బీహార్ ఫలితం రిపీట్ అవుతుందా? రివర్స్ అవుతుందా?

పశ్చిమ బెంగాల్ లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ అన్ని రకాలుగా వ్యూహాలు రచిస్తుంది. ఇప్పటికే అమిత్ షా పశ్చిమ [more]

Update: 2020-12-01 16:30 GMT

పశ్చిమ బెంగాల్ లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ అన్ని రకాలుగా వ్యూహాలు రచిస్తుంది. ఇప్పటికే అమిత్ షా పశ్చిమ బెంగాల్ పర్యటన చేసి వచ్చారు. నోరున్న, బలమైన నేతలను ఇప్పటికే పశ్చిమ బెంగాల్ కు బీజేపీ పంపింది. వ్యూహకర్తలు, ఆర్ఎస్ఎస్ కూడా ఇప్పటికే ఎన్నికల పనిలోకి దిగారని చెబుతున్నారు. బీహార్ ఎన్నికల మాదిరిగానే బెంగాల్ లోనూ ఓట్లను విడదీసి గెలుపు సాధించాలన్నది బీజేపీ లక్ష్యంగా కన్పిస్తుంది.

అంత సులువు కాదని….

అయితే అక్కడ మమత బెనర్జీ పాతుకు పోయి ఉండటంతో అంత సులువు కాదు. మమత పై ఉన్న వ్యతిరేకత వరకూ కొంత క్యాష్ చేసుకోవచ్చేమో గాని, పూర్తి స్థాయిలో విజయం సాధించడం సాధ్యం కాదు. బెంగాల్ లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. అయితే ఇప్పటికే అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతలను బీజేపీలోకి చేర్చుకునే కార్యక్రమాన్ని ప్రారంభించింది. కొంత బలం పెరగడంతో పాటు మానసికంగా టీఎంసీని దెబ్బతీడయమే దీని లక్ష్యమని చెప్పాలి.

అవే కీలకం…

పశ్చిమ బెంగాల్ లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. 150 స్థానాలు వస్తే అధికారం చేజిక్కినట్లే. గత పార్లమెంటు ఎన్నికల్లో 18 స్థానాలను సాధించిన బీజేపీ అదే ఊపుతో అసెంబ్లీని కైవసం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తుంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ లో 60 శాసనసభ స్థానాలు కీలకంగా మారనున్నాయి. ఇక్కడ ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువ. గెలుపోటములు నిర్ణయించేది ఈ వర్గమే. ఈ వర్గం ఎటూ బీజేపీకి వ్యతిరేకమే.

టీఎంసీ వైపు మళ్లకుండా…..

అయితే ఈ 60 స్థానాల్లో ముస్లిం సామాజికవర్గం తృణమూల్ కాంగ్రెస్ వైపు మళ్లకుండా ఇప్పటి నుంచే బీజేపీ వ్యూహాలు రచిస్తుంది. ఎంఐఎం, తృణమూల్ కాంగ్రెస్ పొత్తు కుదరకుండా ఉండేలా ప్లాన్ చేస్తుందంటున్నారు. బీహార్ లో మాదిరిగా ఇక్కడ కాంగ్రెస్ పెద్దగా బలంగా లేదు. అయితే కాంగ్రెస్ ఎన్ని ఓట్లు ఎక్కువ చీల్చుకుంటే అది తమకు లాభమని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద బీహార్ తరహా ఫలితాలు బెంగాల్ లో వస్తాయని బీజేపీ గట్టిగా భావిస్తుంది. అయితే మమత బెనర్జీ ఏ మేరకు బీజేపీ వ్యహాలను తిప్పి కొడతారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News