ఫుట్ సోల్జర్స్ దిగారు… దీదీకి చుక్కలు కనపడతాయా?

పశ్చిమ బెంగాల్ పై భారతీయ జనతా పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. సంస్థాగతంగా బలంగా లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి నేతలను, కరడుకట్టిన కార్యకర్తలను బెంగాల్ లో [more]

Update: 2021-03-20 18:29 GMT

పశ్చిమ బెంగాల్ పై భారతీయ జనతా పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. సంస్థాగతంగా బలంగా లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి నేతలను, కరడుకట్టిన కార్యకర్తలను బెంగాల్ లో బీజేపీ మొహరించింది. ఫుట్ సోల్జర్స్ ఈసారి తమ విజయానికి ప్రధాన కారకులవుతారని బీజేపీ భావిస్తుంది. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి సుశిక్షితులైన కార్యకర్తలు ఇప్పటికే బెంగాల్ కు చేరుకున్నారు. వీరి పనంతా బీజేపీ నేతల విజయానికి అనుకూలంగా ప్రచారం చేయడమే.

ప్రతి నియోజకవర్గంలో….

ప్రతి నియోజకవర్గానికి ఒక ముఖ్యనేతను ఇన్ ఛార్జిగా బీజేపీ నియమించింది. ఆ నియోజకవర్గంలో ప్రధాన ప్రాంతాలకు మళ్లీ మరొక ఇన్ ఛార్జిని నియమించింది. ఇక బూత్ కమిటీలు ఎటూ ఉండనే ఉన్నాయి. వీరందరికి తోడు ఫుట్ సోల్జర్స్ కూడా రంగప్రవేశం చేశారు. ఇంటింటికి తిరుగుతూ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. మమత బెనర్జీ పాలనపై విమర్శలను కూడా వారు చేస్తున్నారు.

ముఖ్యమైన స్థానాలపైనే….

వీరందరికీ ఎక్కడికక్కడ వసతిని స్థానిక బీజేపీ నేతలు కల్పించారు. వీరు ఉదయం బయలుదేరి రాత్రి పదిగంటలకు తమ శిబిరాలకు చేరుకుంటారు. పశ్చిమ బెంగాల్ లో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనుకుంటున్న బీజేపీ 120 స్థానాలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. మమత బలంగా ఉన్న చోట మాత్రమే కాకుండా కాంగ్రెస్, సీపీఐల ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై కూడా ప్రత్యేకంగా కమలనాధులు ఈసారి ఫోకస్ పెట్టారు.

పొరుగు రాష్ట్రాల నుంచి…..

ఇక మోదీ ప్రచారం తమకు కలసి వస్తుందని భావిస్తున్నారు. పదేళ్లుగా మమత బెనర్జీ పాలన చూసి విసిగిపోయిన ప్రజలు తమనే ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని బీజేపీ బలంగా విశ్వసిస్తుంది. అందుకే పొరుగు రాష్ట్రాలైన బీహార్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి క్యాడర్ ను రంగంలోకి దించింది. ప్రజలను తమ వశం చేసుకునేందుకు ఫుట్ సోల్జర్స్ నిరంతరం పనిచేస్తుండటంతో గెలుపు ఖాయమని బీజేపీ భావిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News