో ప్రకటిస్తుందని చెబుతున్నారు.

టీఎంసీ నేతలు రావడంతో…..

అయితే ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ నుంచి పెద్దయెత్తున నేతలు వచ్చి చేరుతుండటంతో పార్టీలో తొలినుంచి ఉన్నవారికి అభద్రత ఏర్పడింది. తమను కాదని పదవులు వారు ఎగరేసుకుపోతారేమోనన్న భయం పట్టుకుంది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి, స్థానిక బీజేపీ నేతలకు మధ్య సమన్వయం లేదు. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థి పై పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. దీనికి తోడు బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు సౌమిత్రా ఖాన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

ఎన్నికల తర్వాతనే……

బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ఆయన ప్రకటించడాన్ని తృణమూల్ కాంగ్రెస్ నేతలు తప్పుపడుతున్నారు. ఆయన మమత బెనర్జీకి సరిపడ నేత కాదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నికల తర్వాతనే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకోవడం అనివార్యంగా మారింది. నిజమే బీజేపీకీ ఇక్కడ సరైన ముఖ్యమంత్రి అభ్యర్థి లేడన్న విషయం ఆ పార్టీ నేతలే తమ కామెంట్స్ ద్వారా అంగీకరిస్తున్నారు. మరి కేంద్ర నాయకత్వం ఎలాంటి చర్యలకు దిగుతుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News